Nellore Janasena: నెల్లూరు జిల్లా జనసేన గ్లాసు పగులుతుందా? ఆ నేత ఒంటెద్దు పోకడలను జిల్లా కేడర్ జీర్ణించుకోలేకపోతోందా…? తొలి నుంచి జనసేన పటిష్టతకు పని చేసిన నాయకత్వాన్ని ఆ నేత ఇబ్బందులకు గురిచేస్తూ సొంతపబ్బం గడుపుకుంటున్నారా…? ఆ నేత తీరుపై విసిగి వేసారిన జిల్లా నాయకత్వం ఏకతాటిపైకి వచ్చి తమ ఆవేదనను వెళ్ళబుచ్చడానికి కారణాలేంటి…? ఇప్పుడు ఆ జిల్లాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనలో వర్గ పోరు జనసేనాని దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్న నేతలు ఎవరనే చర్చ భారీగా నడుస్తోంది. ఇంతకీ నెల్లూరు జిల్లా జనసేనలో ఏం జరుగుతోంది?
నెల్లూరు జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న జనసేన
రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో ఎప్పుడు పాలిటిక్స్ వాడివేడిగా ఉంటాయి. ఇక్కడ నేతలు రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అయితే వర్గపోరు కూడా అదే స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో ఒకటైన జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ప్రజారాజ్యం పార్టీ గెలుపొందింది. మెగా ఫ్యామిలీ కి నెల్లూరు జిల్లాలో భారీగా అభిమానులు ఉన్నారు. అలాంటి జిల్లాలో జనసేనను వర్గపోరు ఇరకాటంలో పెడుతుందట. టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తీరుపై ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల జనసేన ఇన్చార్జిలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు రాష్ట్ర నాయకులు ఒకే వేదిక పైకి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని అజయ్ కుమార్ తీరును తప్పుపట్టారు.
పార్టీని వీడి వెళ్లపోయిన మనుక్రాంత్ రెడ్డి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి గ్రౌండ్ లెవల్లో బలమైన కార్యకర్తలు ఉన్నారు. అయితే వారిని నడిపించే నాయకుడే లేకుండా పోయారు. గత ఎన్నికలకు ముందు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి జిల్లా అధ్యక్ష పదవిని ఖాళీగా పెట్టింది అధిష్టానం. అయితే ఎన్నికల కంటే కొంతకాలం ముందు పార్టీలోకి వచ్చిన నెల్లూరు జిల్లాకు చెందిన వేములపాటి అజయ్ కుమార్ జనసేన రాష్ట్ర కార్యాలయంలో చక్రం తిప్పడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లా పై కన్నేసిన అజయ్ కుమార్ జిల్లా నాయకత్వాన్ని తన గుప్పెట్లోకి పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు.
అజయ్‌కుమార్‌కి టిడ్కో చైర్మన్ పదవి కట్టబెట్టిన అధిష్టానం
కూటమి అధికారంలోకి వచ్చాక వేములపాటి అజయ్ కుమార్ కు టిడ్కో చైర్మన్ పదవిని కట్టబెట్టింది అదిష్టానం. ఆ పదవి కూడా నెల్లూరు జిల్లా కోటాలో రావడంతో జిల్లాలో తొలి నుంచి పని చేసిన నాయకత్వం మొత్తం తీవ్రస్థాయిలో ఆగ్రహించింది. అయినప్పటికీ అధిష్టానం ఆదేశాలతో అజయ్ కుమార్ నాయకత్వానికి కూడా తలొగ్గారు. కట్ చేస్తే అజయ్ కుమార్ సొంత నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలు జిల్లాలో పార్టీని దెబ్బ కొట్టేలా చేశాయిట. ముఖ్యంగా తనకు వంతపాడే కొత్త నేతలను తెరపైకి తెచ్చారట అజయ్ కుమార్. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తనకు తరచుగా భజనలు చేసే కొత్త వ్యక్తులను తీసుకువచ్చి వారికి బాధ్యతలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారట.
జనసేన నియమించిన ఇన్చార్జులను పక్కన పెడుతున్న అజయ్
ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించిన ఇన్చార్జిలను పక్కనపెట్టి కొత్తవారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారని. వీరంతా గతంలో వైసీపీ కోసం పని చేసిన నాయకులు, కూటమి అధికారంలోకి వచ్చాక పార్టీ మారి వచ్చిన నేతలు కావడం గమనార్హమని టాక్. ఈ విషయంపై అజయ్ కుమార్ ను పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తే…. తాను చెప్పిందే చేయాలని రాష్ట్ర అధిష్టానం జిల్లా బాధ్యతలు అంతా తన భుజాలపై వేసిందని చెప్పుకొస్తున్నారట. ఏకంగా ఇంకో అడుగు ముందుకు వేసి జిల్లాలోని పది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫోన్ చేసి నియోజకవర్గాల జనసేన ఇన్చార్జిలు ఏ పని మీద మీ వద్దకు వచ్చినా వారికి చేయొద్దని, ఫైనల్ గా తాను ఎవరికి చెప్తే వారికే పని చేయాలని చెప్పారట. ఈ విషయం తెలియని జనసేన నియోజకవర్గ ఇన్చార్జిలు ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు వివిధ రకాల పనులపైన వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలంతా మీకు పని చేయవద్దని వేములపాటి అజయ్ కుమార్ చెప్పారు..కాబట్టి మీ వ్యక్తిగత పనులు ఏమన్నా ఉంటే మా వద్దకు రండి అని, జనసేన తరఫున రావద్దని నిర్మొహమాటంగా చెప్పేసారట. దీంతో ఆయా ఎమ్మెల్యేల గెలుపు కోసం శాయశక్తుల పని చేసిన నియోజకవర్గ ఇన్చార్జిలు మొహం కొట్టేసినట్లుగా బయటకు వచ్చేసారట..
జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తానని లక్షల వసూళ్లు
వేములపాటి అజయ్ కుమార్ నెల్లూరు జిల్లాలో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారట. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి తన ఆస్తులను కాపాడుకునే వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తానంటూ అతని వద్ద లక్షలకు లక్షలు ఖర్చుపెట్టిస్తూ హడావిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వారి చేత నెల్లూరు మాగుంట లేఔట్ లో ఓ జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేయించి ఆ కార్యాలయానికి ఎవరు వస్తే వారే జనసేన నేతలు అంటూ మాట్లాడుతున్నారట. పవన్ కళ్యాణ్ నియమించిన జనసేన నియోజకవర్గాల ఇన్చార్జిలను అసలు మీకు జనసేనకు ఏమి సంబంధం లేదంటూ అజయ్ కుమార్ నేరుగా చెప్పడం ఒక్కసారిగా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువుగా మారిన అజయ్
నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడా ఇన్చార్జులకు సంబంధం లేకుండా అజయ్ కుమార్ చక్రం తిప్పుతూ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లకి ఇప్పిస్తుండడం జిల్లా పార్టీలో తీవ్ర చర్చగా మారింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి జిల్లాకు చెందిన నియోజకవర్గాల ఇన్చార్జిలంతా తీసుకెళ్లారట. పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు దృష్టికి ఈ వ్యవహారాన్ని అంతా తీసుకెళ్లినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంగా అజయ్ కుమార్ ఒంటెద్దు పోకడలు నెల్లూరు జిల్లా జనసేనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయట. ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా ప్రతిచోట అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువుగా అజయ్ కుమార్ మారిపోతున్నారట.
కమ్యూనిస్టు నేత అనంతరామయ్య కుమారుడు అజయ్
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శ్రామిక నగర్ లో తన వ్యక్తిగత కక్షలతో 25 కోట్ల రూపాయల విలువచేసే భూమి వ్యవహారంలో అజయ్ కుమార్ తల దూర్చడం పార్టీకి మైనస్ గా మారిందనే ప్రచారం జరుగుతోంది. బాధితులు ఈ అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు సమాచారం. నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, కమ్యూనిస్టు నాయకులు అనంతరామయ్య కుమారుడు వేములపాటి అజయ్ కుమార్. మెగా ఫ్యామిలీతో కొంత పరిచయాలు, నాగబాబుతో సన్నిహితం ఉండడంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలోనే అనేక ఆరోపణలు అజయ్ కుమార్ ఎదుర్కొన్నారట. అప్పట్లోనే నియోజకవర్గాల్లో తలదూర్చడం, అక్కడ నాయకుల్ని ఇబ్బందులకు గురి చేయడం వంటి అంశాలు ప్రజారాజ్యానికి ఇబ్బందులు తెచ్చిపెట్టాయట.
మొదట్లో క్రీయాశీలక సభ్యత్వాలను పట్టించుకోని అజయ్
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు చేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో నియోజకవర్గాల ఇన్చార్జిలు దాదాపు 10వేల క్రియాశీలక సభ్యత్వాలు చేయించారు. ఆ సమయంలో వేములపాటి అజయ్ కుమార్ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రియాశీలక సభ్యత్వాలు పేరుతో తాను 37వేల సభ్యత్వాలు చేయించానని హడావిడి చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం అంతా జిల్లాలోని జనసేనకులకు తీవ్ర ఆగ్రహం తెచ్చిపెడుతున్నాయిట. అజయ్ కుమార్ వ్యవహార శైలి కిందిస్థాయి కార్యకర్తలనూ ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయిట. దీంతో సహనాన్ని కోల్పోయిన నెల్లూరు జిల్లా జనసేన ఇన్చార్జిలంతా ఒకే తాటిపైకి వచ్చారు. నెల్లూరు నగరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమ ఆవేదననంతా వెళ్లగక్కారు. అజయ్ కుమార్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే ఆయన వ్యవహార శైలి పార్టీని ఇబ్బందులకు గురి చేసేలా చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు..దేవాలయాల కమిటీ సభ్యుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు అన్ని వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ అవడం, నియోజకవర్గాల ఇన్చార్జిలను హీనంగా చూడడం వంటి అంశాలను మీడియా ఎదుట పెట్టారు.
ఈ వ్యవహార శైలంతా జనసేన ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గాల ఇన్చార్జిలు అధిష్టానం దృష్టికి తీస్కువెళ్లినా ఇది డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాకా వెళ్లలేదనే ప్రచారం జరుగుతుంది.. పవన్ కళ్యాణ్ కు నెల్లూరు జిల్లా పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. తాను ఇక్కడ విద్యను అభ్యసించడం, కొంతకాలం నెల్లూరులోనే ఉండడం ఇక్కడ పరిస్థితులన్నీ ఆయనకు తెలిసిందే. గతంలో కూడా వేములపాటి అజయ్ కుమార్ తీరుపై ఆవేదన చెందిన అనేక మంది నేతలు జనసేన వదిలి వెళ్ళిపోయారు. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వారే. వారి గెలుపు కోసం జనసేన నియోజకవర్గాల ఇన్చార్జిలు పడిన కష్టం అంతా ఇంతా కాదనేది జగమెరిగిన సత్యం.
Also Read: చిత్తూరు జిల్లాలో విషాదం.. చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు..
అయితే అజయ్ కుమార్ ఫోన్ కాల్ నియోజకవర్గాల ఇన్చార్జిల జీవితాల్ని మార్చేసింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా అజయ్ కుమార్ దగ్గర నుంచి తమకు ఫోన్ వచ్చిందని, మీరు ఏ పని మీద మా వద్దకు రావద్దని చెప్పడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జనసేన ఇన్చార్జిలు మానసిక క్షోభకు గురవుతున్నారట. ఒకరిద్దరు ఇన్చార్జిలు వ్యతిరేకమయ్యారంటే వారిలో ఏదో అంతర్గత విభేదాలు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు వ్యతిరేకమవడం, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా వేముల పాటిపై తీవ్ర వ్యతిరేకత ఉండటం వంటి అంశాలు అధిష్టానం సున్నితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా జనసేన పై ప్రత్యేక దృష్టి పెట్టి పరిస్థితులను చక్కబెట్టాలని జనసైనికులు కోరుతున్నారు.
Story By Apparao, Bigtv