Pakistan Operation Sindoor| భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దాడుల కారణంగా పాకిస్తాన్‌కు 1.12424 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9630 కోట్లు భారత కరెన్సీ) నష్టం జరిగిందని నివేదికలు తెలిపాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలు, సి-130 రవాణా విమానం, హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థ, రెండు మొబైల్ కమాండ్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. అలాగే, సర్గోధా ఎయిర్ బేస్‌లోని రాడార్, కమాండ్ సౌకర్యాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాల మరమ్మత్తుకు సుమారు 100 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా.
పాకిస్తాన్ వైమానిక దళంలో ముఖ్యమైన ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత సైన్యం ఉపయోగించిన ఉపరితల-గగన రక్షణ క్షిపణి (సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్) ద్వారా సర్గోధా ఎయిర్ బేస్ సమీపంలో కూల్చివేయబడ్డాయి. నాలుగు ఎఫ్-16 విమానాల ధర సుమారు 349.52 మిలియన్ డాలర్లు (ఒక్కో విమానం 87.38 మిలియన్ డాలర్లు). అలాగే, సి-130 రవాణా విమానం ధర 40 మిలియన్ డాలర్లు. రెండు మొబైల్ కమాండ్ సెంటర్లు (ఒక్కోటి 5 మిలియన్ డాలర్లు) 10 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లగా.. హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థ నాశనం కావడంతో మరో 200 మిలియన్ డాలర్ల భారీ నష్టం పాకిస్తాన్ చవిచూసింది.
భారత వైమానిక దళం (ఐఎఎఫ్) మే 7, 2025న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఈ దాడులు జరిగాయి. భారత నియంత్రిత కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉన్నాయని భారత్ ఆరోపించింది. ఈ ఉగ్ర సంస్థలకు చెందిన తొమ్మిది శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత్ ఈ ఆపరేషన్‌ను చేపట్టింది.
ఈ దాడుల్లో బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా, తెహ్రా కలాన్‌లోని సర్జల్, కోట్లీలోని మర్కజ్ అబ్బాస్, ముజఫరాబాద్‌లోని సయ్యద్‌నా బిలాల్ క్యాంప్‌లు జైష్-ఎ-మహమ్మద్‌కు సంబంధించినవి. అలాగే, మురిద్కేలోని మర్కజ్ తైబా, బర్నాలాలోని మర్కజ్ అహ్లే హదీస్, ముజఫరాబాద్‌లోని సవాయ్ నల్లా క్యాంప్‌లు లష్కర్-ఎ-తొయిబాకు చెందినవి. ఈ శిబిరాలను భారత వైమానిక దళం రాత్రి వేళల్లో కచ్చితంగా టార్గెంట్ చేసి నాశనం చేసింది.
Also Read: త్వరలోనే పాకిస్తాన్ 4 భాగాలుగా చీలిపోతుంది.. ఇండియా మాజీ డిజిఎంవో వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఈ దాడులను ఖండిస్తూ.. భారత్ పౌర ప్రాంతాలను, మసీదులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. అయితే, భారత్ ఈ దాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే జరిగాయని, పాకిస్తాన్ సైనిక లేదా పౌర సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. మే 10, 2025న భారత్, పాకిస్తాన్ ఇరు దేశాలు.. కాల్పలు విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. భూమి, వాయు, సముద్రం మార్గాల్లో సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించాయి.
ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. పాకిస్తాన్‌కు ఈ దాడులు ఆర్థికంగా, సైనికంగా భారీ నష్టాన్ని కలిగించాయి. సర్గోధా ఎయిర్ బేస్‌తో పాటు భారత సైన్యం దాడి కారణంగా ఇతర సైనిక సౌకర్యాలకు జరిగిన నష్టంతో పాకిస్తాన్ వైమానిక దళ సామర్థ్యం క్షీణించింది.