Under Sea Ancient Cities: శతాబ్దాలుగా కంటికి కనిపించని వింతలు, విజ్ఞానాలు సముద్ర గర్భంలో ఎన్నో దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో అనేక ప్రాచీన నగరాలు నీటి అడుగున ఉన్నట్లు తేలింది. ఒకప్పుడు మానవ నాగరికతకు నిలయాలుగా వెలిగిన ఈ నగరాలు.. కొన్ని వందల, వేల సంవత్సరాల క్రితమే జలసమాధి అయ్యాయి. భారత్ లోని ద్వారకా తరహాలో సముద్ర గర్భంలోకి వెళ్లిపోయిన ప్రపంచంలోని టాప్ – 5 ప్రాచీన నగరాల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఈజిప్టులోని నైలు నది ముఖద్వారం వద్ద వెలిసిన ‘తొనిస్-హెరాక్లియాన్’ ఒకప్పుడు అత్యంత వైభవంగా వెలిగిన ఓడరేవు నగరం. గ్రీస్ నుంచి వచ్చే నౌకలకు ఇది ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉండేది. అప్పట్లో వ్యాపార వాణిజ్యాలకు కేంద్రంగా ఉన్న ఈ నగరం.. భూకంపాలు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల క్రమంగా నీటిలో మునిగిపోయింది. నేడు ఆర్కియాలజిస్టులు ఇక్కడ అనేక విగ్రహాలు, నాణేలు, పురాతన భవనాల అవశేషాలను కనుగొన్నారు.
గ్రీస్ తీరంలో ఉన్న ‘పావ్లోపెట్రి’ దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నాటిదని ఆధారాలు చెప్తున్నాయి. నీటి అడుగున ఉన్నప్పటికీ ఇక్కడి రహదారులు, ఇళ్లు, సమాధులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. తీవ్రమైన భూకంపాలు, వరదల కారణంగా ఈ నగరం సముద్రంలో మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రాచీన పట్టణ నిర్మాణం ఏ విధంగా ఉండేదో తెలుసుకోవడానికి ఈ నగరం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు.
జమైకాలోని ‘పోర్ట్ రాయల్’ ఒకప్పుడు వ్యాపారానికి, దొంగతనాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. విలాసవంతమైన జీవితానికి పేరుగాంచిన ఈ నగరాన్ని 1692లో సంభవించిన ఘోరమైన భూకంపం, సునామి ఒక్క రోజులోనే నాశనం చేసింది. నగరం ఎక్కువ భాగం సముద్రంలోకి జారిపోయింది. అప్పటి జీవన విధానాన్ని స్పష్టంగా చూపించే శిథిలాలు నేటికీ నీటి అడుగున కనిపిస్తాయి.
ఈజిప్టులోని చారిత్రాత్మక నగరంగా ‘అలెక్సాండ్రియా’ గుర్తింపు పొందింది. ఈ నగరానికి సంబంధించిన రాజభవనాలు, ప్రముఖ కట్టడాలు మధ్యధరా సముద్రంలో మునిగిపోయాయి. తీరప్రాంతంలో వచ్చిన మార్పులు, భూకంపాల వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. సముద్ర గర్భంలో జరిపిన అన్వేషణల్లో ఈ నగరానికి చెందిన అనేక పురాతన కళాఖండాలు, రాతి విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!
ప్రాచీన రోమ్ కాలంలో సంపన్నులు విడిది చేయడానికి ‘బేయే’ (Baiae) నగరానికి వెళ్లేవారు. ఇక్కడ అత్యంత విలాసవంతమైన భవనాలు, ప్రత్యేక స్నానపు ఘట్టాలు ఉండేవి. అయితే అగ్నిపర్వతాల ప్రభావంతో ఇక్కడి భూమి క్రమంగా క్రుంగిపోయి, ఈ నగరం నీటి అడుగునకు చేరింది. నేటికీ స్కూబా డైవర్లు నీటి అడుగున ఉన్న ఈ భవనాలను, శిల్పాలను సందర్శిస్తుంటారు.
Also Read: అడవిలో పారేసిన 12 టన్నుల నారింజ వ్యర్థాలు.. 15 ఏళ్ల తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!