K Raghavendra Rao Fitness Secrets: కె. రాఘవేంద్రరావు… వయసు అక్షరాల 83 ఏళ్లు. ఈ వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు. కానీ ఈయన మాత్రం ఇంకా ఫిల్మ్ ఈవెంట్స్‌లో తళుక్కుమనడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ వయసులోనూ ఈ ఉత్సాహం, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తాయో, అసలు తన హెల్త్ సీక్రెట్ ఏంటో ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టేశారు. మరి అవేంటో చూసేద్దామా!
టేకిట్ ఈజీ పాలసీ
అందరూ అనుకుంటున్నట్టుగా రాఘవేంద్రరావు ఫిట్‌నెస్ వెనుక ఉన్న మొదటి సూత్రం ఎక్సర్‌సైజ్ అనుకుంటే పొరపాటే. అవును.. ఆయన అన్నింటికన్నా ఎక్కువగా నమ్మేది టేకిట్ ఈజీ పాలసీ. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా తేలికగా తీసుకోవాలి తప్ప కుంగిపోవద్దు అని అసలు రహస్యం బయటపెట్టారు.
also read: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మానియా.. 50 డేస్.. అన్‌స్టాపబుల్ రికార్డ్స్!
ఇక 80 ఏళ్లు దాటినా ఆయన ఫాలో అయ్యే వర్కవుట్ రొటీన్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఉదయాన్నే ఈత కొట్టడం లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం ఆయనకు అలవాటు. స్నానం చేసిన తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు మౌనంగా ధ్యానం చేస్తారు. ఇదే తన మానసిక ప్రశాంతతకు అసలు కారణమని తెలిపారు. సాయంత్రం వేళల్లో యోగా చేస్తూ శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకుంటారట మన దర్శకేంద్రులు.
ఆరోగ్యానికి అసలు రహస్యం
ఇక సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉదయం టిఫిన్ అంటే ఇడ్లీ, దోశలు ఉండాల్సిందే. కానీ రాఘవేంద్రరావు గారు మాత్రం వీటికి ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేశారట. అవును.. ఆయన ఉదయం పూట కేవలం బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ మరియు పండ్లను మాత్రమే తీసుకుంటారట.
ఇక మధ్యాహ్నం చాలా తక్కువగా ఆహారం ఉండేలా చూసుకుంటారట. రాత్రిళ్లు కూడా ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే కొందరు అంటున్నట్టు తనేమీ హిమాలయాల నీరు తాగనని, కేవలం తన లైఫ్ స్టైల్ ని ఒక సిస్టమాటిక్ గా పెట్టుకోవడమే తన అందానికి, ఆరోగ్యానికి అసలు రహస్యమని అసలు విషయం బయటపెట్టారు.
తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లు
ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “ఎన్టీఆర్ గారు నాకు దేవుడితో సమానం. ఆయన చెప్పిన ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి’ అనే మాటను నేను ఇప్పటికీ పాటిస్తాను” అని ఎమోషనల్ అయ్యారు.
ఇక ఇదే ఎన్టీఆర్‌తో ఆయన తీసిన ‘అడవి రాముడు’ (1977), ‘వేటగాడు’ (1979), ‘కొండవీటి సింహం’ (1981) వంటి చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా ఎనిమిది పదుల వయసులో కూడా రాఘవేంద్రరావు ఫాలో అవుతున్న ఈ క్రమశిక్షణ జీవనశైలిని చూసి ఇప్పటి కుర్రాళ్లు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది కాదనలేని సత్యం !
also read :బోసిపోయిన బాక్సాఫీస్ ..బలైపోయిన ఎగ్జిబిటర్స్ …ఈ వారమూ ఇంతేనా?