Ticketless woman tears clothes on train| రైల్లో టికెట్ చెకింగ్ సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. టికెట్ చూపించాలని టిటిఇ.. ఒక మహిళా ప్రయాణికురాలిని ప్రశ్నించడంతో ఆమె టికెట్ చూపించకుండా వాగ్వాదం చేసింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆమె తన దుస్తులను తానే చించుకుని తనను బలవంతం చేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేయబోయింది.. కానీ అనుకోకుండా ఆమె అనుకున్నది జరగలేదు.
ఈ ఘటన సెప్టెంబర్ 17న దానాపూర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. అందులో ఒక మహిళ ఓ చిన్నారితో కలిసి దానాపూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణిస్తోంది. రెండో ఏసీ కోచ్‌లో టికెట్ చెక్ చేస్తున్న సిబ్బంది ఆమెను టికెట్ చూపించాలని అడిగారు. అయితే ఆమె టికెట్ చూపించ లేదు. రిజర్వేషన్ టికెట్ తీసుకోవాలని సిబ్బంది సూచించినప్పటికీ ఆమె వాగ్వాదానికి దిగింది. అనంతరం ఆమె చిన్నారితో కలిసి 3 ఏసీ కోచ్‌కు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
టికెట్ తనిఖీ సిబ్బంది ఏసీ కోచ్‌కు కూడా వెళ్లారు. అక్కడ మహిళకు మరోసారి టికెట్ తీసుకోవాలని సూచించారు. ఆమె మాత్రం వాదన కొనసాగించింది. టికెట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పింది. అయితే అందుకుగాను ఆమె వద్ద కనీసం రెగులర్ కంపార్ట్‌మెంట్ టికెట్ తప్పనిసరిగా ఉండాలని సిబ్బంది తెలిపాడు.
మహిళకు ఎదురుగా కూర్చున్న ఓ ప్రయాణికుడు ఈ వాగ్వాదాన్ని తన ఫోన్‌లో రికార్డు చేశాడు. వీడియోలో మహిళ తన సోదరుడికి ఫోన్ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. తన సోదరుడు కూడా TTEగా పనిచేస్తున్నట్లు ఆమె చెప్పింది. రైల్వే పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్ కోసం ఆమె ఫోన్‌లో వెతికినట్లు కూడా కనిపిస్తోంది. తర్వాత ఆమె TTEపై చర్య తీసుకుంటానని, ఇబ్బందుల్లో పడేస్తానని బెదిరించిడం మొదలుపెట్టింది.
వాగ్వాదం సమయంలో తన సోదరుడితో ఫోన్లో మాట్లాడుతూ తనపై టిటిఇ బలవంతం చేస్తున్నాడని, తన బట్టలు చించేస్తున్నాడని చెప్పింది. ఇంతలో మహిళ తన దుస్తులను తానే చించుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆమె సిబ్బందిని దూషిస్తూ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటనపై రైల్వే కంట్రోల్‌కు సమాచారం ఇవ్వాలని TTEలు చర్చించుకున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. దీంతో అధికారులు ముందుగానే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.
రైలు సుమారు సాయంత్రం 4 గంటలకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ చేరుకుంది. అక్కడ RPF మహిళా సిబ్బంది రైలులోకి చేరుకున్నారు. మహిళను రైలు నుంచి దించి ఘటనపై ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. వీడియో తీసిన ప్రయాణికుడు ఆ రికార్డింగ్‌ను రైల్వే సిబ్బందికి చూపించాడు. ఆ వీడియోలో ఘటనకు ముందు జరిగిన పరిణామాలు కూడా కనిపించడంతో అధికారులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు.
Also Read: రైలు ప్రయాణంలో ఫ్యామిలీకి వేర్వేరు సీట్లు వచ్చాయా? ఇదిగో ముందుగానే ఇలా మార్చుకోండి
రైల్వే అధికారుల ప్రకారం.. మహిళ తన పేరు రాధికా తివారీగా తెలిపింది. ఆమె దానాపూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. చివరికి ఆమెకు జరిమానాతో పాటు టికెట్ జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆమెను వెళ్లేందుకు అనుమతించారు. రైల్వే అధికారులు.. మహిళతో రైల్వే టిటిఇ అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలను ఖండించారు. మొత్తం చర్య రైల్వే నిబంధనల ప్రకారమే జరిగిందని తెలిపారు.