శీతాకాలం ప్రారంభమైందంటే చాలు తెల్లని ముల్లంగి దుంపలు మార్కెట్లో కుప్పలుగా కనిపిస్తాయి. ముల్లంగితో పరాటాలు, సలాడ్లు, కూర, వేపుడు, సాంబారు ఇలా రకరకాలుగా వండుకోవచ్చు. కాకపోతే ముల్లంగి నుంచి వచ్చే పచ్చి వాసనను కొంతమంది ఇష్టపడరు. దీనివల్ల కొంతమంది ముల్లంగిని దూరం పెడతారు. నిజానికి ఇది అద్భుతమైన కూరగాయ. కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో ఇది కూడా ఒకటి. ముల్లంగిలో మనకి అత్యవసరమైన పోషకాలు నిండుగా ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో ఖచ్చితంగా మీరు ముల్లంగిని తినాల్సిందే.
ముల్లంగిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. శీతాకాలంలో మారుతున్న వాతావరణం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని నుంచి మనల్ని కాపాడే శక్తి ముల్లంగిలోని పోషకాలకు ఉంది. ఇది ఒక వ్యక్తి త్వరగా అనారోగ్యం పాలవకుండా కాపాడుతుంది. ముఖ్యంగా హై బీపీ, డయాబెటిస్ వంటి రోగాలతో బాధపడుతున్న వారు కచ్చితంగా ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
ముల్లంగి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శీతాకాలంలో జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు అధికంగా వస్తాయి. అలాంటివారు ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోండి. ముల్లంగి తినడం వల్ల జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మీ పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.
శరీరంలో వ్యర్థాలను తొలగిస్తుంది
శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో ముల్లంగి ముందుంటుంది.శరీరంలో ఉన్న వ్యర్ధాలను, విషాలను బయటకు పంపిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో వివిధ విషపదార్థాలు పేరుకు పోతాయో అవి దీర్ఘకాలంలో వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి ముల్లంగిని డిటాక్సిఫికేషన్ కోసం కచ్చితంగా తినేందుకు ప్రయత్నించండి. ముల్లంగి తినడం వల్ల మూత్రపిండాలు కాలేయం బలంగా ఉంటాయి. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది.
మధుమేహం ఉన్నవారికి
మధుమేహం ఉన్నవారు ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ముల్లంగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు, ఎంత తిన్నా ఆరోగ్యమే తప్ప సమస్యలు రావు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో ముల్లంగి మొదటి స్థానంలో ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా ఆహారంలో ముల్లంగిని భాగం చేసుకోండి.
గుండె ఆరోగ్యానికి
ముల్లంగిలో ఆంథోసైనిన్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆంథోసైనిన్లు ఉత్తమ యాంటీ ఆక్సిడెంట్లు. కాబట్టి ఇవి గుండెను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. వాపును తగ్గిస్తాయి. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ వంటి వాటిని నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
అధిక రక్తపోటు అదుపులో
ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది అన్ని విధాలా ప్రయోజనకరం. పొటాషియం కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలను తింటే హైబీపీ కచ్చితంగా తగ్గుతుంది. శరీరంలోని సోడియం ప్రభావాన్ని తగ్గించే శక్తి పొటాషియంకి ఉంది. కాబట్టి ముల్లంగిని తినడం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది. అలాగే ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కూడా ఇది కాపాడుతుంది.