ఏపీలో వందేభారత్ సేవలను మరింత విస్తరించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై- విజయవాడ మధ్య నడిచే వందేభారత్ కు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రైలును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ రైలు (20677/20678) చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తుండగా, ఇకపై నరసాపురం వరకు రానుంది. ఈమేరకు రైల్వే బోర్డు పొడిగింపు ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలోనే వందేభారత్ నర్సాపురం వరకు పరుగులు తీయనుంది.
ప్రస్తుతం ఈ వందేభారత్ రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 5.30 గంటలకు బయల్దేరి.. రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా 12.10 గంటలకు విజయవాడకు వస్తుంది. తాజాగా రైల్వే బోర్డు తీసుకున్న పొడిగింపు నిర్ణయంతో ఈ రైలు విజయవాడ నుంచి 11.50కి బయల్దేరి 12.25కు గుడివాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 1.30కి భీమవరం, 2.10కి నరసాపురం వస్తుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు నరసాపురంలో బయల్దేరుతుంది. 3.20కి భీమవరం, 4.10కి గుడివాడ, 4.50కి విజయవాడకు చేరుకుంటుంది. 4.55 గంటలకు బెజవాడ నుంచి బయల్దేరి సాయంత్రం 5.20కి తెనాలి, 6.30కి ఒంగోలు, రాత్రి 7.40కి నెల్లూరు, 8.50కి గూడూరు, 9.50కు రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది.
రైల్వే బోర్డు చెన్నై- విజయవాడ వందేభారత్ రైలు పొడిగింపు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఈ రైలు పొడిగింపు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. నరసాపురం రైల్వే స్టేషన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఈ పొడిగింపు సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Read Also: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?
చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నరసాపురం వరకు పొడిగించేందుకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. వందేభారత్ ను నరసాపురం వరకు తీసుకొస్తానని ఆయన గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు చెప్పారు. రైల్వే ఉన్నతాధికారుతో సమావేశమై చర్చించారు. నరసాపురం వరకు వందేభారత్ రైలు పొడిగిస్తే కలిగే లాభాల గురించి వివరించారు. మొత్తంగా ఇన్నాళ్లను ఆయన కృషి ఫలించింది. త్వరలో వందేభారత్ రైలు రాబోతోంది. ఈ రైలు రాకతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులతో పాటు కోనసీమ వాసులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవనుంది. అటు ఈ రైలు వచ్చేందుకు కృషి చేసిన శ్రీనివాసవర్మకు నరసాపురం ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు.
Read Also: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!