Hidden Risks of Multivitamins: మనం తినే భోజనంలో బలం లేదని భయపడి.. చాలా మంది డబ్బాల కొద్దీ మల్టీ విటమిన్ టాబ్లెట్లను మింగేస్తున్నారు. కానీ.. ఈ సింథటిక్ టాబ్లెట్స్ ప్రకృతి ఇచ్చే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలకు ప్రత్యామ్నామా? విటమిన్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం కంటే.. అవి మన కిడ్నీలపై చూపే ఒత్తిడి ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మన శరీరం విటమిన్లను ఎలా గ్రహిస్తుంది. టాబ్లెట్ కంటే ఆహారమే ఎందుకు మిన్న అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
బయో-అవైలబిలిటీ:
మన శరీరం విటమిన్లను గ్రహించే విధానాన్ని శాస్త్రీయంగా ‘బయో-అవైలబిలిటీ’అంటారు.
సహజ ఆహారం: మీరు ఒక నారింజ పండు తిన్నప్పుడు, అందులో కేవలం విటమిన్-సి మాత్రమే ఉండదు. దానితో.. పాటు ఫైబర్, ఫ్లేవనాయిడ్స్, ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి విటమిన్-సిని శరీరం సులభంగా గ్రహించేలా చేస్తాయి.
టాబ్లెట్లు: మాత్రలలో ఉండే విటమిన్లు విడిగా ఉంటాయి. వీటిని శరీరం త్వరగా గుర్తించలేదు. ఫలితంగా.. మీరు వేసుకునే 1000mg మాత్రలో సగం కూడా రక్తంలోకి చేరదు.
సింథటిక్ విటమిన్లు -కిడ్నీలపై భారం:
మనం వేసుకునే ప్రతి టాబ్లెట్ రక్తంలో కలిశాక, వడపోత కోసం కిడ్నీల వద్దకు వెళ్తుంది.
అధిక మోతాదు: ఆహారం ద్వారా విటమిన్లు అతిగా శరీరానికి చేరడం అసాధ్యం. కానీ మాత్రల ద్వారా విటమిన్ ఏ, డి, ఈ వంటివి శరీరంలో పేరుకుపోయి విషతుల్యం కావొచ్చు.
వడపోత కష్టం: కృత్రిమంగా తయారైన ఈ రసాయనాలను వడపోయడానికి కిడ్నీలు విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీ స్టోన్స్ లేదా ఇతర కిడ్నీల వ్యాధులకు దారి తీయవచ్చు.
ప్రకృతి ఇచ్చే ‘సూపర్ ఫుడ్స్’ మ్యాజిక్:
ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారంలో ‘సినర్జీ’ఉంటుంది.
పాలకూర: ఇందులో ఐరన్ మాత్రమే కాదు, దాన్ని గ్రహించడానికి అవసరమైన విటమిన్ సి కూడా కలిసి ఉంటుంది.
గుడ్లు: వీటిలో విటమిన్ బి12 తో పాటు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
టాబ్లెట్లలో ఇలాంటి సహజ సమతుల్యత ఉండదు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో లేదా డాక్టర్లు సూచించినప్పుడు మాత్రమే సప్లిమెంట్స్ వాడాలి తప్ప, వాటిని రోజూవారీ ఆహారంగా మార్చుకోకూడదు.
Also Read: గురక పెడుతున్నారా? అయితే ఈ 5 హోం రెమెడీస్ మీకోసమే!
టాబ్లెట్ల వల్ల వచ్చే ధీమా :
చాలామంది “నేను మల్టీ విటమిన్ వేసుకుంటున్నానుగా, జంక్ ఫుడ్ తిన్నా పర్లేదు” అనే భ్రమలో ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఫైబర్ లేని టాబ్లెట్లు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచలేవు. ప్రకృతి ఇచ్చే రంగురంగుల కూరగాయలు మీ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇది ఏ టాబ్లెట్ వల్ల సాధ్యం కాదు.
ఎప్పుడు వాడాలి?
గర్భిణీలు, తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారు లేదా రక్తహీనత వంటి లోపాలు ఉన్నవారు డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే సప్లిమెంట్స్ వాడాలి. సామాన్యులకు ఇంటి భోజనమే అసలైన ఔషధం.
విటమిన్లు అనేవి ఆహారంలో భాగంగా ఉండాలి కానీ, ఆహారానికి బదులుగా ఉండకూడదు. మార్కెట్లో దొరికే రంగురంగుల మాత్రల కంటే మీ పెరట్లో దొరికే ఆకుకూరలు, తాజా పండ్లలోనే ఎక్కువ జీవశక్తి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని డబ్బాల్లో వెతకకండి.. మీ డైనింగ్ టేబుల్‌పై ఉండే ప్రకృతి సిద్ధమైన ఆహారంలో వెతకండి. సరైన తిండి.. సగం రోగాలకు మందు.