భోపాల్ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే క్రమంలో హిందువులు తమ పిల్లల పట్ల, ప్రత్యేకంగా కుమార్తెల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే వారి కాళ్లు విరగ్గొట్టాలని, వారిపై జాలి తలచాల్సిన పనిలేదన్నారు. భోపాల్ లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేయగా, సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కు పెట్టారు.
కాళ్లు విరగ్గొట్టండి..
హిందువుల అమ్మాయిలు, హిందువులు కానివారి ఇళ్లకు వెళ్తే వారిపట్ల తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించాలన్నారు బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్. చిన్నప్పటి నుంచి పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలని ఆమె సూచించారు. అయినా కూాడ పెద్దయ్యాక కొందరు హిందువులు కాని వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటారని, వారి ఇళ్లకు వెళ్తారని, అలాంటివారి పట్ల మరింత కఠినంగా ఉండాలన్నారు. పిల్లల్ని తిట్టినా, కొట్టినా, అది వారి మంచి కోసమేనని, ఈ విషయం వారికి వివరించాలన్నారు. బుజ్జగించినా వినకపోతే కాళ్లు విరగ్గొట్టాలన్నారు.
బి అలర్ట్..
ఇంటి నుంచి పారిపోడానికి సిద్ధంగా ఉన్న కుమార్తెల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వారిని నిరంతరం గమనిస్తుండాలని చెప్పారు ప్రజ్ఞా ఠాకూర్. అవసరమైతే శారీరకంగా వారిని శిక్షించడానికి వెనకాడొద్దని పిలుపునిచ్చారు. హిందువులు విలువలు పాటించాలని, వారి పిల్లలు కూడా ఆ విలువలను పాటించేలా పెంచాలన్నారు. మన విలువల్ని పాటించేవారు, క్రమశిక్షణతో ఉండాలని, అలాంటి వారు ఇతర మతస్తులను పెళ్లి చేసుకోకూడదని, ఒకవేళ అలాంటి ఆలోచన చేస్తే కఠినంగా శిక్షించాలన్నారు. అదంతా వారి భవిష్యత్తు కోసమేననే విషయం వారికి వివరించాలన్నారు ప్రజ్ఞా ఠాకూర్.
Also Read: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య
మా ఇంటి మహాలక్ష్మి
ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని తల్లిదండ్రులు సంతోషిస్తారని, వారిని కళ్లలో పెట్టుకుని కాపాడుకుంటారని, తమ జీవితాలను త్యాగం చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారని, అలాంటి వారు వివాహం విషయంలో తల్లిదండ్రుల మాట వినడం లేదని చెప్పుకొచ్చారు సాధ్వి. అలాంటి వారిని ఊరికే వదిలి పెట్టకూడదన్నారు. పెళ్లి చేసుకుని, మతం మారడానికి సాహసించే కుమార్తెల పట్ల కఠినంగా ఉండటం తప్పేమీ కాదన్నారు సాధ్వి. గుండెను రాయి చేసుకుని ఇలాంటి పనులు చేయాలన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కుమార్తెలను కొట్టాలని ప్రేరేపించడం, పరమత ద్వేషాన్ని నూరిపోయడం సరికాదని అంటున్నారు వైరి వర్గం నేతలు. ప్రజ్ఞా సింగ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని వారు విమర్శించారు. సోషల్ మీడియాలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేవారిని కూడా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి వారి వల్లే మత విద్వేషాలు పెరుగుతాయని, పరువు హత్యలు జరుగుతున్నాయని అన్నారు. పరువు హత్యలకు ప్రేరేపించేలా సాధ్వి వ్యాఖ్యలు ఉన్నాయనే విమర్శలు వినపడుతున్నాయి.
Also Read: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే..