Assam Train Accident: అస్సాంలోని హోజై వద్ద శనివారం ఉదయం సైరంగ్-న్యూదిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు ఏనుగులు మృతి చెందగా, ఒక గున్న ఏనుగు గాయపడింది. ఐదు రైలు బోగీలు పట్టాలు తప్పడంతో.. రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
సైరంగ్-న్యూదిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొట్టిన ఘటనలో.. ఇంజిన్ సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. న్యూదిల్లీ వెళ్తున్న రైలు శనివారం తెల్లవారుజామున 2.17 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
రైలు బోగీలు పట్టాలు తప్పడంతో అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైలు సేవలపై ప్రభావితమయ్యాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులను ఇతర బోగీలకు ఎక్కించి, గౌహతి రైల్వే స్టేషన్ కు తరలించారు. అక్కడ మరికొన్ని అదనపు కోచ్ లను జత చేయనున్నారు. ఏనుగు కారిడార్ లో ఈ ప్రమాదం జరిగింది. ఏనుగుల గుంపును ట్రాక్‌పై గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లను వేశారు. అయినప్పటికీ, రైలు ఏనుగుల గుంపును ఢీకొని పట్టాలు తప్పింది.
గత ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా రైలు ఢీకొని 79 ఏనుగులు మరణించాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. 2020-21 నుండి 2024-25 వరకు దేశవ్యాప్తంగా 79 ఏనుగులు రైళ్ల ప్రమాదాల్లో మరణించాయని పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్ సభలో తెలిపారు.
Also Read: Special Intensive Revision: ప్రత్యేక సమగ్ర సవరణ.. భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపు
ఈ తరహా ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఏనుగుల కారిడార్ లో ట్రైన్ స్పీడ్ పై పరిమితి విధించడం, ట్రాక్‌ల దగ్గర ఏనుగులను భూకంప సెన్సార్ ఆధారంగా గుర్తించడం, అండర్‌పాస్‌లు, ర్యాంప్‌లు, ఫెన్సింగ్ నిర్మాణం వంటి పైలట్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఏనుగుల సంరక్షణపై అవగాహన పెంచడానికి 2023-2024లో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రైల్వే అధికారులు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. 3,452 కి.మీ.ల విస్తీర్ణంలోని 127 రైల్వే స్ట్రెచ్‌లలో సర్వే చేసి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రైలు ఢీకొనడాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం.