PM Modi: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు నోరు విప్పారు. దేశ భవిష్యత్తుకు వెన్నెముక లాంటి విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం తీవ్రమైన పాపమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం మనందరి జాతీయ బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళ్ మిలన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పేపర్ లీకేజీకి కారకులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఏమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు.
యువతను రెచ్చగొట్టొద్దు..
ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని విపక్షాలకు ప్రధాని మోదీ హితవు పలికారు. “పిల్లలను ఉద్వేగాలకు గురిచేసి రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు. తప్పుడు మార్గంలోకి వెళ్లడం చాలా సులభం, కానీ మళ్లీ తిరిగి సరైన మార్గంలోకి రావడం ఎంతో కష్టం. యువతను సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది” అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో అనవసర గందరగోళం సృష్టించకుండా నిర్మాణాత్మకమైన చర్చలు జరపాలని, దేశ అభివృద్ధికి, యువత సంక్షేమానికి ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మాట్లాడిన ఈ కీలక విషయాలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు.
విద్యా వ్యవస్థలో లోపాలు.. ఢిల్లీ వీధుల్లో విపక్షాల పోరు
ఈ ఏడాది మే నెలలో జరిగిన నీట్ పరీక్ష లీకేజీ ఆరోపణలతో జూన్‌లో మళ్లీ పరీక్ష నిర్వహించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు సీబీఎస్‌ఈ 12వ తరగతిలో కొత్తగా తెచ్చిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలోనూ అనేక సాంకేతిక లోపాలు వెలుగుచూశాయి. వరుసగా వెలువడుతున్న ఈ లీకేజీ వార్తలతో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు, ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శల దాడిని పెంచాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వేలాదిమంది నిరసనకారులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకురావడంతో రాజధాని ఢిల్లీ పరిసరాలు కాసేపు రణరంగాన్ని తలపించాయి.
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా దక్కేనా?
ఒకవైపు విద్యార్థులు, తల్లిదండ్రులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతుండగా, మరోవైపు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ స్వయంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వాల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రధాని హామీతోనైనా విద్యా వ్యవస్థలో కట్టుదిట్టమైన మార్పులు వస్తాయా అని అంతా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలకు తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విప్లవాత్మక చర్యలు తీసుకోబోతోందో వేచి చూడాలి.
Also Read: రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్