Anantapur: ఎవరైనా ఆ భూమి మాది.. ఆ స్థలం మాది అంటారు. కానీ.. వాళ్లు మాత్రం.. ఊరంతా మాదే అంటున్నారు. ఊళ్లో ఖాళీగా ఉన్న చోటల్లా.. బోర్డులు పాతేస్తున్నారు. దశాబ్దాల వివాదం తెరమీదకు రావడంతో.. ఊరు కోసం ఉద్యమం పుట్టింది. సేవ్ పాపంపేట అంటూ.. పోరాటం మొదలుపెట్టారు. అసలు.. అనంతపురం శివారులో ఉన్న పాపంపేట గ్రామం.. అందరిదా? ఆ కొందరిదా? అసలు.. అక్కడేం జరుగుతోంది?
మనందరికీ.. సొంతిల్లు ఉన్నట్లే.. సొంతూరు కూడా ఉంటుంది. దశాబ్దాలుగా పుట్టి, పెరిగిన నేలని.. మనతో కలిసున్న మనుషుల్ని కలిపి.. ఇది మా ఊరు అని చెప్పుకుంటాం. కానీ.. ఏళ్ల తర్వాత కొందరు వచ్చి.. ఊరంతా మా సొంతం.. ఖాళీగా ఉన్న జాగాలన్నీ మా జాగీర్ అంటే.. ఆ ఊరు ప్రజలకు మండుతుందా? లేదా? అనంతపురం శివార్లలో ఉన్న పాపంపేటలోనూ.. ఇదే జరిగింది. అప్పుడెప్పుడో స్వాతంత్ర్యం రాకముందు జరిగిన భూ వ్యవహారాన్ని పట్టుకొని.. మళ్లీ ఇన్నాళ్లకు వచ్చి.. పాపంపేట గ్రామం మొత్తం మాదే అంటున్నారు కొందరు వ్యక్తులు. 75 ఏళ్ల తర్వాత.. ఊరంతా మాదేనని.. వెంకట చౌదరి, శ్రీరాములు అనే వ్యక్తులు జీపీఏ పొందారు. అయితే.. నెల్లూరు సెటిల్మెంట్ ద్వారా గ్రామ భూమి తమకు సొంతమైందని.. గ్రామస్తులు వాదిస్తున్నారు. దీనికి సంబంధించి.. వారి దగ్గరున్న పత్రాలను కూడా చూపిస్తున్నారు.
పాపంపేటలో ఈ వివాదానికి మూలకారణం.. సర్వే నెంబర్ 108. ఇక్కడ వెలిసిన కొన్ని షాపులను.. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు తొలగించారు. అప్పట్లో.. కోర్టు ఆర్డర్ ఉండటంతో.. ఎవరూ అడ్డు చెప్పలేదు. దాంతో.. కోర్టు ఆదేశాలను ఆధారంగా చేసుకొని.. ఊళ్లోని మిగతా భూమి మొత్తం తమదేనని.. జీపీఏలు పొందిన వ్యక్తులు వాదిస్తున్నారు.
ఇదంతా.. ఇనాం భూముల దగ్గర మొదలైంది. స్వాతంత్ర్యం రాకముందు.. 1866లో పి.శేషగిరిరావుకు బ్రిటీష్ కాలం నాటి భూ రికార్డుల ప్రకారం.. సర్వే నెంబర్ 27 ద్వారా 932 ఎకరాలున్న పాపంపేట గ్రామాన్ని ఇనాంగా మంజూరు చేశారు. ఆయన ఈ భూమిని.. 1879లో కె.వెంకటరావుకు 500 రూపాయలకు విక్రయించారు. 1910 తర్వాత వెంకట్రావు ఈ భూమి మొత్తాన్ని.. గొల్లపల్లి లక్ష్మీనరసింహశాస్త్రికి 2 వేల రూపాయలకు విక్రయించారు. ఆ తర్వాత.. నరసింహశాస్త్రి కుటుంబసభ్యులైన సీతారామయ్య, శంకరయ్య, రాచూరి వెంకటరమణశాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యం కలిపి 173 ఎకరాలు ఇతరులకు విక్రయించారు. మిగిలిన భూమిని 1952లో పంచుకున్నారు. అప్పుడు.. గొల్లపల్లి కుటుంబానికి 209 ఎకరాలు, రాచూరి కుటుంబానికి 550 ఎకరాలు దక్కింది. ఈ రెండు కుటుంబాలు తమకు సంక్రమించిన భూమిని.. తమ అవసరాల నిమిత్తం 1964 వరకు కొద్దికొద్దిగా అమ్ముతూ వచ్చాయి. అయితే.. ఎంత అమ్మారు? ఇంకా.. వారి ఆధీనంలో ఎంత ఉంది? అనేదానికి సంబంధించి రికార్డులు లేవు. కానీ.. 1956లోనే ఇనాం చట్టం రద్దయిపోయింది. అప్పుడు.. నెల్లూరు కలెక్టరేట్ కింద ఉన్న పాపంపేట గ్రామంలోని ప్రజలకు.. నెల్లూరు సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా.. భూమిని కేటాయించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం.. 7 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పాపంపేట గ్రామంలో.. 15 వేల కుటుంబాల దాకా నివాసముంటున్నాయి. సుమారు 70 ఏళ్ల తర్వాత.. ఈ ఊరంతా మాదే అంటూ కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. భూమి మొత్తం తమదేనని.. ఎవ్వరూ క్రయవిక్రయాలు చేయరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దాంతో.. గ్రామస్తులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ బోర్డులు ఏర్పాటు చేసిన వాళ్లు.. రాజకీయ నేతల అండతో ఫేక్ జీపీఏలు పొంది.. ఊరంతా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పాపంపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పాపంపేట భూముల వివాదం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారడంతో.. ఆ భూములకు వారసులమని చెప్పుకుంటున్న వారు కూడా మీడియా ముందుకొచ్చారు. ఈ భూములపై సర్వ హక్కులూ తమకే ఉన్నాయంటున్నారు. తాము.. ఇప్పటికే ఇళ్లు కట్టుకుంటున్న వారి జోలికి వెళ్లట్లేదని.. కేవలం ఖాళీ స్థలాల గురించే కోర్టులో ఫైట్ చేస్తున్నామని చెబుతున్నారు. ప్రతిసారీ పాపంపేటకు వచ్చే తీరిక లేక.. తమకు సన్నిహితులైన శ్రీరాములుకు GPA ఇచ్చామని చెబుతున్నారు. ఎన్నో రోజులుగా.. ఈ భూముల కోసం ఫైట్ చేస్తున్నామని తెలిపారు. ఇదివరకే.. ఈ భూముల దగ్గరికి వెళితే.. తమని బెదిరించి, దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. అందువల్ల.. తాము లీగల్‌గానే ఈ వ్యవహారంపై ముందుకెళ్లాలని నిశ్చయించున్నట్లు చెబుతున్నారు.
పాపంపేట భూ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు కలెక్టర్ ఆనంద్. ఎవరి తప్పున్నా వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పటికే.. ఈ ఇష్యూకి సంబంధించి ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలను అనుసరించి నడచుకుంటామన్నారు కలెక్టర్ ఆనంద్.
మొత్తానికి.. పాపంపేట గ్రామ ప్రజలంతా.. సేవ్ పాపంపేట అనే నినాదంతో పోరాటం మొదలుపెట్టారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. తమ ఊరిని కాపాడుకునేందుకు.. గ్రామ పరిరక్షణ సమితిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైతే.. ఊరి కోసం ఎంతవరకైనా తెగించి పోరాడతామని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? అధికారులు ఏవిధంగా ముందుకెళ్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Story by Anup, Big tv