Yogamudrasana: నేటి ఈ ఆధునిక జీవనశైలిలో మన జీవనం ఉరుకుల పరుగుల మధ్యే సాగిపోతోంది. చక్కటి ఆరోగ్యం కోసం రోజూ కాస్త సమయాన్ని వెచ్చించే పరిస్థితి కూడా లేని విధంగా బిజీ లైఫ్‌ని గడిపేస్తున్నాం. దీంతో మన శరీరం అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతుంటుంది. దీనికి తోడు అటు ఆఫీస్ వర్క్, ఇటు ఇంటి పనుల వల్ల ఒత్తిడి, చిరాకు, కోపం, ఆందోళన లాంటివి వచ్చి చేరిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. రోజులో కొన్ని నిమిషాలు మనకంటూ, మన ఆరోగ్యం కోసం కేటాయిస్తే చాలు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అంటున్నారు నిపుణులు.
దాని కోసం ‘యోగముద్రాసన’ వేయాల్సిందేనట. ఈ ఆసనంతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదండోయ్. మరి యోగముద్రాసన వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
* యోగముద్రాసన అనేది మనలోని ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గించడానికి సహకరిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* యోగ ముద్రాసన వల్ల కీళ్లు, కండరాలు సాగడం, మానసిక ప్రశాంతత లభించడం, ఒత్తిడి తగ్గడం, శారీరక వశ్యత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.
* తుంటి, తొడలు, మోకాళ్లు, చీలమండలు, ఉదరం, భుజాలు, చేతులు, ఛాతీ వంటి శరీర భాగాల్లో కండరాలు, కీళ్లు సాగడం వంటి మార్పులు నిత్యం జరుగుతుంటాయి.
* వినికిడి సమస్య ఉన్నవాళ్లకి ఈ యోగముద్రాసన బాగా పనిచేస్తుంది. చెవిపోటును తగ్గించి, వినికిడి సామర్థ్యాన్ని పెంచడంలో సాయపడుతుంది.
* థైరాయిడ్‌కు యోగముద్రాసన ఎంతో మేలు చేస్తుంది. అలాగే నరాల బలహీనతను సరిచేసి, మంచి రక్తప్రసరణకు తోడ్పడుతుంది.
* ఈ ఆసనంతో పార్శ్వపు నొప్పి, తలనొప్పి, ఒత్తిడి తొలగిపోతాయి. ముఖంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరగడంతో కండరాలు చైతన్యవంతం అవుతాయి.
* యోగముద్రాసన వల్ల ముఖం కాంతిమంతంగా మారడంతో పాటు బ్రహ్మచర్యానికి ఉపయోగపడుతుంది. అనేక రకాల లైంగిక వ్యాధులను తొలగిస్తుంది.
యోగముద్రాసన వేయాలంటే ముందుగా.. మ్యాట్‌పైన కాళ్లు చాచి కూర్చోవాలి. తర్వాత నిదానంగా పద్మాసనంలోకి రావాలి. పద్మాసనం వేయడం కుదరని వాళ్లు సుఖాసనంలో
కూర్చుంటే సరిపోతుంది. ఆ తర్వాత రెండు చేతుల్ని వెనక్కి తీసుకెళ్లి.. కుడి చేతిని పిడికిలి బిగించి ఉంచి, ఎడమ చేత్తో కుడి మణికట్టును పట్టుకోవాలి. ఇప్పుడు నడుమును నిటారుగా చేసి ఊపిరితిత్తుల నిండుగా గాలి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆపై గాలి వదులుతూ మెల్లగా ముందుకు వంగుతూ మీ నుదిటిని నేలపైన ఆన్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ శ్వాసతీసుకుంటూ.. ఆసన స్థితిలో అలానే 12 నుంచి 15 సెకన్ల వరకు ఉండాల్సి వస్తుంది. తర్వాత నెమ్మదిగా యథాస్థానానికి గాలి తీసుకుంటూ పైకి లేచి కూర్చొని, చేతులను విడుదల చేసి కాళ్లను చాచి విశ్రాంతి తీసుకోండి. ఇలా ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు యోగముద్రాసన వేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఒత్తిడి, చిరాకు, ఆందోళన వంటివి దరిచేరకుండా ఉంటుందంటున్నారు యోగా నిపుణులు.