ఇద్దరిలో చాలా సారూప్యతలున్నాయి. ఆ ఇద్దరు ఎవరో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఇద్దరిలో చంద్రబాబు చాలా సీనియర్. ఆయనకు సీఎంగా అపారమైన అనుభవం ఉంది. అడ్మినిస్ట్రేషన్‌పై బాగా పట్టు.
కొన్ని సంక్షేమ పథకాలు ఆయన మదిలోంచి వచ్చి.. అలా నాటుకుపోయాయి. జన్మభూమి, పనికి ఆహార పథకం నుంచి మొదలుకొని ఇప్పటి అమ్మకు వందనం అంటూ జనాభా పెంచండని పిలుపునిచ్చేదాకా ఆయన మార్కు పాలన కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఏపీలో.. ఇప్పుడు విభజన ఏపీలో కూడా.
ఆయన ద్వారా చాలా విషయాలను నేర్చుకున్నాడు కేసీఆర్. నిజానికి, కేసీఆర్‌కు రాజకీయ గురువు ఎన్టీఆర్. ఎంతలా అంటే తన కొడుకుకు ఆయన పేరే పెట్టుకునేంతగా. కానీ, ఎన్టీఆర్ శకం ముగిసిన తరువాత ఇక తప్పని పరిస్థితుల్లో బాబును ఫాలో అయ్యాడు కేసీఆర్. కొన్ని విషయాల్లో మాత్రమే.
కానీ తనకన్నా తక్కువ తెలివిగల వాడిగా, రాజకీయ చాణక్యంలో తను బాబును మించిన వాడిననే ఓ ఫీలింగు అప్పటి నుంచి ఆయనలో ఉండేది. కానీ అప్పటి రాజకీయ అవసరాల కోసం అణిగిమనిగి ఉన్నా.. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటం, కరెంటు చార్జీల పెంపు ఇష్యూతో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా.. స్పీకర్‌ని చేశాడనే కోపం ఇవన్నీ కలగలిపి .. పదవికి రాజీనామా.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యూహకర్తగా, టీఆరెస్ పార్టీ వ్యవస్థాపకుడిగా కొత్త అవతారం ఎత్తాడు.
బషీర్‌బాగ్ కాల్పుల తరువాత.. బాబు రాజకీయాన్ని తలకిందులు చేశాయి. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీయారే కారకుడు. బాబు అంటే ఆనాటి నుంచి కోపమే కేసీఆర్‌కు. తను సీఎం అయిన తరువాత అడ్మినిస్ట్రేషన్‌లో బాబును అనుసరించలేకపోయాడు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా బాబును తిడుతూనే ఉన్నాడు కేసీఆర్. ఇంగ్లీష్ మాట్లాడరాదని, బట్లర్ ఇంగ్లీష్ గాడని, అతనో నయవంచకుడని ఇలా కచ్చ తీరేలా తిట్టిన ఉదంతాలున్నాయి.
కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి, బాబు స్థితి చూస్తే ఎవరు రాజకీయాలను ఔపోసన పట్టారో.. ఎవరు జనం నాడి తెలుసుకుని ముందుకు సాగుతున్నారో.. ఎవరు ప్రతికూల రాజకీయ స్థితి నుంచి కూడా ఓర్చుకుని బయటకు వచ్చి నిలబడి విజేతగా నిలిచారో.. ఎవరు జనంపై అలిగి ఫామ్‌హౌజ్‌లో పన్నారో.. జనాలకు తెలిసిపోయింది.
ఓడగొట్టగానే జనాలకు దూరమయ్యాడు కేసీఆర్. ఓడగొట్టినా.. జైలు పాలైనా.. జనాన్ని వీడలేదు.. తన ఓపికనూ వదల్లేదు బాబు. అదే స్టామినా.. మాటకారి కాకపోయినా..తనకున్న గొంతుతోనే జనాన్ని చైతన్యం చేసే గుణం మాత్రం వీడలేదు. వయస్సు మీద పడ్డా ఆ కదలికల్లో మార్పు రాలేదు. ఆ సీనియారిటీ వృథా కాలేదు.
ఉద్యమ దళపతే తనకు తాను తన అనుభవాన్ని, పేరును ఫామ్‌హౌజ్ నేతగా చెదలు పట్టించుకుంటున్నాడు. ఇదీ ఇద్దరికీ ఉన్న తేడా. ఇప్పుడు జనాలకు ఇది స్పష్టంగా తెలిసిపోతోంది.