Brain Fog: చిన్న చిన్న విషయాలను కూడా చాలా మంది తరచుగా మర్చిపోతారు. అప్పుడే ఒక చోట పెట్టిన వస్తువును ఎక్కడ ఉందో అంటూ వెతుకుతారు. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేయాలనుకున్నారో కూడా పదే పదే మర్చిపోతూ ఉంటారు దీన్నే బ్రెయిన్ ఫాగ్ అని పిలుస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో ఆలోచనలకు స్పష్టత లేకపోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడానికి కష్టపడటం, చిత్తశక్తి లేకపోవడం, అనుకున్నదాన్ని సమయానికి చేయలేకపోవడం వంటివి కనిపిస్తాయట.
బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది?
నిద్రలేమి:
నిద్రలేమి లేదా శరీరానికి కావాల్సినంత నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ మందిలో బ్రెయిన్ ఫాగ్ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పోషకాహార లోపం:
పోషకాహార లోపం కూడా బ్రెయిన్ ఫాగ్ సమస్యకు కారణం అయ్యే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. మరికొంత మందిలో విటమిన్-బి12, విటమిన్-డి వంటి పోషకాలు లేకపోవడం కూడా బ్రెయిన్ ఫాగ్‌కు కారణం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మానసిక ఒత్తిడి:
కొన్ని సంబదర్భాల్లో మానసిక ఒత్తిడి, ఉద్వేగం లేదా అనుమానాలు బ్రెయిన్ ఫాగ్‌ని కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆరోగ్య సమస్యలు:
డయాబెటిస్, మానసిక ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా బ్రెయిన్ ఫాగ్‌కు కారణాలు కావచ్చని థెరపిస్ట్‌లు చెబుతున్నారు.
అంతేకాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాడే మెడిసిన్ శరీరంపై చెడు ప్రభావం చూపడం వల్ల కూడా కొంతమంది బ్రెయిన్ ఫాగ్ సమస్యతో ఇబ్బంది పడతారని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
వారికి చాలా డేంజర్:
వయస్సు పెరిగుతున్న కొద్దీ విటమిన్ల లోపం ఏర్పడడం సహజం. దీని వల్ల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావ పడే ఛాన్స్ ఉంది. ఇటువంటి కారణాల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ అనుభవించవచ్చట. కొన్నిసార్లు డీహైడ్రేషన్ కూడా బ్రెయిన్ ఫాగ్‌కు కారణం కావచ్చు.
మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు, నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వచ్చే ప్రమాదం ఉందట. సరైన ఆహారం, వ్యాయామం లేకుండా జీవించే వారు, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిపై దీని ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
బ్రెయిన్ ఫాగ్ రాకుండా ఉండాలంటే..?
బ్రెయిన్ ఫాగ్ రాకుండా ఉండాలంటే రోజుకు కనీసం 7-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, సరైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలట. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు శరీరాన్ని కదలడం, ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది.అలాగే మానసిక ఆరోగ్యం బాగుండాలంగటే ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు అధికంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.బ్రెయిన్ ఫాగ్ ఒక తాత్కాలిక పరిస్థితి మాత్రమే అని థెరపిస్ట్‌లు చెబుతున్నారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదు.