Bridge Collapse In Bihar: కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన ఓ బ్రిడ్జ్ ప్రారంభానికి ముందే కూలిపోయింది. దీంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. నాణ్యతా లోపం వల్లే బ్రిడ్జ్ కూలిపోయిందని సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి బ్రిడ్జ్ సరిగ్గా కట్టలేదంటూ స్థానికులు మండిపడుతున్నారు.
బీహార్‌లోని అరారియా జిల్లాలోని బక్రా నదిపై ఓ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ అరారియా జిల్లాలోని కుర్సా కాంతా, సిక్టీ ప్రాంతాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ పదరియా ఘాట్ సమీపంలో ఉంది. ఈ బ్రిడ్జ్ మంగళవారం ఒక్కసారిగా కూలిపోయింది. పెద్ద శబ్దాలు కావడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు.
విషయం తెలుసుకున్న అధికారులు కూలిన బ్రిడ్జ్ వద్దకు చేరుకుని పరిశీలించారు. ముందుగా మూడు పిల్లర్లు కూలిపోయినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: అస్సాంను వేధిస్తున్న వరదల సంక్షోభం..తిండి లేక తిప్పలు!
విశేషం ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఇంకా ప్రారంభమవ్వలేదు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినా అప్రోచ్ రోడ్డుల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ బ్రిడ్జ్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి మొత్తం రూ. 12 కోట్లు ఖర్చుచేశారు.
Bihar | A portion of a bridge over the Bakra River collapsed in Araria. Details awaited.#Bihar #BridgeCollapse pic.twitter.com/wCoKSVS5XA
— TIMES NOW (@TimesNow) June 18, 2024
రూ. 12 కోట్లు ఖర్చుచేసి నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభానికి ముందే కూలిపోవడం ప్రజలను విస్మయానికి గురి చేసింది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికి ఎమ్మెల్యే విజయ్ మండల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.