Chennai: హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరెస్టయిన ఉదయనిధి స్టాలిన్‌కు బిగ్ రిలీఫ్. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని తంజావూర్ పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఆయన్ని విచారించిన తర్వాత విడుదల చేస్తామని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆయనకు సూచన చేసింది.
ఫేమస్ హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను మంగళవారం ఉదయం తంజావూర్ పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితిని గమనించిన ఉదయనిది, మద్రాస్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్టు చేసే ఉద్దేశం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలియజేశారు. ఈ కేసులో ఓ మహిళ గుర్తింపు ఇమిడి ఉందని, చట్టపరమైన ప్రక్రియ ప్రకారం అదుపులోకి తీసుకుని విచారించడం అవసరమని పేర్కొన్నారు. ఆయన్ని జ్యుడీషియల్ కస్టడీకి గానీ, రిమాండ్‌కు గానీ పంపే ప్రణాళికలు లేవని పేర్కొన్నారు.
ఈ ఘటన తంజావూరు జిల్లాలో జరిగిందని ప్రస్తావించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం అక్కడికి తీసుకు వెళ్తున్నారని తెలిపారు. ఈ విచారణ కేవలం దర్యాప్తు ప్రక్రియలో భాగమేనని వెల్లడించారు. ఉదయనిధిని అరెస్టు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కోర్టుకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం వాదనను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు, దర్యాప్తు సంస్థలు అవసరమైన విచారణలు జరపవచ్చని తెలిపింది. విచారణ తర్వాత ఉదయనిధి స్టాలిన్‌ను విడుదల చేయాలని పేర్కొంది. అతడ్ని రిమాండ్‌కు పంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కావేరీ జలాల సమస్యపై తంజావూరులో డీఎంకే నిరసన కార్యక్రమం చేపట్టింది. అందులో ప్రతిపక్ష నేత ఉదయనిధి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. సభకు హాజరైన కార్యకర్తలు నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. డబుల్ మీనింగ్ వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఉదయనిధి. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ టీవీకే మహిళా వింగ్ తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఉదయనిధిపై ఆరు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉదయనిధిని ఇంటి వద్ద అరెస్ట్ చేసి తంజావూరుకు తరలించారు పోలీసులు.
ALSO READ: E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరసన.. ప్రధాని నివాసానికి పాదయాత్ర!