Karimnagar DCC President : జిల్లా అధ్యక్షుల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది… సంస్థాగత ఎన్నికలను పండగలా నిర్వహించేందుకు రెడీ అయ్యారు అధిష్టానం దూతలు….. కరీంనగర్ జిల్లాలో తమ అనుచరులను అధ్యక్షులుగా చేసేందుకు మంత్రులు శీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అల్లాడితెరవెనక తమదైన శైలిలో పనిచేస్తున్నారట ఆ మినిస్టర్స్.. అయితే పేరుకు అబ్జర్వర్స్ వచ్చినా… పెత్తనం మాత్రం మంత్రులదే నడుస్తోందంట… చెంబులో ఉన్న నీళ్లు శంఖులో పోయగానే తీర్థం అయినట్టు… పరిశీలకుల దృష్టి తాము బరిలో దింపిన వారిపై పడేలా పావులు కదుపుతున్నారట. ఈ ఎన్నికలతో పార్టీలో తమ పట్టు నిలుపుకునేందుకు చేస్తున్న మంత్రుల ప్రయత్నాలు ఫలిస్తాయా..?
క్యాడర్ అభిప్రాయాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి…. పాత జిల్లా పరిధిలోని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులకు జరుగుతున్న ఎన్నికలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి… అయితే గతంలో లాగా డీసీసీ అధ్యక్షులను అధిష్టానం డిసైడ్ చేయకుండా… నాయకుల నుంచి అప్లికేషన్లు తీసుకుని ఆయా నేతలపై క్యాడర్ అభిప్రాయాలను సేకరించి అధ్యక్షులను ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది…
భవిష్యత్‌లో పార్టీ పదవులకు, ఎన్నికల్లో టికెట్లకు… డీసీసీలే ప్రామాణికం అని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పదవులకు ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది…. మంచి ప్రాధాన్యత ఉన్న పదవి కావడంతో దక్కించుకోవడం కోసం ఆయా జిల్లాల నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు… మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు కూడా తమకు నమ్మకమైన వారికి ఆ పదవి దక్కేలా చేసేందుకు సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తున్నారట…. మంత్రులు పట్టించుకోవడం ప్రారంభించాక సంస్థాగత ఎన్నికల పర్వం ఉత్కంఠ భరితంగా మారింది..
అయితే ఆయా జిల్లాల పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ ప్రధానంగా ఇద్దరు ముగ్గురి మధ్యే పోటీ నెలకొందట… పోటీలో ఉన్నవారు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల్లో ఎవరో ఒకరి అండదండలున్నవారే… వాస్తవంగా అఖిలభారత కాంగ్రెస్ నిర్ణయించిన విధంగా కార్యకర్తల అభిప్రాయ సేకరణ ప్రకారం డీసీసీ ప్రెసిడెంట్‌లను నిర్ణయిస్తున్న నేపథ్యంలో క్యాడర్‌ను సమీకరించుకుని తమ అనుచరుడికి పాజిటివ్ సమాచారం వచ్చేలా మంత్రులు ఫోన్‌లు చేస్తున్నారట.
కొన్ని చోట్ల నేతలే స్వయంగా మండల స్థాయి నేతలను మంత్రులతో మాట్లాడించారట… దీంతో పార్టీ పరిశీలకులకు అభిప్రాయాలను చెప్పాల్సిన క్యాడర్ పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారిందట. నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభిప్రాయ సేకరణ కాస్త బల ప్రదర్శనగా మారిందట… కరీంనగర్‌లో అయితే తోపులాటకు దారితీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు… ఈ గలాటా పక్కా ప్లాన్‌తో జరిగిందని పార్టీ నేతలే బాహాటంగా మాట్లాడుకుంటున్నారట… కరీంనగర్ డీసీసీ విషయానికొస్తే… చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ల అనుచరుల మధ్యే పోటీ నడుస్తోందట.
మధ్యలో పార్లమెంటు ఇంచార్జీ వెలిచాల రాజేంద్రరావు ఎంట్రీ ఇవ్వడంతో రసవత్తరంగా మారిందట… పొన్నం అనుచరులు పద్మాకర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌లు బరిలో ఉండగా ఒకరికి డీసీసీ, ఒకరికి నగర కాంగ్రెస్ పదవి దక్కేలా ప్రయత్నాలు సాగుతున్నాయట. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సుడా చైర్మన్ నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఈసారి డీసీసీ కోసం ప్రయత్నాలు సీరియస్‌గానే చేస్తున్నారు.
ఇక పోటీలో ఉన్న రాజేందర్‌రావు గాంధీభవన్ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారట. అభిప్రాయ సేకరణ రోజు జరిగిన రసాభాస నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు… అయితే అనుచరుల కంటే ఇద్దరు మంత్రులే ఒకింత పట్టుమీద ఉన్నతరుణంలో మధ్యే మార్గంగా మేడిపల్లి సత్యం పేరు ఖరారు అవుతుందనే ప్రచారమూ సాగుతోందట….
సిరిసిల్ల డీసీసీ విషయానికొస్తే… ఇక్కడ నుంచి నిర్వాసిత గ్రామాల జాక్ లీడర్ కూస రవీందర్ మంత్రి పొన్నం అండతో బరిలోకి దిగగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సపోర్ట్‌తో మరో నేత రంగంలో ఉన్నారట. సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి పదవికి మహేందర్‌రెడ్డి కూడా బరిలో ఉండటంతో అటు మంత్రి పొన్నం మాట నెగ్గుతుందా…? ఆది అనుచరులకు దక్కుతుందా..? కే.కే మహేందర్‌రెడ్డి ని అధ్యక్షున్ని చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది… అయితే మహేందర్‌రెడ్డికి వయోభారం… యాక్టివ్‌గా లేకపోవడం… బీసీ వాదం ట్రెండింగ్‌లో ఉన్న తరుణంలో పొన్నం ఆ దిశగా పావులు కదుపుతున్నారనే టాక్ ఉంది.
సిరిసిల్ల జిల్లాకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా పెద్ద దిక్కుగా ఉన్న ఆది శ్రీనివాస్ ఎలా రెస్పాండ్ అవుతారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది… మరోవైపు జగిత్యాల విషయానికొస్తే. అక్కడ పోటీ పెద్దగా లేకపోవడం…మంత్రి శ్రీధర్ బాబు అండ ఉంటే చాలు అన్నట్టుగానే మారిందట పరిస్థితి… ఇప్పటికే ఆయన అనుచరుడు కల్వకుంట్ల సుజిత్ రావు బరిలో ఉండగా… కోరుట్ల పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట… మరోవైపు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అయితే డైరెక్టుగా తన అనుచరుడు నందయ్య పేరు ప్రకటించేశారు.
ప్రస్తుత అధ్యక్షుడు మంత్రి అడ్లూరి కూడా తన ప్రధాన అనుచరుడు సంగనభట్ల దినేష్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట… మంత్రి శ్రీధర్ బాబును కాదని అడ్లూరి అడుగు వేయరనే టాక్ ఉన్న నేపథ్యంలో జగిత్యాల డీసీసీ ఆయన చెప్పిన వారికే దక్కే అవకాశాలున్నాయి… పెద్దపల్లి డీసీసీకి సంబంధించి చిత్రమైన పరిస్థితి నెలకొందట… మిగతా జిల్లాల్లో తన అనుచరులకు సపోర్ట్ ఇస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు పై ప్రచారం సాగుతున్న తరుణంలో సొంత జిల్లాలో మాత్రం… అందరూ తన అనుచరులే బరిలో ఉండటం ఆయనకు కాస్త ఇబ్బందిగా మారిందట.
ఎవరిని కాదన్నా ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నాయని భావిస్తున్న ఆయన…. ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైపే మొగ్గు చూపుతున్నారట… ప్రస్తుతం ఉన్న వారికి తిరిగి రెన్యూవల్ లేదని పార్టీ ప్రకటించినప్పటికీ ఆయన కేవలం మూడేళ్లే పదవిలో ఉన్నాడు కాబట్టి… తిరిగి కొనసాగించాలని కోరుతున్నారట.. ఇంతకాలం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న మంత్రులు… సడన్‌గా పార్టీ పదవుల భర్తీ విషయంలో ప్రతిష్టగా తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు సమన్వయం చేయాల్సిన వారు సైలెంట్‌గా ఉండటంతో పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఉమ్మడి జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేదని కింది స్థాయి నేతలంటున్నారట. ఇప్పుడు క్యాడర్ నిర్ణయమే ఫైనల్ అయిన పార్టీ అధిష్టానం చెప్పినప్పటికీ… జిల్లాపై మంత్రులు తమ పట్టును కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయో చూడాలి… ఏదో ఫార్మాలిటీకి అభిప్రాయ సేకరణ అన్నట్టుగా మారుతుందా..? గతంలో లాగా లీడర్ మాట చెల్లుతుందా…? క్యాడర్ మాటకు కూడా విలువ దక్కుతుందా..? అనేది డీసీసీ అధ్యక్షుల ఎన్నిక తేటతెల్లం చేస్తుందా…? వేచి చూడాలి
story by Apparao, Big tv