Tollywood: ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీల వారసుల ఎంట్రీతో టాలీవుడ్ కళకళలాడుతోంది. ముఖ్యంగా యువ హీరోలు కూడా వినూత్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే దివంగత సూపర్ స్టార్ నటుడు కృష్ణ మనవడిగా , దివంగత నటుడు రమేష్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జయకృష్ణ ఘట్టమనేని. తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రోత్సాహంతో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తున్న ప్యూర్ లవ్ మాస్ యాక్షన్ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఇక ఈ చిత్రం ద్వారా కేజీఎఫ్ బ్యూటీ రవీనా టాండన్ వారసురాలు రాషా తడానీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మించిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసాయి. ఇక ఇప్పుడు తాజాగా ఆ అంచనాలను పెంచుతూ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ని బట్టి చూస్తే.. ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ప్యూర్ లవ్ స్టోరీ తో సినిమా ప్రారంభించి.. ఆ ప్రేమను గెలిపించుకోవడానికి ఆ జంట పడే పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు.
also read:పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?
గాయాల తాలుకు నొప్పితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న హీరోయిన్ మంగ (రాషా తడానీ)ని చూపిస్తూ ట్రైలర్ స్టార్ట్ చేశారు. అందులో హీరో శ్రీను (జయకృష్ణ) గన్ను పట్టుకొని కనిపించగా.. “ఎక్కడ నువ్వు కాదంటావేమో నన్న భయం కన్నా.. నాలో నేను బాధపడడం హాయిగా ఉంది” అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ థియేటర్లలో ఈలలు పడడం ఖాయమని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. కట్ చేస్తే పచ్చని అడవులలో తిరుపతి కొండలు.. భార్యా సమేతుడైన శ్రీనివాసుడిని చూపిస్తారు.” నీతో పరిచయమైనప్పటి నుంచి ఒక్కొక్క జ్ఞాపకం నా గుండెల్లో దాచుకొని నా ప్రేమను నాలోనే బంధించుకున్నాను” అని హీరో చెప్పే డైలాగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంప్రదాయ దుస్తుల్లో లంగా వోణీలో చాలా అందంగా ఒదిగిపోయింది రాషా తడాని. పైగా హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అలాగే హీరో జయకృష్ణ హీరోయిన్ తో చెబుతూ “తిరుపతినైనా ఎదిరిస్తాను.. కానీ నిన్ను మాత్రం వదలను మంగా” అనే డైలాగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే మోహన్ బాబు డైలాగ్స్ మరొకసారి పీక్స్ కి వెళ్ళిపోయాయి. ఇందులో విలన్ గా ఆయన అద్భుతమైన గెటప్లో కనిపించి.. ట్రైలర్ కే కొత్త అటెన్షన్ క్రియేట్ చేశారు.. ఇక ప్రేమ కథతో పాటు మాస్ యాక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమా జూలై 30 తేదీన థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. బ్రహ్మాజీ , అజయ్ , నరేష్, వాసుకి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయ కృష్ణ తొలి ప్రయత్నంలో రాబోతున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.