YouTuber Kid spends Rs 1.13 crore on ads| ఈ రోజుల్లో ఎటుచూసినా కంటెంట్ క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు తమకు తోచిన విధంగా వీడియోలు చేస్తూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. వారిలో కొందరు వేలు, లక్షల వ్యూస్ సాధిస్తూ విజయవంతంగా పేరు, డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇదంతా అనుకున్నంత ఈజీ కాదు. దీని కోసం క్రియేటివ్‌గా లేకపోతే ఆకర్షణీయంగా కంటెంట్ రూపొందించాలి. కొంతమంది వీడియోలు అప్‌లోడ్ చేశాక వ్యూస్ రావకపోవడంతో తమ వీడియోలు ప్రమోట్ చేసుకునేందుకు, వ్యూస్ పెంచుకునేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఒక 9 ఏళ్ల కుర్రాడు దొంగచాటుగా రూ.1 కోటి పైగా ఖర్చు చేశాడు. ఇదంతా అతని తండ్రికి ఏమాత్రం తెలియదు. చివరికి అనుకోని విధంగా తెలిసి ఆ తండ్రి షాకయ్యాడు.
మైక్ అనే 9 ఏళ్ల బాలుడు Mighty Mike Plays పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అతను Minecraft, Roblox వంటి గేమ్స్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు.
తన వీడియోలకు తగినంత వ్యూస్ రావడం లేదని మైక్ బాధపడేవాడని తండ్రి డేవ్ చెప్పారు. దీంతో డేవ్ తన కుమారుడికి యూట్యూబ్ లో తమ వీడియోలు ప్రొమోట్ చేసుకునేందుకు యాడ్స్ ఎలా నిర్వహించాలో చూపించారు. మొదట సుమారు 20 డాలర్ల విలువైన చిన్న యాడ్ క్యాంపెయిన్‌ను రూపొందించారు. యాడ్ బడ్జెట్ ఎలా నిర్ణయించాలి, ప్రేక్షకులను ఎలా ఎంచుకోవాలి అనే విషయాలను కూడా వివరించారు. ఆ తర్వాత మైక్ స్వయంగా మరిన్ని యాడ్ క్యాంపెయిన్లు ప్రారంభించాడు.
కుటుంబం ఉపయోగించిన గూగుల్ అకౌంట్‌లో కంపెనీ క్రెడిట్ కార్డు వివరాలు ఇప్పటికే సేవ్ అయి ఉన్నాయి. దీంతో ప్రతిసారి కార్డు వివరాలు నమోదు చేయకుండానే బాలుడు ప్రకటనలు ప్రారంభించగలిగాడు. మైక్ తండ్రి డేవ్ ప్రకారం.. ఆయన కొడుకు 20 డాలర్ల బడ్జెట్‌ను తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. ఆ 20 డాలర్లు మొత్తం ప్రకటనలకు పరిమితి అని కాకుండా, ఒక్కో క్యాంపెయిన్‌కు సంబంధించినదిగా భావించి ఉండవచ్చని ఆయన అన్నాడు. అలా వరుసగా కొత్త క్యాంపెయిన్లు కోసం ప్రతీసారి యాడ్స్ కోసం మైక్ ఖర్చు చేస్తూ ఉన్నాడు. దాదాపు మూడు వారాల్లో ప్రకటనల ఖర్చు 1,18,000 డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.13 కోట్లకు సమానం.
Also Read: లవ్ ఫార్ములా.. గణితంతో ప్రేమను అర్థం చేసుకోవచ్చు.. ఆసక్తికర పరిశోధన
డేవ్‌కు ఈ భారీ ఖర్చు గురించి వెంటనే తెలియలేదు. ఆఫీస్‌లో మేనేజర్, కార్పొరేట్ సిబ్బంది, ఫైనాన్స్ టీమ్ ఆయనను పిలిచినప్పుడు విషయం బయటపడింది. గత మూడు వారాల్లో కంపెనీ కార్డుపై జరిగిన ప్రకటనల ఖర్చును వారు చూపించారు. ఆ ప్రకటనల కారణంగా కొన్ని వీడియోలకు సుమారు 2 లక్షల వ్యూస్ వచ్చినట్లు డేవ్ తెలిపారు. అయితే, ఈ ప్రకటనల ద్వారా ఎంతమంది కొత్త సబ్‌స్క్రైబర్లు వచ్చారో వెల్లడించలేదు. అలాగే ఈ ఖర్చుతో ఛానల్‌కు ఎంత ఆదాయం వచ్చిందనే విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు.
Also Read: యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం
ఈ ఘటన తర్వాత మైక్ కుటుంబం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. గూగుల్ అకౌంట్‌లో సేవ్ చేసిన పేమెంట్ వివరాలను తొలగించాలని వారు నిర్ణయించారు. అలాగే ప్రకటనల ఖర్చుకు పరిమితులు విధించాలని కుటుంబం భావిస్తోంది. పిల్లలు ఆన్‌లైన్ ప్రకటనలను ఉపయోగించే సమయంలో పేరెంటల్ కంట్రోల్స్ కూడా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. మైక్ యూట్యూబ్ ఛానల్‌ను కొంతకాలం నిలిపివేయడం గురించి కూడా కుటుంబం ఆలోచిస్తోంది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించేటప్పుడు పర్యవేక్షణ ఎంత ముఖ్యమో ఈ ఘటన ద్వారా తెలుస్తోంది.