Morning walk Or Evening walk: వాకింగ్ వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. డబ్బు ఖర్చు లేకుండా అందరూ సులభంగా చేయగలిగే ఉత్తమమైన వ్యాయామం ఇది. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు అంతే కాకుండా మానసిక ప్రశాంతకు వాకింగ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇదిలా ఉంటే చాలా మందిలో ఉదయం వాకింగ్ చేయడం ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందా లేక సాయంత్రం చేయడం మంచిదా అనేక సందేహం ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీవక్రియ (మెటబాలిజం) వేగం పెరుగుదల: ఉదయం పూట వాకింగ్ చేయడం అనేది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఖాళీ కడుపుతో నడవడం వల్ల నిల్వ ఉన్న కొవ్వు కరిగి, బరువు తగ్గడానికి కొద్దిగా మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మానసిక ప్రశాంతత, ఉత్సాహం: ప్రశాంతమైన ఉదయపు వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నడవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి, ‘ఫీల్-గుడ్’ హార్మోన్లైన ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇది రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు.. సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించడానికి సహాయ పడుతుంది.
విటమిన్-డి: సూర్యరశ్మి నుంచి శరీరానికి అవసరమైన విటమిన్-డి లభిస్తుంది. ఇది ఎముకల బలం, రోగ నిరోధక శక్తికి చాలా ముఖ్యం.
నిద్ర నాణ్యత: ఉదయం వాకింగ్ చేయడం అనేది జీవ గడియారాన్ని (సర్కాడియన్ రిథమ్) నియంత్రిస్తుంది. దీని వల్ల రాత్రిపూట మంచిగా నిద్ర పడుతుంది.
సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు:
ఒత్తిడి, ఆందోళన తగ్గింపు: రోజంతా పని ఒత్తిడి తర్వాత సాయంత్రం వాకింగ్ అనేది మనసును రిలాక్స్ చేస్తుంది. అంతే కాకుండా మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.
కండరాల పనితీరు మెరుగుదల: సాయంత్రం వేళల్లో కండరాల పనితీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ సమయంలో చేసే వ్యాయామం కండరాలకు పూర్తిస్థాయి కసరత్తు అందించి, గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియకు సహాయం: రాత్రి భోజనం తర్వాత కొద్ది సేపు నడవడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇది సహాయ పడుతుంది.
మంచి నిద్ర: ఒత్తిడి తగ్గడం వల్ల రాత్రిళ్లు కంటి నిండా నిద్ర పట్టడానికి సాయంత్రం చేసే వాకింగ్ దోహద పడుతుంది.
Also Read: పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం.. వీటితో అద్భుతమైన రిజల్ట్
నిజం చెప్పాలంటే.. ఉదయం వాకింగ్ లేదా సాయంత్రం వాకింగ్‌లో ఏది ఉత్తమమైనది అనేది మీ వ్యక్తిగత లక్ష్యాలు, లైఫ్స్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది.
బరువు తగ్గడం, క్రమ శిక్షణ, ఉత్సాహంగా రోజును ప్రారంభించాలనుకుంటే.. ఉదయం వాకింగ్ చేయడం మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి నిద్ర, జీర్ణక్రియ మెరుగుదల కోరుకుంటే.. సాయంత్రం వాకింగ్ మంచిది.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. మీరు ఏ సమయంలో నడిచినా.. క్రమం తప్పకుండా నడవడం ముఖ్యం. మీ బిజీ షెడ్యూల్‌కు ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఎంచుకుని, ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు నడవండి.