Gurthukostunnaayi series: వినోద్ గాలి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు ప్రధాన పాత్రల్లో జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. పెళ్లికి కొద్ది రోజుల ముందు జరిగిన ఒక ప్రమాదంలో తన జ్ఞాపకాలను కోల్పోయిన హీరోకి.. గతం గుర్తు చేయడంలో ఆయన ఫ్రెండ్స్ ఎలా సహాయపడ్డారు? అనే కథాంశంతో ఏడు ఎపిసోడ్లతో విడుదలైన ఈ సిరీస్ మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించిన శరత్ చంద్ర నాయుడు.. ఇప్పుడు సక్సెస్ఫుల్ నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
నిజానికి గత దశాబ్ద కాలానికి పైగా శరత్ చంద్ర నాయుడు తెలుగు సినీ పరిశ్రమలోని అతిపెద్ద చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల వెనుక కీలక పాత్ర పోషించారు. ఎన్నో విజయవంతమైన ప్రచార కార్యక్రమాలకు తోడ్పడిన ఈయన, ఇప్పుడు నిర్మాతగా తొలిసారి సినీ రంగంలోకి అడుగుపెట్టి.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆయన తొలి నిర్మాణమైన ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇకపోతే శరత్ చంద్ర నాయుడు ఈ సినిమాను నిర్మించడమే కాకుండా దర్శకుడు వినోద్ , రచయితల బృందంతో కలిసి సిరీస్ లోని పలు భాగాలకు రచనలో కూడా సహాయం చేశారు. ప్రేక్షకుల భావోద్వేగాలపై , కథనంపై ఆయనకున్న అవగాహన, తెరపై ప్రతిబింబిస్తూ ఈ ప్రాజెక్టులో ఆయన పాత్రకు మరో కోణాన్ని జోడించింది.
ఇకపోతే తాజాగా ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శరత్ చంద్ర నాయుడుని..” గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ ప్రయాణం ఎలా మొదలైంది?” అని ప్రశ్నించగా..” నా ఇంస్టాగ్రామ్ పాడ్ కాస్ట్ ‘రేలంగి మావయ్య’ తో ప్రారంభమైంది. అందులో నేను 90వ దశకానికి చెందిన జ్ఞాపకాలను నా స్వరంలో పంచుకుంటుంటాను. 90స్ వారి మంచి ఆదరణ లభించింది. ఆ కాలంలో పెరిగిన వారితో బలమైన అనుబంధం కూడా ఏర్పడింది. ఇక ఈ పాడ్ కాస్ట్ కంటెంట్ చూసిన తర్వాత ఈటీవీ విన్ కు చెందిన సాయి , నితిన్ ఆ భావోద్వేగాలను వెబ్ సిరీస్ గా మలిచే అవకాశం ఉందని భావించారు.అలా ‘గుర్తుకొస్తున్నాయి’ పుట్టుకొచ్చింది.
మైలురాయిని మరింత ప్రత్యేకంగా నిలిపింది మాత్రం అల్లు అర్జున్.. ఆయన నుంచి వచ్చిన ప్రోత్సాహం.. నా కొత్త ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన.. నన్ను వ్యక్తిగతంగా అభినందించడంతోపాటు బహిరంగంగా కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా నేను ఆయనతో పనిచేసిన టీమ్ సభ్యుల్లో ఒకరిగా నిలిచాను. ఇప్పుడు నిర్మాతగా నేను తొలి అడుగు వేయడంతో ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని అల్లు అర్జున్ ఎంకరేజ్ చేశారు. ఈ సంఘటన మా ఇద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని, అలాగే అల్లు అర్జున్ క్యాంపులో ప్రతిభను ప్రోత్సహించే సంస్కృతిని కూడా ప్రతిబింబించింది అంటూ శరత్ చంద్ర తెలిపారు.
“మార్కెటింగ్ లో నాకు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారో? వారిని నిజంగా ఏది ఆకట్టుకుంటుంది? అనే విషయం నేర్పించింది. ఆ అవగాహన వల్లే రచన నుండి నిర్మాణం వరకు సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విధానం వరకు.. ప్రతి దశలో కూడా సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సహాయపడింది” అంటూ తెలిపారు శరత్ చంద్ర నాయుడు. మొత్తానికైతే గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ ఎలా పుట్టుకొచ్చింది? దానిని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు? అనే విషయాలపై నిర్మాత స్పందించారు.
ALSO READ: మౌనీరాయ్ తో డేటింగ్.. అసలు నిజం బయటపెట్టిన అర్జున్!