Faridabad Frooti death case: ఉపవాసం ఉన్నప్పుడు బాడీ చాలా సెన్సిటివ్‌గా మారుతుంది. అలాంటి సమయంలో తీసుకునే ఆహారం లేదా డ్రింక్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన ఇప్పుడు అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఉపవాసం వీడటానికి (Fasting Break చేయడానికి) ఒక ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ (Frooti) తాగిన 33 ఏళ్ల యువకుడు, కాసేపటికే తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.
ఈ షాకింగ్ ఘటన ఫరీదాబాద్‌లోని హనుమాన్ నగర్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
హనుమాన్ నగర్‌కు చెందిన అంకుష్ (అనే వ్యక్తి రోజంతా ఉపవాసం ఉన్నాడు. గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాసం ముగించేందుకు ఇంట్లో ఉన్న ఫ్రూటీ తాగాడు. అయితే.. జ్యూస్ తాగిన కొద్దిసేపటికే అంకుష్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం ప్రారంభించాడు. ఆ వెంటనే విపరీతంగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. పరిస్థితి విషమించడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఫరీదాబాద్‌లోని బాద్‌షా ఖాన్ సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
సివిల్ ఆసుపత్రి డాక్టర్లు కూడా అంకుష్ పరిస్థితిని చూసి, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే.. విధి చాలా బలీయమైనది. అంకుష్‌ను ఢిల్లీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతని పరిస్థితి మరింత క్షీణించి, ప్రాణాలు విడిచాడు. రాత్రి ఒంటిగంటన్నర సమయంలో సర్వోదయ ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖేడీ పుల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ దేవేంద్ర సింగ్ ఈ కేసుపై మాట్లాడుతూ.. “కుటుంబ సభ్యుల ఫిర్యాదును నమోదు చేసుకున్నాం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించి, అనంతరం కుటుంబానికి అప్పగించాం. అసలు మరణానికి గల కారణం కేవలం ఫ్రూటీ తాగడం వల్లే జరిగిందా? లేక మరేదైనా ఫుడ్ పాయిజనింగ్ కారణమా? అనేది పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వస్తేనే స్పష్టంగా తెలుస్తుంది” అని పేర్కొన్నారు.
ప్యాకేజ్డ్ లేదా నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల జరిగే ప్రమాదాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. గత ఏప్రిల్ లో ముంబైకి చెందిన డొకాడియా కుటుంబంలో నలుగురు సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని మరణించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ దర్యాప్తులో ఆ పుచ్చకాయలో ఎలుకల మందుగా వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే అత్యంత ప్రమాదకరమైన విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది. అది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా కావాలనే కలిపారా అనే కోణంలో ఇంకా విచారణ సాగుతోంది.
ఉపవాసం ఉన్న తర్వాత నేరుగా ఫ్రిజ్‌లో ఉన్న చల్లటి ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్ లేదా ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉన్న డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. ఎల్లప్పుడూ కొబ్బరి నీళ్లు, మజ్జిగ లేదా గోరు వెచ్చని నీటితో ఉపవాసం వీడాలి. అలాగే ఏదైనా ప్యాకేజ్డ్ డ్రింక్ తాగే ముందు దాని ఎక్స్‌పైరీ డేట్ , ప్యాకింగ్ లీకేజీలు లేవని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.