Sleep: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలా మంది నిద్రను ఒక విలాసంగా భావిస్తున్నారు. పని ఒత్తిడి లేదా స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల రోజుకు కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్రపోవడం అలవాటుగా మారింది. అయితే.. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక వయోజనుడికి రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. వరుసగా 5-6 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల మీ శరీరంలో, మెదడులో జరిగే ప్రతికూల మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. మెదడు పనితీరు మందగించడం:
నిద్ర తక్కువైతే మెదడు సరిగ్గా విశ్రాంతి తీసుకోలేదు. దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడం లేదా కొత్త విషయాలను నేర్చుకోవడం కష్టమవుతుంది. కేవలం 5-6 గంటల నిద్ర వల్ల మీ మెదడు స్పందన వేగం తగ్గుతుంది. ఇది వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలకు దారి తీయవచ్చు.
2. మానసిక ఒత్తిడి, చిరాకు:
తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ‘కార్టిసోల్’ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. దీని వల్ల చిన్న విషయాలకే చిరాకు పడటం, కోపం రావడం ఆందోళన చెందడం వంటివి జరుగుతాయి. దీర్ఘ కాలంలో ఇది తీవ్రమైన డిప్రెషన్‌కు కూడా దారి తీయవచ్చు.
3. రోగనిరోధక శక్తి తగ్గడం:
మనం నిద్రిస్తున్నప్పుడు మన శరీరం ‘సైటోకిైన్స్’ అనే ప్రోటీన్లను విడుదల చేస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్లు, వాపులతో పోరాడటానికి సహాయ పడతాయి. నిద్ర తక్కువైతే ఈ ప్రోటీన్ల ఉత్పత్తి తగ్గి.. మీ రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది. ఫలితంగా మీరు తరచూ జలుబు.. దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడతారు.
4. బరువు పెరగడం, ఆకలి:
నిద్ర లేమి వల్ల శరీరంలోని ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఆకలిని పెంచే ‘గ్రెలిన్ హార్మోన్ పెరిగి, కడుపు నిండిన భావనను కలిగించే ‘లెప్టిన్ హార్మోన్ తగ్గుతుంది. దీని వల్ల మీరు నిద్ర తక్కువైన రోజుల్లో ఎక్కువగా జంక్ ఫుడ్ మరియు తీపి పదార్థాలను తినడానికి మొగ్గు చూపుతారు, ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.
Also Read: డైలీ 2 నిమిషాలు వాల్ సిట్టింగ్ చేస్తే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు
5. గుండె ఆరోగ్యంపై ప్రభావం:
నిరంతరం 5-6 గంటలే నిద్రపోవడం వల్ల రక్త పోటు పెరిగే అవకాశం ఉంది. ఇది గుండెపై అదనపు భారాన్ని పెంచుతుంది. తక్కువ నిద్రపోయే వారిలో గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
6. మధుమేహం ముప్పు:
తక్కువ నిద్ర శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి.. టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. అది మీ శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకునే సమయం. 5-6 గంటల నిద్ర మొదట్లో పర్వాలేదు అనిపించినా.. అది శరీరానికి ‘నిద్ర అప్పు’ లాగా మారుతుంది. ఇది మీ చర్మం ఛాయను తగ్గించి.. త్వరగా ముసలితనం వచ్చేలా చేస్తుంది. కాబట్టి.. ఆరోగ్య కరమైన జీవితం కోసం రాత్రిపూట కనీసం 7-8 గంటల గాఢ నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోండి.