Diwali: దేశమంతా దీపావళి సందర్భంగా దీపాలు.. టపాసుల వెలుగులతో ఉల్లాసంగా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఉన్న సమ్మూ గ్రామం మాత్రం చీకటిని అలుముకుంటుంది. తరతరాలుగా వస్తున్న శతాబ్దాల నాటి ‘సతీ’ శాపం కారణంగా ఈ గ్రామం ప్రజలు దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు.
జిల్లా ప్రధాన కేంద్రం నుంచి సుమారు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న సమ్మూ గ్రామస్థులు కేవలం చిన్న దీపాలను వెలిగించడానికి మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ టపాసులు కాల్చడం, ఆడంబరమైన వేడుకలు జరుపుకోవడంపై నిషేధం ఉంది. ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే ఏదైనా విపత్తు లేదా అపశకునం జరుగుతుందని గ్రామస్తులు దృఢంగా నమ్ముతారు.
ఏమిటా శాపం ?
గ్రామ పెద్దల కథనం ప్రకారం.. కొన్ని వందల సంవత్సరాల క్రితం.. ఒక గర్భిణీ స్త్రీ దీపావళి పండగ కోసం సిద్ధమవుతోంది. అదే సమయంలో, స్థానిక రాజు సైన్యంలో పనిచేస్తున్న ఆమె భర్త మరణించాడనే వార్త వచ్చింది. భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో.. తీవ్ర దుఃఖంలో మునిగిన ఆ మహిళ, తన భర్త చితి మంటల్లోకి దూకి ఆత్మార్పణం చేసుకుంది.
అయితే.. ఆమె ప్రాణం పోయే ముందు, ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి ఒక శాపం పెట్టింది. “ఈ గ్రామంలో ప్రజలు ఎప్పటికీ దీపావళి పండుగను జరుపుకోకూడదు. ఎవరైనా ఆ రోజు వేడుకలు జరుపుకోవడానికి ప్రయత్నిస్తే.. ఎవరో ఒకరు మరణిస్తారు లేదా గ్రామానికి ఏదైనా విపత్తు సంభవిస్తుంది” అని శపించిందని గ్రామస్తులు చెబుతుంటారు.
శాపం ప్రభావం నేటికీ..
ఆనాటి నుంచి.. గ్రామస్థులు ఈ శాపానికి భయపడి దీపావళి వేడుకలను పూర్తిగా మానేశారు. ఎవరైనా ఈ కట్టుబాటును ధిక్కరించి పండగ చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు.. గ్రామంలో ఏదో ఒక చెడు జరగడం, ఎవరైనా మరణించడం వంటివి జరిగాయని పెద్దలు చెబుతుంటారు. ఈ భయం ఎంతగా ఉందంటే.. దీపావళి రోజున చాలా మంది గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వెనుకాడతారు.
ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి గ్రామస్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. పూజలు, హవనాలు, యజ్ఞాలు నిర్వహించారు. మూడేళ్ల క్రితం పెద్ద ఎత్తున యజ్ఞం కూడా నిర్వహించినప్పటికీ.. శాపం ప్రభావం ఇంకా తగ్గలేదని అంతా అనుకుంటున్నారు.
శతాబ్దాలు గడిచినా.. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, ఒక పురాతన శాపం ఇప్పటికీ ఒక గ్రామాన్ని వెలుగుల పండగకు దూరం ఉంచుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ గ్రామానికి చెందిన యువత మాత్రం ఏదో ఒక రోజు దీపావళిని ఘనంగా జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.