Secunderabad: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు వివిధ ప్రాంతాలకు వచ్చి చేరుతోంది. ఇదే సమయంలో మౌలాలి వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున నిప్పురవ్వలు రావడంతో రైలులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అసలు ఘటన ఎలా జరిగింది?
విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోంది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ, ఇంటర్ సిటీ మౌలాలి వద్దకు రాగానే రైలుపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వెంటనే గమనించిన లోకో పైలట్, రైలుని నిలిపివేశాడు. రైలు భోగీల్లో శబ్దాలు రావడంతో రైలు నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానాన్ని సాంకేతిక సమస్యగా చెబుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు.
రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు, కరెంట్ తీగలను పునరుద్ధరించి ఇంటర్ సిటీ రైలులో ప్రయాణికులను సికింద్రాబాద్ వరకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో వరంగల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడవాల్సిన పలు రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం యథావిధిగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి సుమారు 22.38 గంటలకు జరిగినట్టు చెబుతున్నారు.
ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్-OHE విఫలమవడంతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఘటన సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అప్రమత్తమైన రైలును లోకో పైలట్ సురక్షితంగా నిలిపివేశారని అధికారులు చెప్పారు. అదృష్టవశాత్తూ వేగంగా స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పిందన్నారు. సికింద్రాబాద్ నుంచి అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాలలో ఇది కూడా ఒకటి.