Cyber Crime: సైబర్ నేరాలకు, AI సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగానికి ఉదాహరణగా మరొక ఘటన వెలుగు చూసింది. తన ముగ్గురు సోదరీమణుల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) జనరేటెడ్ అశ్లీల చిత్రాలు, వీడియోలతో లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ భారీన పడ్డ 19 ఏళ్ల యువకుడు రాహుల్ భారతీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది.
స్థానికి డీఏవీ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ భారతీ, రెండు వారాలుగా సరిగా తినడం లేదని, నిద్ర పోవడం లేదని తండ్రి మనోజ్ భారతీ తెలిపారు. రాహుల్ ఫోన్ హ్యాక్‌కు గురైందని, ఈ క్రమంలో ఫోన్ లోని తన సిస్టర్స్ ఫోటోలను అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఆశ్లీల ఫోటోలు, వీడియోలుగా రూపొందించి బ్లాక్ మెయిల్‌కు దిగారని మనోజ్ తెలిపారు.
ALSO READ: Delhi Crime: ప్రియుడిని దారుణంగా ప్లాన్ చేసి హత్య చేసిన ప్రియురాలు.. చివరకు ఏమైందంటే?
“రాహుల్ ఫోన్‌కు ఎవరో నా కూతుళ్ల అశ్లీల వీడియోలు, ఫోటోలను పంపి, వాటిని వైరల్ చేస్తానని బెదిరిస్తున్నారు. దీని వల్ల రాహుల్ చాలా బాధపడ్డాడు. మానసిక హింస కారణంగా, అతను విషం తాగాడు. అతన్ని వేధిస్తున్నారు” అని మృతుడు రాహుల్ తండ్రి తెలిపారు. రాహుల్ ఆరోగ్యం తీవ్రంగా మారడంతో ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ రాహుల్ మృతి చెందినట్లు మనోజ్ తెలిపారు. రాహుల్ తల్లి మీనా దేవి మాట్లాడుతూ… ఈ కుట్రలో తన మరిది ప్రమేయం ఉందని ఆరోపించింది. ఆమె అతనితో ఆరు నెలల క్రితం గొడవ పడింది. అతను, ఒక అమ్మాయితో కలిసి ఈ పథకం పన్నాడని అనుమానం వ్యక్తం చేసింది.
పోలీసుల దర్యాప్తులో రాహుల్ ఫోన్ నుంచి సాహిల్ అనే వ్యక్తితో వాట్సాప్ సంభాషణను గుర్తించారు. న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపి.. రూ. 20 వేలు ఇవ్వకపోతే, వాటిని సోషల్ మీడియాలో పెడతానని సాహిల్ బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య చాలా ఆడియో, వీడియో కాల్స్ జరిగినట్లుగా, అడిగిన డబ్బు ఇవ్వకపోతే తాను చెప్పింది చేస్తానని బెదిరించినట్లుగా పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.