Hit and Run Case: హర్యానాలోని గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న ఒక మహిళను కారు బలంగా ఢీకొట్టిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ భయానక దృశ్యాలను బాధితురాలు స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో.. ఈ విషయం వెలుగులో వచ్చింది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మహిళా బైకర్ సియాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ప్రమాద దృశ్యాలను నెట్టింట పోస్ట్ చేసిన ఆమె.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు చెప్పడానికి మాటలు రావడం లేదు. గురుగ్రామ్ రహదారులు ఏమాత్రం సురక్షితంగా అనిపించలేదు. ఎవరినైనా ఢీకొట్టి పారిపోవడానికి ఇలాంటి వాళ్లు అస్సలు భయపడటం లేదు’ అంటూ సియా ఆందోళన వ్యక్తం చేశారు. కారు బలంగా ఢీకొట్టడంతో సియా కిందపడిపోగా.. ఆమె బైక్ కొద్ది దూరం వరకూ వెళ్లి ఆగడం వీడియోలో గమనించవచ్చు.
🚨 WOMAN RIDER SHARES GURUGRAM HIT-AND-RUN VIDEO
A woman rider has shared a video alleging that a car driver repeatedly tried to approach and cut her off while she was riding with friends on Golf Course Road in Gurugram on Sunday.
According to her account, the driver allegedly… pic.twitter.com/8x17bfis4l
— contentkikamii (@contentkikamii) September 14, 2026
సియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన స్పోర్ట్స్ బైక్‌పై గ్రూప్ సభ్యులతో కలిసి వెళ్తుండగా గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. తొలుత కారులో ఆమెను ఫాలో అయిన నిందితులు.. యువతితో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఉండి.. బైక్‌ను పక్కకు ఆపాలని కేకలు వేశారు. బాధితురాలు వారి నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. వెనుక వస్తున్న ఆమె స్నేహితుడు ఆ కారును ఆమె దగ్గరకు రాకుండా అడ్డుగా ఉండేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ కారు డ్రైవర్ వేగంగా వచ్చి సియా బైక్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో తీవ్రంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సియా స్నేహితుడు ఒకరు ఆ కారును తరుముకుంటూ వెళ్లాడు. కొద్దిదూరంలో సిగ్నల్ వద్ద కారు ఆగడంతో ఆ డ్రైవర్‌ను నిలదీశాడు. అయితే తన తప్పు ఏమీ లేనట్లుగా ప్రవర్తించిన ఆ డ్రైవర్.. సిగ్నల్ పడగానే అక్కడి నుంచి వాహనాన్ని వేగంగా తీసుకెళ్లిపోయాడు. ఈ రచ్చ అంతా సియా హెల్మెట్‌కు ఉన్న యాక్షన్ కెమెరాలో రికార్డైంది.
Also Read: ఇంట్లో కరెంట్ లేకపోయినా.. మెుబైల్ ఛార్జింగ్ పెట్టొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఘటనపై గురుగ్రామ్ పోలీసులు తక్షణమే స్పందించాలని సియా విజ్ఞప్తి చేశారు. సదరు కారు రిజిస్ట్రేషన్ నంబర్, వాహన యజమాని వివరాలను కూడా ఆమె తన వీడియోలో బయటపెట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్యానా, గురుగ్రామ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. నిందితులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై అలా నిర్లక్ష్యంగా వారి పట్ల కఠినంగా వ్యవహరించారని విజ్ఞప్తి చేస్తున్నారు.