Power Cut Charging: పవర్ కట్స్ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. వేసవి, భారీ వర్షాలు, ఈదురు గాలులు ఇలా ఏదోక సమస్యతో విద్యుత్ సరఫరాకు విఘాతం కలుగుతూనే ఉంటుంది. ఇళ్లల్లో కరెంట్ లేనప్పుడు స్మార్ట్‌ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే కమ్యూనికేషన్ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అత్యవసర సమాచారం తెలుసుకోవాలన్నా, ఎవరికైనా కాల్ చేయాలన్నా ఫోన్ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కరెంట్ లేనప్పుడు కూడా మొబైల్ ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవడానికి ఈ 4 చిట్కాలు ఫాలో అవ్వండి.
కరెంట్ లేనప్పుడు ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి పవర్ బ్యాంక్ అత్యంత సులువైన, సురక్షితమైన మార్గం. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనే పవర్ బ్యాంక్‌ను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ శాతాన్ని చెక్ చేస్తూ ఉంటే బెటర్. పవర్ బ్యాంక్ సామర్థ్యాన్ని (mAh) బట్టి మీ ఫోన్‌ను ఒకటి కంటే ఎక్కువ సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
మీ వద్ద కారు ఉంటే దానిలోని USB పోర్ట్ లేదా ఛార్జింగ్ సాకెట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను రీఛార్జ్ చేయవచ్చు. అయితే కారు బ్యాటరీ పూర్తిగా ఖాళీ కాకుండా ఉండటానికి ఇంజిన్ ఆన్ చేసి ఉన్నప్పుడే ఫోన్‌ను ఛార్జ్ చేయడం ముఖ్యం. ఫోన్‌కు అవసరమైనంత ఛార్జింగ్ ఎక్కిన వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసి ఫోన్ ను తీసుకుంటే మంచిది.
ఛార్జింగ్ ఉన్న ల్యాప్‌టాప్‌ను తాత్కాలిక పవర్ బ్యాంక్ గా మార్చుకోవచ్చు. ల్యాప్‌టాప్‌కు సరిపోయే USB కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసి ఛార్జ్ చేయవచ్చు. సాధారణ వాల్ అడాప్టర్‌తో పోలిస్తే ల్యాప్‌టాప్ ద్వారా ఛార్జింగ్ ఎక్కడంలో కొంత సమయం ఎక్కువ పట్టినప్పటికీ అత్యవసర కాల్స్ చేయడానికి, ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కరెంట్ లేని సమయాల్లో ముఖ్యంగా ఎక్కువ రోజులు విద్యుత్ నిలిచిపోయినప్పుడు పోర్టబుల్ సోలార్ ఛార్జర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి సూర్యరశ్మిని ఉపయోగించి విద్యుత్‌ను తయారు చేసి.. స్మార్ట్‌ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేస్తాయి. అయితే వీటి పనితీరు ఎండ తీవ్రత, సోలార్ ఛార్జర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
Also Read: వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!
విద్యుత్ లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడంతో పాటు ఉన్న ఛార్జింగ్‌ను ఆదా చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందులో భాగంగా తొలుత ఫోన్ బ్యాటరీ 0%కి పడిపోకుండా చూసుకోవాలి. ఫోన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం, అవసరం లేని వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను ఆఫ్ చేయడం.. ‘బ్యాటరీ సేవర్’ మోడ్‌ను ఆన్ చేయడం వంటివి చేయాలి. దీని ద్వారా ఫోన్ బ్యాటరీని ఎక్కువ సమయం కాపాడుకోవచ్చు.