Rs 2000 note status: ఏటీఎంలో కాస్త గమనించారా.. ఆ కలర్ నోటు కనిపించడం మానేసింది? అయినా చేతిలో ఆ నోటు ఇంకా ఉందే అనుకుంటున్నారా..? అదేంటి.. బ్యాంకులు తీసుకుంటాయా? చలామణిలో ఉందా? రద్దు చేశారా? ఇంకా విలువ ఉందా..? ఇలాంటి ప్రశ్నలతో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.
ఇంతకాలం మౌనంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడే బిగ్ క్లారిటీ ఇచ్చింది. అధికారికంగా పార్లమెంటరీ స్థాయి కమిటీ ముందు స్పష్టత ఇచ్చిన RBI గవర్నర్ తాజా ప్రకటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇంతకు ఆ నోటు ఏది? ఎందుకింత చర్చ అని ఈజీగా తీసివేయవద్దు. అసలు విషయంలోకి వెళితే..
రూ. 2,000 నోట్లు.. ఇంకా చలామణిలో ఉన్నాయా?
పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం సమావేశంలో ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రూ. 2,000 నోట్లపై ఎంపీలు అడిగిన ప్రశ్నలపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఆయన మాటల ప్రకారం, ఈ నోటు ఇప్పుడు చలామణిలో లేదని తేల్చి చెప్పారు. అయితే అది ఇప్పటికీ లీగల్ టెండర్ గానే ఉంటుందని స్పష్టం చేశారు. అంటే, చట్టపరంగా ఈ నోటును తిరస్కరించలేమన్న మాట!
ఎంత విలువ ఉన్న నోట్లు ఇంకా చలామణిలో?
జూలై 1, 2025 నాటికి భారత్‌లో రూ. 2,000 నోట్లు సుమారు రూ.6,099 కోట్ల విలువకు మాత్రమే ఇంకా చలామణిలో ఉన్నాయి. ఇది మొదటిసారి కాదు, 2023 మే 19న ఆర్బీఐ అధికారికంగా ఈ నోట్లను వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి నోట్ల తిరిగి పొందే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
98% నోట్లు రిటర్న్ అయ్యాయ్
ఆర్బీఐ నివేదిక ప్రకారం, 2024 డిసెంబరు నాటికి సుమారు 98.08% నోట్లు ప్రజలు తిరిగి ఇచ్చారు. అంటే 3.56 లక్షల కోట్ల రూపాయల విలువ గల నోట్లలో కేవలం 6,839 కోట్ల రూపాయల విలువ గల నోట్లు మాత్రమే ఇప్పటికీ మిగిలి ఉన్నాయి.
Also Read: Paderu view point: ఆకాశాన్ని తాకే కొండలు.. చేతికి అందే మేఘాలు.. ఏపీలో ఈ స్పాట్ మిస్ కావద్దు!
ఇంకా ఎలా ఇవ్వచ్చు?
ఈ నోట్లను ఇప్పటికీ దేశంలోని ఏ పోస్ట్ ఆఫీసు నుంచైనా ఇండియా పోస్ట్ ద్వారా ఆర్బీఐకి పంపించి, బ్యాంక్ ఖాతాలో జమ చేయించుకోవచ్చు. అయితే బ్యాంకుల్లో మార్చుకునే గడువు 2023 అక్టోబర్ 7తో ముగిసింది. అక్టోబర్ 9, 2023 నుంచి కేవలం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే మార్పిడి సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఈ 19 ఆర్బీఐ కార్యాలయాలు ఎక్కడెక్కడ?
అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం.. వీటిలోనే మార్పిడి కొనసాగుతుంది.
నకిలీ నోట్లు ఉన్నాయట!
ఈ సమావేశంలో రూ. 500 నోట్లకు సంబంధించిన నకిలీ నోట్ల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఒక్క ఏడాదిలో సుమారు 1.12 లక్షల నకిలీ నోట్లు గుర్తించబడ్డాయని సభ్యులు చెప్పారు. అయితే, మొత్తం రూ.6 కోట్లకు పైగా చలామణిలో ఉన్న నోట్లలో ఇది తక్కువ శాతం మాత్రమేనని వారు పేర్కొన్నారు. గవర్నర్ కూడా ఈ విషయాన్ని ఆమోదించారు. ప్రభుత్వంతో కలిసి ఆర్బీఐ నకిలీ నోట్ల నివారణపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.