AP Women: మహిళలను శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రతి ఫ్యామిలీలో ఓ మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన పనులు తెర వెనుక శరవేగంగా జరుగుతున్నాయి. అంతేకాదు మహిళలకు 2 లక్షల వరకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది.
వచ్చే మహిళా దినోత్సవం నాటికి ఏపీలో లక్ష మందిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని కంకణం కట్టుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా సర్వే చేపట్టనుంది ప్రభుత్వం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సర్వే జరగనుంది.
ప్రస్తుతం మహిళలను నిర్వహిస్తున్న పరిశ్రమల వద్దకు నేరుగా అధికారులు వెళ్లనున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తారు. మహిళలు ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు? ఎంతవరకు ఆదాయం వస్తుంది? ఉపాధి ఎంతమంది పొందుతున్నారు? వాటి వివరాలను తీసుకుంటారు. సేకరించిన సమాచారం ఆధారంగా వాటిని మూడు యూనిట్లగా విభజించనున్నారు.
జీవనోపాధి, ఎంటర్‌ప్రెన్యూర్, ఎంటర్‌ప్రైజెస్ వాటిగా వర్గీకరించనున్నారు. వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రెడీ చేస్తారు. సర్వేలో అర్హులైన మహిళలను గుర్తించనుంది ప్రభుత్వం. వారు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ఆర్థిక చేయూత అందించనుంది ప్రభుత్వం. బ్యాంకుల నుంచి రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు రుణం ఇప్పించనుంది.
ALSO READ: ఏపీ లిక్కర్.. జగన్ ఫ్యామిలీ మెడకు ఉచ్చు?
ఇదికాకుండా స్త్రీనిధి స్కీమ్ ద్వారా రూ. లక్ష వరకు ఇప్పించనుంది. ఎస్సీ, ఎస్టీ ఉన్నతి పథకం కింద 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు అందించాలని ఆలోచన చేస్తోంది. యూనిట్ విస్తరణ కోసం రుణాలు పొందాలంటే కనీసం మరొకరికి ఉపాధి కల్పించాలనే నిబంధనను పాటించాలి. ఈ విషయాన్ని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో చాలా మంది మహిళలు స్వయం సహాయక సంఘాలను విజయవంతంగా నడుపుతున్నారు. డెయిరీ, పచ్చళ్లు, ఆహార శుద్ధి, కలంకారి, పేపర్ ప్లేట్లు వంటివి ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఫోటోలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు కూడా.
మరి మహిళా పారిశ్రామిక వేత్తల పథకం గురించి తెలుసుకోవాలని భావించేవారు స్థానిక డీఆర్‌డీఏ అధికారులను సంప్రదించాలని చెబుతోంది ప్రభుత్వం. మొత్తానికి వచ్చే ఏడాది మహిళా దినోత్సవం నాటికి ఆ లక్ష్యాన్ని టార్గెట్ చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.