Optimal Thyroid : థైరాయిడ్ గ్రంథి మన శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, మొత్తం ఆరోగ్యానికి కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. లైఫ్ స్టైల్, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మందిలో థైరాయిడ్ సమస్యలు (హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం) పెరుగుతున్నాయి. మందులతో పాటు.. కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచవచ్చు. అంతే కాకుండా దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
1. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం:
థైరాయిడ్ హార్మోన్ల తయారీకి, క్రియాశీలం కావడానికి కొన్ని కీలక పోషకాలు అవసరం. వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.
అయోడిన్: థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ అత్యవసరం. అయోడైజ్డ్ ఉప్పు, సీవీడ్ , చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులలో అయోడిన్ లభిస్తుంది.
సెలీనియం: ఇది థైరాయిడ్ హార్మోన్ ను క్రియాశీల రూపంలోకి మార్చడంలో సహాయపడుతుంది. బ్రెజిల్ నట్స్ (రోజుకు ఒకటి లేదా రెండు), సన్ ఫ్లవర్ గింజలు, గుడ్లు, పుట్టగొడుగులలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది.
జింక్ : థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణకు జింక్ అవసరం. గుమ్మడి గింజలు, బీన్స్, చిక్కుళ్ళు తీసుకోవడం మంచిది.
యాంటీఆక్సిడెంట్లు: బెర్రీలు, తాజా ఆకుకూరలు మరియు రంగురంగుల పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు థైరాయిడ్ గ్రంథిని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.
క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి గోయిట్రోజెనిక్ ఆహారాలను పచ్చిగా కాకుండా బాగా ఉడికించి పరిమితంగా తీసుకోవాలి. ప్రత్యేకించి హైపోథైరాయిడిజం ఉన్నవారు. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరను తగ్గించడం మంచిది.
2. ఒత్తిడి:
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి.. ఇది థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
యోగా, ధ్యానం: రోజువారీ ధ్యానం, యోగా చేయడం ద్వారా ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఇది థైరాయిడ్ పనితీరుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
సరిపడా నిద్ర: రాత్రిపూట 7-8 గంటలు నాణ్యమైన నిద్ర తప్పనిసరి. నిద్ర లేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది.
3. క్రమం తప్పకుండా వ్యాయామం :
శారీరక శ్రమ జీవక్రియను మెరుగుపరచడంలో అంతే కాకుండా బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
వాకింగ్ : ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు చురుకైన వాకింగ్ లేదా రన్నింగ్ అలవాటు చేసుకోవాలి.
బలం పెంచే వ్యాయామాలు : కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు జీవక్రియను మెరుగుపరచి, థైరాయిడ్ పనితీరుకు పరోక్షంగా సహాయపడతాయి.
శారీరక శ్రమ థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో తరచుగా కనిపించే అలసట లక్షణాన్ని కూడా తగ్గిస్తుంది.
Also Read: ఆరెంజ్ కంటే.. ఎక్కువ విటమిన్ సి ఉన్న పవర్ ఫుడ్స్ ఇవే !
4. నీరు, లైఫ్ స్టైల్ :
హైడ్రేటెడ్‌గా ఉండటం: శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి.
విటమిన్ డి: విటమిన్ డి లోపం ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలకు (హాషిమోటోస్ వంటివి) దారితీయవచ్చు. ప్రతిరోజూ కొంత సమయం సూర్యరశ్మిలో గడపడం లేదా అవసరమైతే సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది.
డాక్టర్ల పర్యవేక్షణ: థైరాయిడ్ సమస్య ఉన్నవారు డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం, ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఏ అలవాటునైనా లేదా ఆహార మార్పునైనా డాక్టర్ సలహా మేరకు మాత్రమే పాటించాలి.