దొంగలు రోజు రోజుకు మరింత కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. అదును చూసి అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బున్న కుటుంబాలే టార్గెట్ గా చేసుకుని.. అదును చూసి నమ్మిన వాళ్లనే నట్టేట ముంచుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కొంత మంది మహిళలు పెళ్లిళ్లు చేసుకుని, కొంత కాలం నమ్మకంగా వారితో సంసారం చేసి, టైమ్ రాగానే ఇంట్లోని డబ్బు, నగలతో పాటు విలువైన వస్తువులతో జంప్ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 12 మంది ఒకేసారి భర్తల ఇళ్లను ఊడ్చేసి వెళ్లడం అందరినీ షాక్ కు గురి చేసింది. అలీఘర్ లో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
నిజానికి నార్త్ ఇండియాలో కర్వా చౌత్ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. భర్తలు ఆరోగ్యంగా ఉండాలని భార్యలు ఈ వేడుకను ఎంతో నిష్టగా చేస్తుంటారు. తాజాగా ఇదే పండుగ రోజు కొంత మంది భార్యలు, భర్తలకు ఊహించని షాకిచ్చారు. అలీఘర్ లో ఒకేసారి 12 ఇళ్లలో కొత్తగా పెళ్లైన యువతులు తమ కుటుంబ సభ్యులకు మత్తు మందు ఇచ్చిన ఫుడ్ పెట్టి, ఇంట్లోని డబ్బు, నగలతో పారిపోవడంతో అందరూ షాకయ్యారు.
కర్వాచౌత్ సందర్భంగా ఘటనకు ముందు వారం రోజుల పాటు ఎంతో సందడిగా ఉన్న వధువులు, భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేశారు. ఉపవాసాలు ఉంటూ భర్తలకు చక్కగా సేవలు చేశారు. ఉపవాసం ముగిసిన తర్వాత వడ్డించే ఆహారంలో మత్తు మందు కలిపి, వారు మత్తులోకి జారుకోగానే, ఇంట్లోని డబ్బులు, నగలతో పరారయ్యారు. మత్తు దిగి మేల్కొనే సరికి ఇళ్లన్నీ దోపిడీకి గురయ్యాయి. అందరూ లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఒకేసారి 12 ఇళ్లలో ఇలా జరగడంతో ఈ ఘటన వెనుక ఓ పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కుటుంబాలకు సంబంధించి సుమారు రూ. 30 లక్షల విలువ చేసే డబ్బు, నగలు పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న ముఠాను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ అమ్మాయిలు ఎవరు? వారికి పెళ్లి చేసిన బ్రోకర్లు ఎవరు? పెళ్లి కూతుళ్ల ఫోటోలు సహా ఇతర వివరాలు తీసుకుంటున్నారు. వీరిని పట్టుకునేందుకు యూపీతో పాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. ఈ దోపిడీ వెనుక పెళ్లిళ్లు చేసిన బ్రోకర్ల ముఠా ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు.
నిజానికి ఇదో పెద్ద స్కామ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంత మంది బ్రోకర్లు వధువులను బీహార్, జార్ఖండ్ నుంచి తీసుకువచ్చి, అమ్మాయిలు కొరత ఉన్న కుటుంబాల వారి అబ్బాయిలకు పెళ్లి చేస్తారు. ఇందుకు గాను వరుడి కుటుంబం నుంచి రూ. 80,000 నుంచి రూ.150,000 వరకు వసూలు చేస్తారు. పెళ్లి అయ్యాక కొద్ది రోజులు వారితో నమ్మకంగా ఉంటూ, టైమ్ చూసుకుని ఇంట్లో వాళ్లను బురిడీ కొట్టించి, నగలు, డబ్బుతో మాయం అవుతారు వధువులు. ఇదంతా బ్రోకర్ల డైరెక్షన్ లో జరిగే కథ అని అలీఘర్ పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠా గతంలో హత్రాస్, బులంద్ షహర్, బదౌన్ లో ఇలాంటి నేరాలకు పాల్పడిందని వెల్లడించారు. త్వరలోనే ఈ వధువులతో పాటు వారి వెనుకున్న వారిని పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.
Read Also: నెలలో ఇన్నిసార్లు స్ఖలిస్తే.. ఆ క్యాన్సర్ రాదట, ఇక మొదలు పెట్టండి అబ్బాయిలూ!