Trump Tariffs Effect: రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అదనపు టారిఫ్‌లతో మన జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై తక్షణమే తీవ్ర ప్రభావం పడనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెక్స్‌టైల్ ఎగుమతులను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ప్లాన్ సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈ దేశాల్లో మన ఉత్పత్తుల మార్కెట్ పెంచేలా ప్రోగ్రాం డిజైన్
యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెబుతోంది భారత వాణిజ్య శాఖ. ఈ దేశాల్లో మన ఉత్పత్తులకు మార్కెట్‌ను మరింత విస్తరించేలా ఈ ప్రోగ్రామ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. నాణ్యత, సుస్థిరతలో భారత్ నమ్మకమైన సరఫరాదారుగా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. వినూత్న టెక్స్‌టైల్ ఉత్పత్తులతో ఈ మార్కెట్లలో మన దేశం ప్రధాన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ కార్యాచరణను ప్రతిపాదించారని చెబుతున్నారు విదేశాంగ శాఖ అధికారులు.
ప్రస్తుతం 220 దేశాలకు ఎగుమతులు చేస్తోన్న భారత్
ప్రస్తుతం భారత్ 220 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇందులో ఈ 40 దేశాలు అత్యంత కీలకమైనవి. ఈ దేశాలన్నీ కలిపి ఏటా 590 బిలియన్ డాలర్లకు పైగా విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దేశాల్లో మార్కెట్ షేర్‌ను పెంచుకుంటే అది భారత్ కు మరింత మేలు చేసేలా భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. ట్రంప్ 50శాతం టారిఫ్‌ల వేళ ఈ ప్రత్యామ్నాయ మార్గాలు కీలకమని అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్ మ్యాపింగ్, డిమాండ్ ఎక్కువున్న వస్తువుల గుర్తింపు
మార్కెట్ మ్యాపింగ్, డిమాండ్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను గుర్తించడం వంటి చర్యలు చేపట్టారు. సూరత్, పానిపట్, తిరుపూర్, బదోహి వంటి ప్రాంతాల నుంచి తయారయ్యే ఉత్పత్తులకు ఈ 40 దేశాల్లో భారీ ఎత్తున ప్రచారం కల్పించాలని చూస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లు, వాణిజ్య మేళాలు, విక్రయదారులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. యునిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
పన్ను మినహాయింపు డిసెంబర్ 31 వరకూ పొడిగింపు
మరోవైపు, వస్త్ర పరిశ్రమకు మరింత ఊరట కల్పించేలా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై సుంకాన్ని తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మినహాయింపును ఏడాది చివరివరకు పొడిగించింది. ముడిపత్తి దిగుమతులపై ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు పన్ను మినహాయింపు ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇటీవల ప్రకటించింది. తాజాగా దాన్ని డిసెంబరు 31 వరకు పొడిగించారు. అంతకుముందు, భారత్‌లో పత్తి దిగుమతిపై 11శాతం పన్ను ఉండేది.
భారత్ పన్ను పెంచితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రూ.5-7 పెరిగే ఛాన్స్
ఇదిలా ఉంటే భారత్ కూడా రివర్స్‌లో కొన్ని అమెరికన్ దిగుమతులతో పన్ను పెంచితే ఆయా వస్తువులు ఇక్కడ ధరలు పెరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా భారత్ అమెరికా నుంచి ముడి చమురు, LPG దిగుమతి చేసుకుంటుంది. వీటిపై భారత్ పన్నులు పెంచితే, పెట్రోల్-డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు 5-7 రూపాయలు పెరగవచ్చని అంటున్నారు.
వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్స్ ధరలూ పెరగొచ్చు
అమెరికా నుంచి భారతదేశానికి అనేక పెద్ద యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి అవుతుంటాయి. వీటిపై కూడా పన్నులు విధిస్తే, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్స్ వంటి అనేక గృహోపకరణాలు ఖరీదైనవిగా మారే అవకాశముందని అంటున్నారు. పురుగు మందులు, రసాయన ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఇవి కూడా అమెరికా నుంచి వస్తాయి. వీటి ధరల పెరుగుదల వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తుంది. దాని ప్రభావం కూరగాయలు, ఆహార పదార్థాల ధరలపై కూడా కనిపిస్తుంది.
వీటి ధరలు తగ్గే అవకాశాలు పుష్కలం
ఏదీ నేరుగా చౌకగా ఉండదు. కానీ కొన్ని వస్తువులు తక్కువ ధరలకు దొరుకుతాయి. స్థానిక వస్తువుల వరద మొదలవుతుంది. అమెరికాకు వస్తువులను అమ్మే కంపెనీలు ఇకపై అక్కడ అమ్మలేకపోతే వారదే వస్తువులను ఇక్కడ అమ్ముతారు. ఇందువల్ల మరిన్ని మందులు, దుస్తులు, ఇతర ఇంజనీరింగ్ వస్తువులు మార్కెట్ ని ముంచెత్తుతాయి. ఇవి కొంచెం చౌకగానే దొరకొచ్చు. అమెరికా నుంచి వస్తువుల కొనుగోళ్లు తగ్గించి, రష్యా తదితర దేశాల నుంచి ఆర్డర్లు వస్తే, ధరలు కొంతకాలంపాటు స్థిరంగా ఉండవచ్చు.
Also Read: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు
సుంకాల మోతకు విరుగుడు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపడం
ఇదిలా ఉంటే ఈ మొత్తం సుంకాల మోతకు ఒకే ఒక్క విరుగుడు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఆపడమేనంటున్నారు వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవారో. తామిక్కడ ఈ యుద్ధాన్ని మోడీ యుద్ధంగా పిలుస్తున్నామని అన్నారాయన. రాయితీపై వస్తోందని భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్లే ఆ దేశం ఉక్రెయిన్ పై ఇంకా యుద్ధం చేయగలుగుతోందని.. అన్నారాయన. ఇప్పటికైనా మించి పోయింది లేదు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తే ఈ సుంకాల శాతం 25కి తగ్గించుకోవచ్చన్నారాయన.