మైక్రోప్లాస్టిక్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర పర్యావరణ సమస్యగా మారాయి. సముద్రాలు, తాగునీరు, ఆహార పదార్థాలు, గాలిలోనే కాకుండా మన శరీరంలోని పలు అవయవాల్లో కూడా ఇవి ఉన్నట్లు గుర్తించబడ్డాయి. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఇటీవల ఒక అధ్యయనం ప్రచురితమౌంది. ఇటలీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఇవే గుండెపోటుకు నేరుగా కారణమని ఈ అధ్యయనం పూర్తిగా నిర్ధారించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు.
పరిశోధకులు గుండె రక్తనాళాలను పరీక్షించే కరోనరీ యాంజియోగ్రఫీ చేయించుకుంటున్న 61 మంది రోగులను పరిశీలించారు. వారిని మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంలో గుండెపోటు వచ్చిన వారు ఉన్నారు. రెండో వర్గంలో దీర్ఘకాలిక కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారు. మూడో వర్గంలో సాధారణ గుండె రక్తనాళాలు ఉన్నవారు.
ఈ అధ్యయనంలో గుండెపోటు వచ్చిన రోగుల్లో 84 శాతం మందిలో మైక్రోప్లాస్టిక్స్ లేదా నానోప్లాస్టిక్స్ కనిపించాయి. గుండె పోటు రాకున్నా సంబంధిత వ్యాధి ఉన్నవారిలో 40 శాతం మందిలో ఇవి గుర్తించబడ్డాయి. ఆరోగ్యకరమైన రక్తనాళాలు ఉన్నవారిలో మాత్రం 32 శాతం మందిలో మాత్రమే ఈ ప్లాస్టిక్ కణాలు కనిపించాయి.
గుండెపోటు వచ్చిన రోగుల రక్తంలో వివిధ రకాల ప్లాస్టిక్ కణాలు ఎక్కువగా ఉన్నాయని కూడా పరిశోధకులు గుర్తించారు. మనం రోజూ ప్యాకేజింగ్ కోసం ఎక్కువగా ఉపయోగించే పాలిథిలీన్ అత్యధికంగా కనిపించింది.
ఈ అధ్యయనంలో ధూమపానం చేసే వారిలో మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా కనిపించినట్లు తేలింది. పొగతాగని వారితో పోలిస్తే, పొగతాగేవారిలో ఈ ప్లాస్టిక్ కణాలు గుర్తించే అవకాశం ఆరు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. అలాగే అధిక వాయు కాలుష్యానికి గురవుతూ ధూమపానం చేసే ప్రతి వ్యక్తి రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ కనిపించాయి. అయితే ఈ రెండు ప్రమాద కారకాలు లేని వారిలో చాలా తక్కువ మందిలో మాత్రమే ఇవి గుర్తించబడ్డాయి.
శ్వాస ద్వారా లోపలికి వెళ్లే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఊపిరితిత్తుల్లోని చిన్న గాలి సంచుల ద్వారా రక్తంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. సిగరెట్ పొగలో ఉండే సూక్ష్మ కణాలు ఈ ప్రక్రియను మరింత సులభం చేయవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ కణాలు సింథటిక్ దుస్తులు, వాహనాల టైర్లు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్, వాయు కాలుష్యం వంటి అనేక వనరుల నుంచి గాలిలోకి చేరుతాయి.
మైక్రోప్లాస్టిక్స్ ఉన్న రోగుల్లో శరీరంలో వాపును సూచించే సూచికలు కూడా ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయిన భాగాలు బలహీనపడితే అవి పగిలి గుండెపోటుకు దారితీయవచ్చు. అందువల్ల ఈ అంశంపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Also Read: పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం
ఈ పరిశోధనలో కేవలం 61 మంది మాత్రమే పాల్గొన్నారు. ఇది పరిశీలన కోసం చేసిన అధ్యయనం మాత్రమే. అందువల్ల మైక్రోప్లాస్టిక్స్ గుండెపోటుకు నేరుగా కారణమని చెప్పడం సాధ్యం కాదు.
ధూమపానం చేసే వారిలో జీవనశైలి, వాయు కాలుష్యం వంటి ఇతర కారణాలు కూడా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే వైద్య పరీక్షల సమయంలో ఉపయోగించే కొన్ని పరికరాల వల్ల కూడా సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు.. బ్లడ్ శాంపిల్స్‌లో చేరే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
మైక్రోప్లాస్టిక్స్, ధూమపానం, వాయు కాలుష్యం కలిసి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే దీనిని నిర్ధారించడానికి మరిన్ని పెద్దస్థాయి పరిశోధనలు అవసరం.