Space Football: భారతీయ మూలాలున్న వ్యోమగామి అనిల్ మీనన్.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చోటుచేసుకున్న ఆసక్తికర దృశ్యాలను పంచుకున్నారు. వ్యోమగాములు ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. భూమిపైనే కాకుండా అంతరిక్షంలోనూ వీకెండ్స్ ఎంత విలువైనవో.. ఫుట్ బాల్ క్రీడ తమ వ్యోమగాముల బృందాన్ని ఎలా ఒక్కటి చేసిందో ఈ సందర్భంగా ఆయన కళ్లకు కట్టారు.
సాధారణంగా భూమి మీద ఫుట్‌బాల్ ఆడటానికి అంతరిక్షంలో ఆడటానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అక్కడి జీరో గ్రావిటీ వాతావరణంలో మనుషులతో పాటు వస్తువులు కూడా గాల్లో తేలుతుంటాయి. కాబట్టి బంతిని నేలపై దొర్లించడం అక్కడ అసాధ్యం. ఒక్క చిన్న కిక్ ఇచ్చినా కూడా బంతి గాల్లో తేలుతూ వెళ్లిపోతుంది. దీంతో వ్యోమగాములు గాల్లో తేలుతూ బంతిని కాలితో తన్నేందుకు యత్నించారు. అనిల్ మీనన్ షేర్ చేసిన ఈ వీడియో ఈ దృశ్యాలను చూడవచ్చు.
Football is one thing that brings us all together on the space station! On the weekend, it’s good to unwind because it helps us get ready for another busy week. pic.twitter.com/6xYuFUhLEn
— Anil Menon (@astro_anil) September 13, 2026
అంతరిక్షంలో వ్యోమగాముల జీవితం అత్యంత కఠినంగా సాగుతుంది. వారు నిరంతరం ప్రయోగాలు చేయడం, రోజూ కఠినమైన వ్యాయామాలు చేయడం తప్పనిసరి. భూమిపై ఉన్నట్లు గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడకుండా ఉండటానికి రోజువారీ వ్యాయామం చాలా అవసరం. ఇలాంటి కఠినమైన పని ఒత్తిడి తర్వాత లభించే కాస్త విరామం వారికి ఎంతో ఊరటనిస్తుందని అనిల్ మీనన్ అన్నారు.
అంతరిక్షంలో ఆడే ఈ ఆట కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదు. సాధారణంగా వేర్వేరు దేశాలు, సంస్కృతుల నుంచి వచ్చిన వ్యోమగాములు సుదీర్ఘ కాలం పాటు ఆ చిన్న ప్రదేశంలో కలిసి జీవించాల్సి ఉంటుంది. నిరంతరం మానసిక ఒత్తిడి ఉండే వాతావరణంలో ఇలాంటి సరదా ఆటలు వారి మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని పెంచుతాయి. ఫుట్‌బాల్ వంటి క్రీడలు వ్యోమగాములందరినీ ఒక్కటి చేసే ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతున్నాయి.
Also Read: మహిళా బైకర్‌ను రోడ్డుపై వెంటాడి.. ఘోరంగా ఢీకొట్టిన ఆకతాయిలు.. వైలర్ అవుతున్న వీడియో!
మెుత్తంగా అనిల్ మీనన్ పంచుకున్న ఈ వీడియో అంతరిక్ష ప్రయోగాల వెనుక ఉండే సాధారణ మానవ జీవితాన్ని పరిచయం చేస్తోంది. వ్యోమగాములు కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా భోజనం చేయడం, వ్యాయామం చేయడం, విశ్రాంతి తీసుకోవడం వంటివి భూమిపై మనలాగే చేస్తారని ఇది గుర్తుచేస్తోంది. నింగిలో బంతి అలా తేలడం చూడటానికి ఒక చిన్న అంశంగా అనిపించినా భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి, ప్రశాంతంగా ఉండటానికి ప్రతి ఒక్కరికీ క్రీడలు అవసరమని ఈ ఘటన చాటిచెబుతోంది.