mathematics of love and relationships| ప్రేమకు లెక్కలు ఉండవని మనం సాధారణంగా అనుకుంటాం. ఎవరిపై ఎప్పుడు ప్రేమ కలుగుతుందో, ఒక సంబంధం ఎంతకాలం కొనసాగుతుందో ముందుగా చెప్పడం కూడా అంత సులభం కాదు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు సంబంధాల్లో కనిపించే కొన్ని భావోద్వేగ మార్పులను గణిత మోడల్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమను పూర్తిగా ఒక ఫార్ములా లేదంటే సమీకరణంలో బంధించడం వారి లక్ష్యం కాదు. అయితే ఒక సంబంధం ఎందుకు బలంగా కొనసాగుతుంది, మరొకటి ఎందుకు క్రమంగా బలహీనపడుతుంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ మోడల్స్ ఉపయోగపడుతున్నాయి.
ఉదాహరణకు ఒక జంట ఎందుకు సంతోషంగా కలిసి ఉంటుంది, మరొక జంట ఎందుకు క్రమంగా దూరమవుతుంది అనే విషయాలను అర్థం చేసుకోవడమే ఈ పరిశోధనల ఉద్దేశం.
ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లియోన్ Iకి చెందిన ప్రొఫెసర్ లారెంట్ పుజో – మెంజువే ప్రేమ సంబంధాలపై గణిత మోడల్స్‌ను అధ్యయనం చేస్తున్నారు. ఆయన పరిశోధనలో గణితంతో పాటు సైకాలజీ, సాహిత్యం, సినిమాలు, రోజువారీ జీవితంలోని ప్రేమ అనుభవాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆయన రాసిన ‘లవ్ వేలర్ ఈక్వేషన్స్’ పుస్తకంలో ప్రేమ సంబంధాలను గణిత ఐడియాలతో ఎలా అర్థం చేసుకోవచ్చో వివరించారు.
ఈ పరిశోధనలో పరస్పర ఆకర్షణ, భావోద్వేగాల్లో వచ్చే మార్పులు, ఒకరి భావాలకు మరొకరు ఇచ్చే స్పందన వంటి అంశాలను పరిశీలిస్తారు. వీటిని కొన్ని వేరియబుల్స్‌గా తీసుకుని గణిత మోడల్స్ రూపొందిస్తారు. ఈ మోడల్స్ ద్వారా ఒక సంబంధంలో భావోద్వేగ బంధం కాలక్రమంలో ఎలా మారుతుందో అధ్యయనం చేయవచ్చు.
ఇందులో జనాభా శాస్త్రంలో ఉపయోగించే ‘అలీ ఎఫెక్ట్’ అనే భావన కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక జీవుల సమూహం ఒక నిర్దిష్ట స్థాయి కంటే తక్కువకు పడిపోతే, అది తిరిగి కోలుకోవడం కష్టమవుతుందని ఈ ఫార్ములా చెబుతుంది. ఇదే తరహా ఐడియాని సంబంధాలకు కూడా అన్వయించారు.
ఈ గణిత పరిశోధన ప్రకారం.. ఒక సంబంధంలో భావోద్వేగ బంధం ఒక నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉంటే, సమస్యలు వచ్చినప్పటికీ జంట మళ్లీ కోలుకునే అవకాశం ఉంది. అయితే ఆ బంధం క్రమంగా బలహీనపడి ఒక కీలక స్థాయి కంటే దిగువకు వెళితే, సంబంధాన్ని తిరిగి బలపరచడం మరింత కష్టంగా మారవచ్చు. గొడవలు, ఒత్తిడి, దూరం వంటి అంశాలు ఈ భావోద్వేగ బంధాన్ని ప్రభావితం చేస్తాయి.
Also Read: చాటింగ్‌లో మనసును తాకే మాటలు, కవిత్వాలు.. నిజజీవితంలో మాత్రం బోర్.. ఎందుకలా?
సైకాలజిస్ట్ జాన్ గాట్‌మన్ చాలా కాలంగా జంటల మధ్య సంభాషణ, గొడవల సమయంలో వారి స్పందన వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనా విధానాల్లో కనిపించే కొన్ని నమూనాలను కొలిచి, సంబంధాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ఉపయోగిస్తున్నారు.
Also Read: మోసం చేసిన వారిని ఎప్పటికీ క్షమించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు తప్పు చేస్తే రెండో ఛాన్స్ ఇవ్వరు
అయితే గణిత మోడల్స్ ఒక జంట భవిష్యత్తును కచ్చితంగా చెప్పగలవని దీని అర్థం కాదు. ప్రతి వ్యక్తి భావోద్వేగాలు, పరిస్థితులు, అనుభవాలు భిన్నంగా ఉంటాయి. అందుకే ప్రేమను పూర్తిగా ఒక గణిత సమీకరణంతో వివరించడం సాధ్యం కాదు. కానీ సంబంధాల్లో జరిగే మార్పులను గుర్తించి, వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి గణిత మోడల్స్ ఒక ఉపయోగకరమైన సాధనంగా మారుతున్నాయి.
ప్రేమ మిస్టరీగానే ఉన్నప్పటికీ, దాని వెనుక జరిగే కొన్ని భావోద్వేగ మార్పులను అర్థం చేసుకోవడానికి సైన్స్ కొత్త మార్గాలను వెతుకుతోంది.