Worshipping God: భారతీయ సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ఉదయం నిద్ర లేవగానే కరదర్శనం చేసుకోవడం ఒకటి. నిద్రలేచిన వెంటనే మన రెండు అరచేతులను చూసుకుని, రఆపై కళ్లకు అద్దుకోవడాన్నే కరదర్శనం అంటారు. ఈ ఆచారాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు పండితులు. అరచేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి(సంపద), మధ్యభాగంలో సరస్వతీదేవి(జ్ఞానం), మూలంలో విష్ణుమూర్తి(పోషకుడు) కొలువై ఉంటారని నమ్మకం. అందుకే, ఉదయం లేవగానే వారిని తలచుకుని ప్రార్థించడం ద్వారా ఈ రోజును సానుకూల శక్తితో ప్రారంభించ్చని పండితులు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక నమ్మకాలతో పాటు.. కరదర్శనం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉందంటున్నారు నిపుణులు. రాత్రంతా నిద్రలో మన కళ్లు, కంటి నరాలు కదలిక లేకుండా విశ్రాంతి తీసుకుంటుంటాయి కాబట్టి.. ఈ సమయంలో అవి బిగుసుకుపోతాయి. ఉదయం హఠాత్తుగా కళ్లు తెరవడం లేదా ప్రకాశవంతమైన కాంతిని చూడటం కంటికి హానికరం. ఈ కరదర్శనం చేసే ప్రక్రియ, ముఖ్యంగా అరచేతులను నెమ్మదిగా కళ్లకు అద్దుకోవడం, కంటి నరాలకు చిన్నపాటి వ్యాయామం వంటిది.
ఉదయం లేచిన వెంటనే కరదర్శనం చేసుకుంటే, కళ్లకు మెల్లగా కదలిక లభిస్తుంది. ఇది కళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అరచేతులను అద్దుకునేటప్పుడు ఏర్పడే వెచ్చదనం కంటి కండరాలను రిలాక్స్ చేసి, వాటిని ఉత్తేజపరుస్తుంది. ఈ ప్రక్రియ వల్ల కంటి దోషాలు రాకుండా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కళ్లకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్న ఈ రోజుల్లో, మన పూర్వీకులు సూచించిన ఈ సాధారణ ఆచారం కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన మార్గంగా చెప్పవచ్చు.
కరదర్శనం వల్ల కేవలం శారీరక ప్రయోజనం మాత్రమే కాదు.. మానసిక ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే భగవంతుడిని స్మరించుకుంటూ, మన అరచేతులను చూసుకోకుంటే మనలో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. మన చేతుల్లోనే దేవతలు కొలువై ఉన్నారనే భావన కలుగుతుంది. దీంతో మన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయనే ఆత్మవిశ్వాసం కూడా మనలో పెరుగుతుంది. అందుకే.. ఈ సాంప్రదాయ ఆచారాన్ని రోజూ పాటించడం వల్ల ఆశీస్సులు, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసంతో మీ కోజును ఉత్సాహంగా ప్రారంభించవచ్చు.