Aishwarya Lakshmi:సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత చాలామంది నెటిజన్స్ సొంత విషయాలపై దృష్టి పెట్టకుండా పక్క వారిపై ఎక్కువగా ఫోకస్ పెడుతూ వారిని విమర్శించే పనిలోనే మునిగిపోతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవడానికి సమయం ఉండదు కానీ.. పక్కవారి బట్టల గురించి మాట్లాడడానికి ముందుకు రావడం సిగ్గుచేటు అంటూ ప్రముఖ హీరోయిన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిజానికి ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ వస్త్రధారణ పై పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది తమపై వస్తున్న ట్రోల్స్ కి స్పందిస్తే.. మరికొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే తాను మాత్రం అలాంటి రకం కాదు అంటూ తనను, తన దుస్తుల విషయంలో ట్రోల్స్ చేస్తున్న వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి.
అందం, అభినయంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తమిళంలో సినిమాలు చేస్తూ.. తన సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె కొద్ది రోజుల క్రితం తిరువనంతపురంలో జరిగిన ఒక జువెలరీ షాప్ లాంచింగ్ కి హాజరైంది. అక్కడ ఆమె ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని గమనించిన ఐశ్వర్య లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. ఆ ఈవెంట్లో ఫోటోగ్రాఫర్లు నా ముఖాన్ని ఫోటో తీయకుండా.. కావాలనే తప్పుడు కోణాల నుంచి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు.ఆ అనుభవం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఎవరికైనా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సహజంగానే బాడీ లాంగ్వేజ్ మారుతుంది.
ముఖ్యంగా నా దుస్తులలో ఎలాంటి లోపం లేదు..కానీ అక్కడి కొందరి అసభ్యకరమైన ప్రవర్తన, వారు నన్ను చూసే చూపుల వల్లే అసౌకర్యానికి గురయ్యానని ,ఈ విషయాన్ని నెటిజన్లు ఎందుకు గ్రహించలేకపోయారో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు గురించి తక్కువ చేసే మాట్లాడే వారిని ఈ మధ్యకాలంలో ప్రశ్నించే వారే లేరు. కానీ మహిళలు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నీతులు చెబుతుంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ:రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!
మొదట్లో నాపై ట్రోల్స్ వచ్చినప్పుడు నేను అన్నింటినీ లైట్ తీసుకున్నాను. కానీ అవి రోజు రోజుకు పెరిగి పెద్ద చర్చ కావడంతో ఆశ్చర్యపోయాను. దేశ ఆర్థిక వృద్ధి లేదా వృద్ధాశ్రమాల్లో కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం చర్చించడానికి ఇక్కడ ఎవరికీ సమయం ఉండదు. కానీ పక్క వారి దుస్తుల గురించి మాట్లాడడానికి మాత్రం అందరికీ సమయం ఉంటుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది ఐశ్వర్య లక్ష్మి. ఇకపోతే ప్రస్తుతం ఈమె నటించిన చిత్రం ఆశా .ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం నేర్చుకోవాలి అని చెబుతూనే తనపై వచ్చిన ట్రోల్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ