BigTV English

Waqf Board: వక్ఫ్‌ బోర్డులో మార్పులు.. టైం చూసి దెబ్బకొట్టిన మోదీ

Waqf Board: వక్ఫ్‌ బోర్డులో మార్పులు.. టైం చూసి దెబ్బకొట్టిన మోదీ

Waqf Board: వక్ఫ్ సవరణ బిల్లులో సమస్యలేంటని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వాడీ వేడిగా పార్లమెంట్‌లో వాదోపవాదాలు జరిగాయి. ముస్లీంల ఆస్తిపై అధికారం ముస్లీంలదా… లేదంటే వాళ్ల పూర్తి పెత్తనాన్ని తొలగించాలా.. అనేదానిపై ఏకంగా ఎనిమిది గంటలు చర్చిద్దామని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో.. ఈ ప్రతిపాదిత చట్టాన్ని క్రూరమైనదిగా విమర్శించిన ప్రతిపక్షాలు ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. దేశంలోని ముస్లీం సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ.. లోక్‌సభలో మెజారిటీ ఉంది కాబట్టి, బిల్లు ఆమోదం పొందుతుందని నమ్మకంగా ఉంది మోడీ ప్రభుత్వం. అది సరే ఇంతకీ, వక్ఫ్‌ చట్టంతో రాబోయే మార్పులేంటి ? ఈ బిల్లుని వ్యతిరేకించేవారి వాదన ఏంటీ..? అసలు మోదీ గవర్నమెంట్ ఎందుకింత పట్టుబడుతోంది..?


మోడీ ప్రభుత్వం వచ్చి 11 యేళ్ల తర్వాత..

కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టనప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం దూకుడు పెంచింది. గత పదేళ్ల పాలనలో ఉన్నదాని కంటే కొన్ని కీలక నిర్ణయాల్లో వేగంగా ముందడుగు వేస్తోంది. ఇప్పుడు, మోడీ ప్రభుత్వం వచ్చి 11 యేళ్ల తర్వాత పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. మొదటి రౌండ్‌లో కశ్మీర్‌లో 370 రద్దుకాగా.. రెండో రౌండ్లో అయోధ్య సిద్దం అయ్యింది. ఈ మధ్యలో.. ముస్లీం మైనారిటీలకు సంబంధించి చాలా వ్యవహారాలు వివాదాలకు కారణం అయ్యాయి.. కోర్టులకెక్కాయి.


2025 ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఉభయ సభల్లో చట్టంపై చర్చలు

అయితే మోడీ మూడో రౌండ్లో తాజాగా వక్ఫ్ చట్టం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది వక్ఫ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించగా.. ఇప్పుడు, వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రభుత్వం తాజా పార్లమెంట్‌ సెషన్‌లో ప్రవేశపెట్టింది. 2025 ఏప్రిల్ 2, 3 తేదీలకు లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ సవరణ చట్టంపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ బిల్లుపై ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. కేంద్ర అల్పసంఖ్యాక వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఏప్రిల్ 1న వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2న లోక్‌సభలో ప్రవేశపెడతామని చెప్పారు. అప్పటి నుండీ దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది.

వీలైనంత త్వరగా ఆమోదించాలని భావిస్తున్న కేంద్రం

ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉంది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి వీలైనంత త్వరగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. ఎన్డీఏలోని అన్ని పక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయని కూడా ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ, ప్రతిపక్షాల నుండీ, ముస్లీమ్ సంఘాల నుండీ తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు.

ఎంఐఎం సహా ముస్లిం పక్షాల్లో తీవ్రంగా వ్యతిరేకత

అయితే, దశాబ్దాల నాటి ఈ వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని వాదిస్తోంది. అయితే, ప్రతిపక్షాలు, బిల్లును వ్యతిరేకిస్తున్నవారి వాదన మరోలా ఉంది. సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం.. అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణముల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

1954లో మొదటిసారిగా వక్ఫ్‌ చట్టం

అయితే, అసలు వక్ఫ్ చట్టం ఏంటో చూద్దాం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత పలుమార్లు.. ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించింది. 1995లో వక్ఫ్ చట్టానికి తొలి సవరణ జరిగింది. ఈ సవరణలో ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్‌ చేయలేని విధంగా.. వక్ఫ్ కింద ఉన్న ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు.

ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్‌ బోర్డులు

ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్‌ బోర్డులు ఉన్నాయి. అయితే, తమిళనాడులోని వక్ఫ్‌ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించటంతో ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇక, 1970ల నుండీ ఢిల్లీ వక్ఫ్ బోర్డ్.. పార్లమెంట్ భవనం వక్ఫ్ కిందదే అని కోర్టులో వాదనలు వినిపిస్తోంది. గతంలో 123 ఆస్తులను డీనోటిఫై చేసి యూపీఏ ప్రభుత్వం వక్ఫ్‌కి కట్టబెట్టింది. ఇలాంటి చాలా సంఘటనల తర్వాత వక్ఫ్ చట్టాన్ని ప్రక్షాళన చేయాలనీ మోడీ ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకుంది.

ముస్లిం సమాజానికి ప్రయోజనం చేసే విరాళమే వక్ఫ్

అయితే, వక్ఫ్ అనేది ఒక ఛారిటీ అనుకోవాలి. ఇస్లాం సంప్రదాయంలో.. ముస్లిం సమాజానికి ప్రయోజనం చేకూర్చడం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్‌ ఆస్తులన్నీ అల్లాహ్‌కి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. అయితే, దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ వక్ఫ్ కింద ఉన్న చాలా భూములు అన్యాక్రాంతం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 30 వక్ఫ్ బోర్డులు తమ స్వార్థం కోసం వక్ఫ్ భూములను ప్రయివేట్ వ్యక్తులకు ఇచ్చేశారని ఆరోపణలు చాలానే ఉన్నాయి.

12వ శతాబ్ధంలో ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైన వక్ఫ్

అయితే భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల 72 వేల 351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని ఒక అంచానా. ఇవన్నీ కలిపితే 9 లక్షల 40 వేల ఎకరాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక, వీటి విలువ ఏకంగా రూ.1.20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వక్ఫ్ చట్టంలో సవరణతో కీలకమైన మార్పులు రాబోతున్నాయి.

వక్ఫ్ చట్టంలో సవరణతో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉన్నప్పటికీ.. ఈ చట్టం వల్ల ముస్లీంలు తమ హక్కును కోల్పుతామనే ఆందోళనలో ఉన్నారు. అయితే, దేశ పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ కిందకే వస్తుందనే తీరులో వక్ఫ్ బోర్టులు కోర్టులను ఆశ్రయిస్తున్న తరుణంలో.. ఈ మార్పులు తప్పనిసరి అంటోంది బిజెపి ప్రభుత్వం. అయితే, ఇందులో చేసిన మార్పులేంటీ.. ఈ సవరణలను వ్యతిరేకించేవారి వాదన ఏంటీ…? ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇందులో ఇలాంటి మార్పులను చేసింది..?

వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు

ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత భారతదేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్‌ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని.. ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్ట్‌లు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను.. స్వతంత్ర హోదాను వక్ఫ్‌ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది.

అత్యంత వివాదాస్పదమైనది ముస్లిమేతరులకు సభ్యత్వం

ఈ బోర్డులను ముస్లీంలలో బడా బాబులే నిర్వహిస్తున్నారనీ.. కాబట్టి, పేద ముస్లీంల ఆవేదన దృష్ట్యా ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలని బిజెపి ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. ఇందులో భాగంగా కొత్త చట్టంలో కీలక మార్పుల చేసింది. ఇందులో అత్యంత వివాదాస్పదమైనది ముస్లిమేతరులకు సభ్యత్వం ఇవ్వడం. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చాలని సవరణ బిల్లు సూచిస్తోంది. తద్వారా నిర్ణయ ప్రక్రియ విస్తృతంగా, పారదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడుతుంది.

తాజా సవరణలో వక్ఫ్ బై యూజ్‌ను తొలగింపు

ఇక తాజా సవరణలో వక్ఫ్ బై యూజ్‌ను తొలగించారు. దీని ప్రకారం.. దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న ఆస్తులను వక్ఫ్‌గా గుర్తించడం ఇకపై సాధ్యం కాదు. అంటే, ఢిల్లీలో పార్లమెంట్ భవనం వక్ఫ్‌దే అనే వాదన చెల్లదు. అలాగే, తమిళనాడులో ఊరు వక్ఫ్ కిందకు రాదు. ఇక, ఈ కొత్త సవరణలో వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్‌ లేదా నియమిత అధికారికి మార్చారు. దీనితో పాటు ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటు చేయాలని తాజా చట్టం చెబుతుంది. బోహ్రా, అగఖాని ముస్లిం సమాజాలకు కూడా ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయడానికి దీనితో అవకాశం ఉంటుంది. అలాగే, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. మరోవైపు, వక్ఫ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని అమలు చేయనున్నారు.

ట్రైబ్యునల్‌లో జిల్లాస్థాయి కోర్టు న్యాయమూర్తి..

వక్ఫ్ ట్రైబ్యునల్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ట్రైబ్యునల్‌లో జిల్లాస్థాయి కోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సభ్యులుగా ఉండనున్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పుపై 90 రోజుల్లో హైకోర్టులో అప్పీలు దాఖలు చేసే అవకాశం ఉండే విధంగా చట్టంలో మార్పులు చేశారు. ఈ సవరణలో చట్టం పేరును కూడా మార్చారు. వక్ఫ్ చట్టం-1995 అనేది ఇకపై.. యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ చట్టం-1995గా మారుతుంది. దీని ప్రకారం.. విద్యాసంస్థలు, మార్కెట్లు, గృహనిర్మాణ ప్రాజెక్టులను నిర్మించడం వంటి అభివృద్ధి ప్రయోజనాల కోసం వక్ఫ్ భూములను ఉపయోగించడానికి వక్ఫ్ బోర్డులను అనుమతించడం నూతన బిల్లు లక్ష్యంగా తెలుస్తోంది.

ముస్లింల నుంచి భూములను లాక్కోడానికే మార్పులని విమర్శ

అయితే ఈ సవరణలపై ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ… వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెబుతున్న ఆస్తి వక్ఫ్‌దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే, ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపిస్తున్నారు. ఇక, వక్ఫ్ చట్టంలో మార్పులకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషనర్‌ను నియమించాలి. ఆయన వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు.

ఆక్రమించుకున్న వారికే వక్ఫ్ భూములు వెళతాయనే ఆందోళన

అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరూ ఏడాది పాటు సవాలు చేయకపోతే అది వక్ఫ్‌ బోర్డుకు చెందుతుంది. అయితే దీని వల్ల, ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను అవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే, అనేకమంది వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్లు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వారికి ఈ ఛాన్స్ దొరుకుతుంది. దీంతో వక్ఫ్ భూములు ఆక్రమించుకున్నవారికే ఆ భూమి వెళుతుందనే ఆందోళన ఉంది.

వక్ఫ్ మొత్తం ఆస్తి, ఆదాయంలో షియా కమ్యూనిటికీ 15% వాటా

ఇక, బిల్లులోని ఇతర ప్రతిపాదనలలో షియా, సున్నీలతో పాటు బోహ్రా, అగాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం కూడా ఉంది. ప్రస్తుత చట్టం ప్రకారం, వక్ఫ్ మొత్తం ఆస్తి, ఆదాయంలో షియా కమ్యూనిటికీ 15 శాతం వాటా ఉన్నప్పుడు మాత్రమే షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి, ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీదులకు ముప్పు ఏర్పడుతుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యకం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే కానీ.. అది ముస్లింల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని అంటున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమని వాదన

ఈ బిల్లు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల సభ్యులను మార్చడం వల్ల ముస్లిమేతర సభ్యులు కూడా బోర్డ్ సభ్యులుగా ఉంటారు. అయితే, హిందూ, సిక్కు ధార్మిక సంస్థలను నియంత్రించే ఇలాంటి బోర్డుల్లో వారి వారి మతాల సభ్యులే ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డులో మాత్రం ఇతర మతస్తులు ఎలా ఉంటారన్నది ప్రధాన అభ్యంతరంగా కనిపిస్తోంది. వక్ఫ్ ముస్లిం వ్యక్తిగత చట్టంలో భాగం. కాబట్టి, వక్ఫ్‌ను నియంత్రించే సంస్థలలో ముస్లిమేతర సభ్యులను మెజారిటీగా అనుమతించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమే కావచ్చనే వాదన ఉంది.

కనీసం ఐదేళ్లు ఇస్లాంను ఆచరించే వ్యక్తులే వక్ఫ్ ఇచ్చేలా మార్పు

వక్ఫ్ ట్రిబ్యునళ్ల నుండి ముస్లిం చట్టంలో నిపుణుడిని తొలగించడం వల్ల వక్ఫ్ సంబంధిత వివాదాల పరిష్కారంపై ప్రభావం పడవచ్చనే ఆందోళన కూడా ఉంది. అలాగే, ఈ బిల్లు కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరించే వ్యక్తులకు మాత్రమే వక్ఫ్ ఇచ్చేవిధంగా పరిమితం చేస్తుంది. అలాంటి నిబంధన ఎందుకనేది మాత్రం అస్పష్టంగా ఉంది. ఈ విధానం వల్ల ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాలం ఇస్లాంను ఆచరించే వ్యక్తులకు.. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న వారికి మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుందని కొందరు అంటున్నారు.

ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కును ఉల్లంఘనని వాదన

ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెప్పే సమానత్వ హక్కును ఉల్లంఘించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ.. పార్లమెంట్‌లో ఎన్డీయే కూటమికి బిల్లును చట్టం చేసే మెజారిటీ బలం ఉంది. రాజ్యసభలోనూ గెలవడానికి అవకాశం లేకపోలేదు. కాబట్టి, బిల్లు చట్టంగా మారి తీరుతుందని అందరి అభిప్రాయం. అయితే, దీన్ని న్యాయం ముందు నిలబెడతామని ముస్లీం వర్గాలు చెబుతున్నాయి.

 

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×