తల్లిదండ్రులందరూ తమ పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోవాలని, చెప్పిన మాట వినాలని కోరుకుంటారు. కానీ చాలా ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వినడం లేదనే సమస్య కనిపిస్తుంది. చాలామంది ఈ సమస్యకు పిల్లలే కారణమని భావిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రవర్తన కూడా దీనికి కారణం కావచ్చు.
పిల్లలను ఎప్పుడూ మందలించడం, కోపంగా మాట్లాడడం లేదా కారణం చెప్పకుండా నియమాలు విధించడం వల్ల వారు క్రమంగా వినయంగా ఉండడం మానేస్తారు. ఈ సమస్యకు పరిష్కారం చిన్న చిన్న మార్పులతో పిల్లలతో మంచి అనుబంధాన్ని పెంచుకొని వారిని విషయాలను అర్థం చేసుకునే విధంగా తయారు చేయాలి.
పిల్లలకు ఇంట్లో ఉండే నియమాలు ముందుగానే స్పష్టంగా చెప్పాలి. నిద్రపోయే సమయం, చదివే సమయం, ఆడుకునే సమయం వంటి వాటిని క్రమబద్ధంగా ఉంచాలి. ఇలా చేస్తే పిల్లలకు ఏం చేయాలో సులభంగా అర్థమవుతుంది.
నియమాలు మాత్రమే చెప్పకుండా వాటి అవసరాన్ని కూడా వివరించాలి. కారణం అర్థమైతే పిల్లలు వాటిని పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పిల్లలు మాటల కంటే పెద్దల ప్రవర్తనను ఎక్కువగా అనుసరిస్తారు. మీరు ప్రశాంతంగా, మర్యాదగా మాట్లాడితే వారూ అదే నేర్చుకుంటారు.
ప్రతి చిన్న విషయానికి కోపం చూపించకుండా ఓర్పుతో స్పందించాలి. తల్లిదండ్రులు మంచి ఉదాహరణగా ఉంటే పిల్లలు కూడా అలాంటి అలవాట్లను అలవర్చుకుంటారు.
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు మాత్రమే గమనిస్తారు. కానీ వారు మంచి పని చేసినప్పుడు కూడా ప్రశంసించడం చాలా ముఖ్యం.
ఒక చిన్న “శభాష్”, చిరునవ్వు లేదా ప్రేమగా చెప్పిన మంచి మాట పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీంతో వారు మంచి ప్రవర్తనను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు.
ప్రతి తప్పుకు శిక్ష విధించడం ఎప్పుడూ సరైన మార్గం కాదు. పిల్లలు తమ చర్యల వల్ల వచ్చే ఫలితాన్ని అర్థం చేసుకుంటే బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకుంటారు. ఉదాహరణకు, బొమ్మలు సర్దకపోతే మరుసటి రోజు ఆడుకునే సమయం కొంచెం తగ్గుతుందని చెప్పవచ్చు. దీంతో వారు తమ పనికి తామే బాధ్యత వహించడం నేర్చుకుంటారు.
పిల్లలకు ఎప్పుడూ ఆదేశాలు ఇవ్వడం కంటే చిన్న చిన్న ఎంపికలు ఇవ్వడం మంచిది. ఉదాహరణకు, “ముందు హోంవర్క్ చేస్తావా లేక ముందు కొద్దిసేపు ఆడుకుంటావా?” అని అడగవచ్చు.
ఇలా చేయడం వల్ల వారి అభిప్రాయానికి కూడా విలువ ఉందని పిల్లలు భావిస్తారు. అలాగే తాము తీసుకున్న నిర్ణయాన్ని పాటించే బాధ్యత కూడా పెరుగుతుంది.
Also Read: పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం
మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఓర్పు, ప్రేమ, స్పష్టమైన సంభాషణ చాలా అవసరం. పిల్లలు గౌరవం, ప్రేమ పొందుతున్నామని భావిస్తే తల్లిదండ్రుల మాటలను సులభంగా అంగీకరిస్తారు.
నియమాలను ప్రేమగా వివరించడం, మంచి పనిని ప్రశంసించడం, సరైన ప్రవర్తనకు ఆదర్శంగా నిలవడం, శిక్షకు బదులుగా బాధ్యతను నేర్పించడం వంటి అలవాట్లు పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. ఇవి పిల్లలు స్వయంగా మంచి నిర్ణయాలు తీసుకునేలా కూడా ప్రోత్సహిస్తాయి.