Kota Srinivas Rao Demise: కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నిజానికి ఈయన ఈ తరం ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోయినా.. 80, 90 సినీ ప్రేమీకులకు మాత్రం బాగా సుపరిచితులు. విలన్ గా, కమెడియన్ గా తండ్రిగా,మామగా ఇలా భిన్నమైన పాత్రలు పోషించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన విలక్షణమైన నటనతో ఏకంగా 750కి పైగా చిత్రాలలో నటించిన కోట శ్రీనివాసరావు.. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమాలు చేశారు. కానీ వృద్ధాప్య కారణాల వల్ల అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఇవాళ తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీని అఘాతంలోకి నెట్టివేసింది.
కోటా జీవితంలో చేదు ఘటన..
ఇదిలా ఉండగా.. ఈరోజు ఆయన మరణంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి ఆయన ఎదుర్కొన్న విమర్శలు.. ముఖ్యంగా ఒక సినిమా సమయంలో ఆయన సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) అభిమానుల ఆగ్రహానికి గురై వారి చేత దెబ్బలు కూడా తిన్నారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. నందమూరి తారక రామారావు సినిమాలలో ఒక అద్భుతమైన స్థాయికి చేరుకున్న తర్వాత తనను ఈ స్థాయికి చేర్చిన ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుని.. ‘తెలుగుదేశం’ అనే పార్టీని స్థాపించి.. ఆంధ్రప్రదేశ్లో పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కూడా ఏర్పరిచి రికార్డు సృష్టించారు.
మండలాధీశుడు సినిమాతో చిక్కుల్లో పడ్డ కోటా శ్రీనివాసరావు..
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) కొనసాగుతున్నారు . వాస్తవానికి సినిమాల దగ్గరనుంచి కృష్ణ – ఎన్టీఆర్ మధ్య లొసగులు ఉండేవట. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవి కాస్త తారాస్థాయికి చేరాయి. ఎలాగైనా సరే ఎన్టీఆర్ ను కించపరచాలి అని.. కృష్ణ కోటా శ్రీనివాసరావు చేత ‘మండలాధీశుడు’అనే సినిమాను చేయించారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో కోటా శ్రీనివాసరావు నటించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుపై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ రూపొందించిన సినిమా ఇది. అప్పట్లో అత్యంత వివాదాస్పదమైంది. సినీ, రాజకీయాల్లో కూడా ఈ చిత్రం ప్రకంపనలు సృష్టించింది. ఈ సంఘటన కోటా శ్రీనివాసరావుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది అని చెప్పవచ్చు. ఎంతలా అంటే ఆఖరికి ఎన్టీఆర్ అభిమానుల చేతుల్లో దెబ్బలు తినేంతలా..
ఎన్టీఆర్ అభిమానుల చేతుల్లో దెబ్బలు తిన్న కోటా..
ఇక ఇదే విషయాన్ని ఒకసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “మండలాధీశుడు సినిమా తర్వాత ఎన్టీఆర్ విజయవాడలో ఒక కార్యక్రమాన్ని ముగించుకొని.. హైదరాబాద్ కు వెళ్లడానికి రైల్వే స్టేషన్ కి వచ్చారు. ఆ సమయంలో నేను స్టేషన్ లో ఉన్నాను.పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జెండాలు కనిపించాయి. ఈ సమయంలో వచ్చి ఇరుక్కున్నానే అనుకుంటుండగానే.. కొంతమంది నన్ను చూసి గుర్తుపట్టారు. కోటా గాడు వచ్చాడు రా అంటూనే మీద పడి దాడి చేశారు. ఆ క్షణం నేను ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని పారిపోయాను” అంటూ తెలిపారు. మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ ను కించపరచలేదు. ఆయన ప్రవర్తనను మాత్రమే సినిమాలో చూపించాము. దాన్ని కూడా అభిమానులు తట్టుకోలేక పోయారు. దాంతో నాపై దాడి చేశారు అని కోట తెలిపారు. ఇదే విషయాన్ని అప్పట్లో కృష్ణ గారితో చెప్పగా.. ఆయన చిన్నగా నవ్వారు అని, ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో మాట్లాడి సమస్యను సాల్వ్ చేసామని కోటా శ్రీనివాసరావు తెలిపారు.