Kota Srinivas Rao Last Rights: విలన్ గా, కమెడియన్ గా, తండ్రిగా, మామగా, ఆఖరికి తాతగా కూడా నటించి విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) . గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. తన సినీ కెరియర్లో 750కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి నటించగలిగిన గొప్ప వ్యక్తులలో ఈయన కూడా ఒకరు. వరుస చిత్రాలలో నటిస్తూ.. కెరియర్ పీక్స్ లో ఉండగానే ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా యాక్సిడెంట్ లో మరణించడంతో ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ బాధ నుంచి బయటపడలేక పోయారు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. మరొకవైపు వృద్ధాప్యం. అయినా సినిమాల మీద ఆసక్తి పోలేదు. అయితే శరీరం సహకరించకపోయేసరికి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వ్యక్తిగత, సినిమా విషయాలను పంచుకుంటూ ఇప్పటికీ మన మధ్య కొనసాగారు కోటా శ్రీనివాసరావు.
తుది శ్వాస విడిచిన కోటా.. కన్నీటి పర్యంతమవుతున్న సెలబ్రిటీలు..
అలాంటి ఈయన అనారోగ్య సమస్యలతో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం అటు అభిమానులనే కాదు ఇటు సెలబ్రిటీలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న, మొన్నటి వరకు వరుస ఇంటర్వ్యూలతో ప్రేక్షకులను పలకరించిన కోట శ్రీనివాసరావు.. సడన్గా మరణించారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత సడన్గా ఏమైంది..? నిన్నే కదా అక్కడ చూసాం.. ఇక్కడ చూసాం.. ఆ ఇంటర్వ్యూలో చూసాం.. అంటూ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎవరు ఏం చెప్పినా ఇండస్ట్రీ నుండి ఒక శకం ముగిసిపోయింది. దిగ్గజ నటులుగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు.ఆయన పార్తివదేహాన్ని సందర్శించడానికి సెలబ్రిటీలు తరలివస్తున్నారు. ఇప్పటికే బాబు మోహన్ (Babu Mohan), రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), బ్రహ్మానందం (Brahmanandam) తో పాటు పలువురు సెలబ్రిటీలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.
మహా ప్రస్థానంలో నేడే అంత్యక్రియలు..
ఇదిలా ఉండగా ఈరోజే కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగియనున్నాయి. కోటా శ్రీనివాసరావు పార్థివదేహాన్ని ఆయన ఇంటి నుండి జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానానికి తరలిస్తారు. అనంతరం 12:30 అభిమానుల సందర్శనార్థం ఉంచి, ఆ తర్వాత 2:00 గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు కుటుంబ సభ్యులు.
కోటా శ్రీనివాసరావు ఆఖరి చిత్రం..
విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు చివరిగా 2023 మార్చి 11న విడుదలైన ‘దోచేవారెవరురా’ అనే సినిమాలో నటించారు. అంతేకాదు అదే ఏడాది ‘కబ్జా’ సినిమాలో కూడా నటించారు. ఇక వయసు మీద పడడంతో సినిమాలకు దూరమయ్యారు.
ALSO READ:Kota Srinivas Rao Demise: ఆయన మాటలు విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు తిన్న కోటా.. అసలేమైందంటే?