Marri Janardhan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ హైదరాబాద్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అకస్మాత్తుగా నిర్వహించిన తనిఖీలు తీవ్ర సంచలనం రేపాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ వచ్చిందని తెలిసి మోతీ నగర్‌లో తన ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. అయితే అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామునే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి.
మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లోకి సోదాలు సమయంలో పోలీసులు వెళ్లినప్పుడు.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన ఇంట్లోకి తన అనుమతి లేకుండా పోలీసులు ఎందుకు వచ్చారంటూ జనార్ధన్ వాగ్వాదానికి దిగారు. పోలీసులే తన ఇంట్లో డబ్బు బ్యాగులుపెట్టారని జనార్ధన్ ఆరోపించారు. ఆయన అనుచరుల ఆందోళనతో ఇంట్లోకి అనుమతించారు పోలీసులు.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే నాఇంట్లో సోదాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచేందుకే ఇలా డైవర్ట్ చేశారని అన్నారు. ఇక ఈ సోదాల్లో లోదుస్తులు తప్పా ఇంకేం దొరకలేదంటూ మర్రి జనార్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఒక్కరూపాయి కూడా దొరకలేదని ఈసీ చెప్పిందన్నారు మర్రి జనార్ధన్ రెడ్డి.
Also Read: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ శక్తి మేర ప్రచారం చేస్తున్నారు. ఈ సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ విషయంపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.