రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో తినుబండారాలను ఎమ్మార్పీకి మించి అమ్మకూడదంటూ ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ చాలా మంది తీరు మార్చుకోవడం లేదు. తాజాగా రైల్లో ఎక్కువ ధరకు ఫుడ్ అమ్మడాన్ని ప్రశ్నించిన ఓ ప్రయాణీకుడిపై క్యాటరింగ్ సిబ్బంది విచక్షణా రహితంగా దాడి చేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సదరు క్యాటరింగ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన అండమాన్ ఎక్స్ ప్రెస్ లో జరిగింది. రైలు ప్రయాణికులలో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. ఝాన్సీ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ సంఘటనలో తన భోజనానికి ఎక్కువ ఛార్జ చేయడాన్ని ఆయన ప్రశ్నించాడు. ఎక్కువ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. అధికారికంగా రూ.110 ధర నిర్ణయించిన థాలీకి.. రూ.130 చెల్లించమని క్యాటరింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. కానీ, అతడు ఎక్కువ డబ్బులు ఇవ్వనని చెప్పడంతో కోపంతో దాడికి పాల్పడ్డారు. అతడితో పాటు తోటి క్యాటరింగ్ సిబ్బంది కూడా ప్రయాణీకుడిపై కర్రతో దాడి చేశాడు. ప్రయాణీకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా, సదరు క్యాటరింగ్ సిబ్బంది రెచ్చిపోయి చితక బాదారు.
అదే బోగీలోని ప్రయాణీకులు ఈ దాడిని సెల్ ఫోన్లలో షూట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారతీయ రైల్వేలో పని చేస్తున్న క్యాటరింగ్ మాఫియా ఎలా ఉంటుందో ఈ ఘటన అద్దం పడుతోంది. ఇటువంటి క్యాటరింగ్ సిబ్బంది తరచుగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రశ్నించే ప్రయాణికులను బెదిరిస్తారా? అంటూ మండిపడుతున్నారు. క్యాటరింగ్ సిబ్బంది మీద తరచుగా ప్రయాణీకులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ, కఠినమైన చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. తూతూ మంత్రంగా జరిమానాలు విధించి సరిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. తాజాగా దాడికి పాల్పడిన క్యాటరింగ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి క్యాటరింగ్ లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితుడికి తగిన పరిహారం అందించాలంటున్నారు.
Catering Mafia of Indian Railways strike again. A passenger was brutally beaten on Andman Express at Jhansi Railway station after he refused to pay Rs. 130 for a thali priced at Rs. 110. @IRCTCofficial has introduced Mafias on train in the name of catering vendors. Assaults on… pic.twitter.com/Rp3J86JoL9
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) November 5, 2025
Read Also: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!
ఇలాంటి ఘటనలు జరిగినా విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, ప్రయాణీకుల పట్ల మరింత దారుణంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు నెటిజన్లు. క్యాటరింగ్ సేవలపై రైల్వే అధికారుల కఠినమైన పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడికి భద్రత, నమ్మకాన్ని కలిగించడం ఎంత అవసరమో ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయంటున్నారు. అయితే, ఈ ఘటనపై రైల్వే ఇంకా స్పందించలేదు. త్వరలోనే క్యాటరింగ్ సిబ్బంది తీరుపై స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?