Headache: తలనొప్పి అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. తరచుగా వచ్చే తలనొప్పికి వెంటనే మాత్రలు వేసుకోవడం కంటే.. కొన్ని సహజమైన, సులభమైన ఇంటి చిట్కాల ద్వారా ఉపశమనం పొందవచ్చు. అయితే.. తలనొప్పి తరచుగా లేదా తీవ్రంగా ఉంటే, తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి. సాధారణ తలనొప్పిని తగ్గించడానికి సహాయపడే కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. తగినంత నీరు తాగడం:
డీహైడ్రేషన్ కారణం: చాలా సార్లు, తలనొప్పికి ప్రధాన కారణం శరీరంలో నీటి శాతం తగ్గడ కావచ్చు. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల మెదడు కణజాలం కాస్త సంకోచించి నొప్పికి దారితీస్తుంది.
చిట్కా: తలనొప్పిగా అనిపించగానే వెంటనే ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకుంటే తలనొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది.
2. విశ్రాంతి, ప్రశాంతమైన వాతావరణం:
విశ్రాంతి: ఎక్కువ శ్రమ లేదా ఒత్తిడి వల్ల తలనొప్పి వస్తే, కొద్దిసేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.
చీకటి గది: ప్రకాశవంతమైన కాంతి , పెద్ద శబ్దాలు తలనొప్పిని పెంచుతాయి. కాబట్టి.. తలనొప్పిగా ఉన్నప్పుడు, లైట్లు ఆపివేసి, నిశ్శబ్దంగా ఉండే గదిలో పడుకోవడం లేదా కూర్చోవడం మంచిది.
3. కోల్డ్/హాట్ కంప్రెస్:
కోల్డ్ కంప్రెస్: నుదిటిపై లేదా మెడ వెనుక భాగంలో చల్లటి గుడ్డ లేదా ఐస్ ప్యాక్‌ను ఉంచడం వల్ల రక్తనాళాలు సంకోచించి, వాపు తగ్గి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
హాట్ కంప్రెస్: టెన్షన్ తలనొప్పి ఉన్నప్పుడు.. వేడి నీటిలో పాదాలను ఉంచడం లేదా వెచ్చని టవల్‌ను మెడ వెనుక భాగంలో వేయడం వల్ల కండరాలు సడలించి, రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పి తగ్గుతుంది.
4. సహజ నూనెల మసాజ్ :
పుదీనా నూనె: పుదీనా నూనెలో మెంథాల్ ఉంటుంది. ఇది కండరాలను సడలించే గుణం కలిగి ఉంది. ఈ నూనెను నుదిటిపై లేదా కణతలపై సున్నితంగా మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.
లావెండర్ నూనె : లావెండర్ నూనెను వాసన చూడటం లేదా మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మైగ్రేన్ వంటి తలనొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
Also Read: ఆరెంజ్ కంటే.. ఎక్కువ విటమిన్ సి ఉన్న పవర్ ఫుడ్స్ ఇవే !
5. అల్లం, కెఫిన్:
అల్లం టీ: అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు కొద్దిగా అల్లం ముక్కను నమలడం లేదా అల్లం టీ తాగడం వల్ల నొప్పి, వికారం తగ్గుతాయి.
కెఫిన్: కొంతమందిలో.. కాఫీ లేదా టీలో ఉండే కెఫిన్, తలనొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది. అయితే కెఫిన్ అధికంగా తీసుకోవడం కూడా తలనొప్పికి కారణం కావచ్చు. కాబట్టి.. మితంగా తీసుకోవడం ముఖ్యం.
6. ధ్యానం, శ్వాస వ్యాయామాలు:
ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం సహాయపడతాయి. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండి, తలనొప్పి తగ్గుతుంది.
ఈ సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు ఎలాంటి మందులు లేకుండానే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయినప్పటికీ.. తలనొప్పి తరచుగా లేదా దీర్ఘకాలంగా వేధిస్తుంటే.. సరైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.