India Border Towns: భారత్ అనేక పొరుగు దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. అయితే సరిహద్దులోని ప్రాంతాలు.. భద్రత, సైనిక కదలికలకే పరిమితం కాకుండా విభిన్న సంస్కృతులు, వ్యాపారం, సుదీర్ఘ చరిత్రకు నిలయాలుగా భాసిల్లుతున్నాయి. ఇన్నాళ్లు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని.. విదేశీ సంస్కృతికి అద్దం పట్టే టాప్-5 సరిహద్దు పట్టణాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఆ ప్రాంతాలను ఒక్కసారి విజిట్ చేస్తే.. దాని సరిహద్దులోని పక్క దేశంలో అడుగుపెట్టిన భావన కలుగనుంది. ఆ ప్రాంతాలేంటో ఇప్పుడు చూద్దాం.
సముద్ర మట్టానికి సుమారు 14,140 అడుగుల ఎత్తులో ఉండే ‘నాథూ లా’ (Nathu La).. కేవలం ఒక పర్వత ప్రాంతం మాత్రమే కాదు. భారత్, టిబెట్‌లను కలిపే ఈ మార్గం గుండా ప్రయాణించడానికి అనుమతి (పర్మిట్) తప్పనిసరి. ఇక్కడ లభించే స్థానిక మార్కెట్లు, ప్రశాంతమైన బౌద్ధ విహారాలు.. భారతీయ, టిబెటన్ సంస్కృతుల కలయికను ప్రతిబింబిస్తాయి. మంచు పర్వతాల అందాలు, హిమాలయాల వీక్షణలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి.
మణిపూర్ లోని చిన్న పట్టణమైన ‘మోరే’ (Moreh)ని మయన్మార్ కు ప్రవేశ ద్వారంగా పిలుస్తారు. భారత్-మయన్మార్-థాయిలాండ్ రహదారిలో ఇది కీలకమైన వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఇక్కడి మార్కెట్లలో లభించే వస్త్రాలు, చేతివృత్తులు, రుచికరమైన వంటకాలలో భారతీయ, బర్మీస్ సంస్కృతులు స్పష్టంగా కనిపిస్తాయి. వ్యాపార సంబంధాలు.. సరిహద్దులను దాటి సాంస్కృతిక బంధాలను ఎలా పెంపొందిస్తాయో చెప్పడానికి ఈ ప్రాంతం ఒక చక్కని ఉదాహరణ.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ‘దావ్కీ’ (Dawki) ప్రాంతం.. అద్దంలా మెరిసే ‘ఉమ్నోట్ నది’ (Umngot River) అందాలకు నెలవు. స్వచ్చమైన నీటితో దర్శనమిచ్చే ఇక్కడి నదీ జలాలు.. వేలాడే వంతెనలతో పర్యాటకులను కట్టిపడేస్తాయి. ప్రకృతి అందాలతో పాటు బంగ్లాదేశ్‌తో ఉన్న బలమైన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను ప్రత్యక్షంగా గమనించడానికి ఇది అనువైన ప్రదేశం.
భూటాన్‌కు వెళ్లే పర్యాటకులకు పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని ‘ఫుంట్‌షోలింగ్’ (Phuentsholing) పట్టణం ప్రధాన ద్వారంగా నిలుస్తుంది. భారత్-భూటాన్ శిల్ప కళలు, వంటకాలు, జీవనశైలుల సమాహారం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రోడ్డు మార్గంలో భూటాన్ వెళ్లాలనుకునే వారు ఇక్కడి రద్దీగా ఉండే మార్కెట్లను సందర్శిస్తూ.. సాంప్రదాయ భూటాన్ ఆహారాన్ని రుచి చూడవచ్చు.
Also Read: యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!
నాగాలాండ్ లోని ‘లాంగ్వా’ (Longwa) ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన సరిహద్దు ప్రాంతాలలో ఒకటి. భారత్-మయన్మార్ సరిహద్దు రేఖ సరిగ్గా ఈ ఊరి గిరిజన తెగ నాయకుడు ఆంగ్ ఇంటిని విభజిస్తూ వెళుతుంది. ఫలితంగా ఆయన ఇంటి ఒక సగం భారత్‌లో.. మరో సగం మయన్మార్‌లో ఉంటుంది. ఖియామ్నియుంగన్ (Khiamniungan) గిరిజనులు నివసించే ఈ ప్రాంతం.. సరిహద్దుల మధ్య జీవించే వినూత్న శైలిని పర్యాటకులకు పరిచయం చేస్తుంది.
Also Read: ఇంట్లో పెట్స్ ఒంటరిగా ఉన్నాయా? రూ.3 వేలలో బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఇవే!