Tattoo: మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతోన్న నేటి యువతరం టాటూస్‌పై మోజు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో తమ మనసులోని భావాలకు ఓ రూపం రావాలంటే టాటూ.. ఇష్టసఖులపై ప్రేమ చాటి చెప్పాలంటే టాటూ.. ఆవేశం, అభిమానం, ప్యాషన్.. ఇలా అన్నింటికీ టాటూనే యువతకు ఓ భావ వ్యక్తీకరణ మార్గం. అంతలా నేటి కుర్రకారు మేనిని పెనవేసుకునే టాటూ కలకాలం నిలవాలన్నా.. కలతపెట్టే మరకగా మారకుండా ఉండాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు టాటూ నిపుణులు. మరి పచ్చబొట్టు వేయించుకునే ముందు, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..
పచ్చబొట్టు వేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే.. చర్మ సమస్యలు, తీవ్రమైన నొప్పి, వాపు వంటి ఇబ్బందులు తప్పవు. అందుకే, టాటూ ప్రక్రియకు ముందు రోజున టాటూ వేసుకోవాలనుకుంటున్న ప్రాంతంలో సులభంగా ఉండేలా వదులైన దుస్తులు ధరించాలి. ఇది చర్మాన్ని ఇబ్బంది పెట్టుకుండా, సులభంగా గాలి తగిలేలా చేస్తుంది. అలాగే, టాటూ ఎక్కడైతే వేసుకుంటారో.. ఆ ప్రాంతంలో చర్మం సున్నితంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ముందురోజు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీంతో పాటు ఆ ప్రాంతంలోని హెయిర్‌ను పూర్తిగా తొలగించుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది.
మీరు పచ్చబొట్టు వేసుకోవడానికి ఎంచుకున్న ప్రాంతం సున్నితంగా ఉన్నట్లయితే, సాధారణంగా ఇతర ప్రాంతాల కంటే నొప్పి, వాపు తగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది. దీంతో మీరు కూడా అసౌకర్యానికి లోనవుతారు. అంతేకాదు.. మెడ, మణికట్టు, వేళ్ల వంటి భాగాల్లో ఏవైనా గొలుసులు, వాచీలు, ఉంగరాలు ధరించే అలవాటు ఉన్నట్లయితే, ఆ ప్రాంతాల్లో టాటూ వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే.. ఆభరణాలు, దుస్తుల రాపిడి వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం లేకపోలేదు.
టాటూ వేయించుకోవాలనే కోరిక ఎంత బలంగా ఉన్నప్పటికీ.. తొందరపాటు ఉండకూడదు. మనం ఎంచుకునే ఆర్టిస్ట్ నైపుణ్యం, స్టూడియో పరిశుభ్రత వంటి వాటిపై కూడా శ్రద్ధ పెట్టాలి. పరిశుభ్రత ప్రమాణాలు పాటించే, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న స్టూడియోను ఎంచుకోవడం మీ చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. టాటూ నిపుణుల సలహాలను పాటించి, పూర్తి అవగాహనతో పచ్చబొట్టు వేయించుకుంటే, మీరు కోరుకున్న డిజైన్‌తో పాటు మీ ఆరోగ్యం కూడా మేలైన అనుభవాన్ని పొందుతుంది.