Independence Day 2025: మన దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప రోజు అంటే అది ఆగస్టు 15. ప్రతీ సంవత్సరం భారతదేశం గర్వంతో, గౌరవంతో జెండా ఎగురవేసే రోజు. కానీ ఈ రోజుకి సంబంధించిన పలు ఆసక్తికరమైన నిజాలు చాలామందికి తెలియవు. ఎందుకు ఆగస్టు 15నే భారత స్వాతంత్ర్య దినోత్సవంగా గుర్తించామో అసలు ఆ రోజున ఏం జరిగిందో… మనం నిజంగా ఆ రోజు స్వతంత్రులమయ్యామా లేదా అన్నదాకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
భారత స్వాతంత్ర్యం అనేది ఓ దీర్ఘకాల పోరాటం ఫలితం. 1857 నుండి 1947 వరకు లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న విజయం. కానీ ఈ 90 ఏళ్ల యుద్ధానికి ముగింపు దొరికిన రోజున, దేశ ప్రజల ఆశలు తీరిన రోజున, ఒక వెలుగు కనిపించిన రోజునే చీకటి కూడా అలముకున్నది. ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన కూడా జరిగింది. దేశం రెండు భాగాలుగా విడిపోయింది – భారతదేశం, పాకిస్తాన్. ఈ రెండు దేశాల మధ్య విభజనతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హింస, మారణహోమం, కుట్రలు, వ్యథలు… ఇవన్నీ కూడా అదే రోజున ప్రారంభమయ్యాయి.
1945లో జపాన్‌పై బ్రిటన్ విజయం సాధించిన రోజే ఆగస్టు 15
మనకు స్వాతంత్ర్యం ఇచ్చిన రోజును మనం ఎంచుకోలేదు. ఆ నిర్ణయం బ్రిటిష్ వాళ్లదే. లార్డ్ మౌంట్‌బాటెన్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒక వ్యక్తిగత కారణంతో ఆగస్టు 15ను తేది గా ఎంచుకున్నాడు. 1945లో జపాన్‌పై బ్రిటన్ విజయం సాధించిన రోజే ఆగస్టు 15. ఆ విజయం తాను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పిన మౌంట్‌బాటెన్, భారతదేశం స్వాతంత్ర్యానికి కూడా అదే తేదీని నిర్ణయించాడు. మన స్వతంత్ర్య దినోత్సవం కూడా మనం నిర్ణయించుకోలేకపోయిన రోజు.
ఆ రోజు భారత దేశ ప్రజలకు రాజ్యాంగం ఉండేది కాదు. మన దేశం పాలన బ్రిటిష్ వాళ్ల తయారుచేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారమే కొనసాగింది. మనం స్వతంత్ర దేశంగా మారిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్లే మన దేశపు మొదటి గవర్నర్ జనరల్‌గా కొనసాగారు. అంటే మౌంట్‌బాటెన్ స్వాతంత్ర్యం ఇచ్చిన రోజే మళ్లీ మన మీదే అధికారం కొనసాగించాడు. ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితి.
ఆగస్టు 15 నాడు రాజ్యాంగం లేదు
ఆగస్టు 15 నాడు మనం గణతంత్ర దేశం కాలేదు. రాజ్యాంగం లేదు. మన దేశపు అధికారం ఇంకా విదేశీయుల పట్లే ఉన్నట్టుంది. అంతేకాక, స్వాతంత్ర్యాన్ని మనం రాత్రి 12 గంటల సమయంలో స్వీకరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజున ఉదయం అమావాస్య. భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం అమావాస్యను శుభ దినంగా పరిగణించరు. అందుకే బ్రిటిష్ అధికారికంగా మద్దతిచ్చే సమయంలో, మధ్య రాత్రి సమయంలోనే మన నాయకులు — ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ — ప్రసంగించారు. అదే ప్రసంగం ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అంటూ చరిత్రలో నిలిచిపోయింది. కానీ ఆ స్వాతంత్ర్య వేళ ఎంతో మంది కన్నీటితో ఉదయం లేచారు. ఎందుకంటే గృహహింస, దేశ విభజన వల్ల ఏర్పడిన బలహీనత, కుటుంబాలను విడదీసిన పరిస్థితులు అన్నీ అదే రోజున చరిత్రలో స్థానం సంపాదించుకున్నాయి.
1950 జనవరి 26న గవర్నర్ జనరల్ స్థానం నుండి రాష్ట్రపతి స్థాయికి
మన దేశపు రాజ్యాంగం మాత్రం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అదే రోజు మనం నిజమైన స్వతంత్ర గణతంత్ర దేశంగా మారాము. అప్పుడే మనకు రాష్ట్రపతి వ్యవస్థ వచ్చింది. అప్పుడే మనం బ్రిటిష్ రాజుకు వీడ్కోలు పలికాం. ఆ తర్వత మనం గవర్నర్ జనరల్ స్థానం నుండి రాష్ట్రపతి స్థాయికి మారాం. ఇప్పటికీ చాలా మంది ఆగస్టు 15 అంటే ఆనందంగా జెండా వేదికలపై పాటలు పాడే రోజు మాత్రమే అని భావిస్తారు. కానీ ఆ రోజులో ఉన్న బాధ, చీకటి, కన్నీరు కూడా మనం మరవకూడదు. అది ఒక ఉద్యమం ముగిసిన రోజు మాత్రమే కాదు. మరో పెద్ద సంఘర్షణ ప్రారంభమైన రోజు కూడా.
స్వాతంత్ర్యం అనేది కేవలం జెండా ఎగరేసే దినం కాదు. అది మన మానవ హక్కుల క్షణం. మనకున్న బాధ్యతను గుర్తు చేసే సందర్భం. స్వేచ్ఛ అంటే ఏది కావాలో మనం ప్రశ్నించుకునే రోజు. ఆగస్టు 15 అనేది చరిత్ర పాఠం మాత్రమే కాదు… అది మన ఆత్మను పరీక్షించే పరీక్షా సమయం. ఈ రోజున మనం వందే మాతరం అంటాం… కానీ ఆ మాటల వెనక ఉన్న బాధ, త్యాగం, చావులన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం జెండా ఎగురవేస్తున్న ప్రతీసారి… వేల మందికి వారి జీవితాలే నష్టమైన రోజు కూడా గుర్తుకు రావాలి. అటువంటి రోజు గురించి మాట్లాడినపుడు గర్వంతో పాటు బాధ్యత కూడా మాతో ఉండాలి. స్వతంత్ర్య దినోత్సవం అంటే ఆనందం, ఉత్సవం, సంబురం మాత్రమే కాదు… అది చరిత్రలో ఎన్నో కన్నీటిని కలగలిపిన దినం కూడా.