Daali Dhananjay:ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు అభిమానులతో శుభవార్తలు పంచుకుంటున్నారు. కొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకొని వివాహ దిశగా అడుగులు వేస్తుంటే.. మరికొంతమంది వివాహం చేసుకొని తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందుతున్నారు. అంతేకాదు తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడుతున్నామని చెప్పి.. అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి అందరిని ఆశ్చర్యపరిచిన డాలీ ధనంజయ్ ఇప్పుడు తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈయన.. తెలుగులో పుష్ప , పుష్ప2 చిత్రాలలో విలన్ పాత్ర పోషించి ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అలాగే సత్యదేవ్ హీరోగా నటించిన ‘జీబ్రా’ సినిమాలో సెకండ్ హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది ఫిబ్రవరిలో ధన్యత అనే వైద్యురాలిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతున్నారు. తన భార్య గర్భం దాల్చింది అంటూ ఈ శుభవార్తను అభిమానులతో డాలీ స్వయంగా పంచుకున్నారు.
ఇటీవల ఒక అవార్డు వేడుకలో పాల్గొన్న డాలీ ఈ విషయంపై మాట్లాడుతూ.. “మా జీవితంలోకి మరొకరు రాబోతున్నారు. ఈ శుభవార్తను మీతో పంచుకోవాలనుకున్నాను.త్వరలో మరో కొత్త అధ్యాయం మా జీవితంలో ప్రారంభం కాబోతోంది” అంటూ డాలీ ధనుంజయ్ చెప్పుకొచ్చారు
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు డాలీ ధనుంజయ్, ధన్యత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:VD 14: విజయ్ కొత్త మూవీ నుండి బిగ్ అప్డేట్.. టైటిల్ టీజర్ కి డేట్ లాక్!
డాలీ కెరియర్ విషయానికి వస్తే.. డాలీగా పిలవబడే ఈయన అసలు పేరు కాలేనాహళ్లి అడవి స్వామి ధనంజయ.
కన్నడ, తెలుగు చిత్రాలలో పనిచేస్తూ నటుడిగా, నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్నారు. 2013లో తొలిసారి ‘డైరెక్టర్స్ స్పెషల్’ అనే చిత్రం ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ తొలి నటుడిగా సైమా అవార్డును దక్కించుకున్నారు. అలాగే వివిధ చిత్రాలలో నటించినందుకుగాను మూడు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు లభించాయి.
అలా ఒకవైపు హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ‘బడవ రాస్కెల్’ అనే చిత్రం ద్వారా నిర్మాతగా కూడా మారారు. 1985 ఆగస్టు 23న హాసన్ జిల్లాలోని అర్సికేరే తాలూకాలోని కాలేనాహళ్లిలో జన్మించారు. చదువులో బాగా రాణించేవారు. తను డాక్టర్ రాజ్ కుమార్ సినిమాలు చూస్తూ పెరిగానని.. అందుకే స్కూల్లో ఉండగానే నాటకాలు, మోనో యాక్టింగ్ పోటీలతో పాటు వీధి నాటకాల్లో కూడా నటించడం ప్రారంభించామని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈయన ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశారు. కానీ నటన రంగంలోకి అడుగుపెట్టి తన కలను నెరవేర్చుకున్నారు.